తేలిన లెక్క
వరంగల్: వరంగల్ జిల్లాలోని 317 పంచాయతీల్లో మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. రెండు విడతల్లో ఇప్పటి వరకు 16 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొదటి విడత ఎన్నికలు జరిగే 91 పంచాయతీల్లో 11 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవం కావడంతో 80 పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు 214 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 800 వార్డుల్లో 214 మంది ఏకగ్రీవం కావడంతో 585 వార్డులకు 1,533 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈనెల 11న మొదటి విడత పోలింగ్ నిర్వహించనున్నారు. రెండో విడత ఎన్నికలు జరిగే 117 పంచాయతీల్లో ఐదుగురు సర్పంచ్‌లు ఏకగ్రీవం కావడం, సంగెం మండలంలోని ఒక పంచాయతీలో సర్పంచ్ స్థానానికి నామినేషన్ పడకపోవడంతో మిగిలిన 111 సర్పంచ్ స్థానాలకు 360 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే 1,008 వార్డుల్లో 97 వార్డులు ఏకగ్రీవం కావడం మరో ఐదు వార్డుల్లో నామినేషన్లు పడకపోవడంతో మిగిలిన 906 వార్డుల్లో 2,142 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈనెల 14వ తేదీన రెండో విడత పోలింగ్ నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. మూడో విడత నామినేషన్ల పరిశీలన పూర్తి కాగా ఈ నెల 9వ తేదీన ఉపసంహరణ అనంతరం పోటీలో ఉండే అభ్యర్థుల లెక్క తేలనుంది. ఇప్పటికే మూడు విడత ఎన్నికలకు పోలింగ్ అధికారులు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేశారు.
హనుమకొండ జిల్లాలో 11 జీపీలు..
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలో మొదటి విడత 69 గ్రామపంచాయతీలు, 658 వార్డులకు, రెండో విడతలో 73 గ్రామ పంచాయతీలు, 694 వార్డుల్లో నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యింది. ఈ క్రమంలో మొదటి విడత భీమదేవరపల్లి మండలంలోని వీర్లగడ్డ తండా, ఎల్కతుర్తి మండలంలోని గుంటూరుపల్లి, శాంతినగర్, కమలాపూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామపంచాయతీలు వార్డు సభ్యులతో సహా ఏకగ్రీవమయ్యాయి. ఈ లెక్కన 69 గ్రామ పంచాయతీలకు నాలుగు పూర్తిస్థాయిలో ఏకగ్రీవమయ్యాయి. అదేవిధంగా భీమదేవరపల్లి మండలంలోని గాంధీనగర్ సర్పంచ్ స్థానం ఏకగ్రీవమైంది. ఇందుకు సంబంధించిన వివరాలు జిల్లాస్థాయిలో అధికారులు శుక్రవారం వెల్లడించారు. రెండో విడత ధర్మసాగర్ మండలంలోని కేశవనగర్, నర్సింగరావుపల్లి, హసన్‌పర్తి మండలం కొత్తపల్లి, వేలేరు మండలం బండతండా, చింతల్‌తండా పూర్తి కార్యవర్గాలు ఏకగ్రీవమయ్యాయి. హసన్‌పర్తి మండలంలోని అర్వపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ స్థానం మాత్రమే ఏకగ్రీవమైది. ఈ వివరాలు అధికారులు ప్రకటించారు. ఇక తుది విడత ఎన్నికలు జరిగే మండలాల్లో ఏకగ్రీవాలు తేలాల్సి ఉంది. జిల్లాలో మొత్తం రెండు విడతల్లో ఇప్పటి వరకు 11 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.
వరంగల్ జిల్లాలో రెండు విడతల్లో
16 ఏకగ్రీవాలు
జోరుగా సాగుతున్న ప్రచారం


