అవినీతి రహిత సమాజం కోసం పాటుపడాలి
హన్మకొండ: అవినీతి రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని, దీన్ని ఒక బాధ్యతగా స్వీకరించాలని జిల్లా ప్రిన్సిపల్, సెషన్స్ జడ్జి డాక్టర్ కె.పట్టాభి రామారావు అన్నారు. విజిలెన్స్ వారోత్సవాల్లో భాగంగా వరంగల్ ప్రాంతీయ నిఘా, అమలు అధికారి కార్యాలయం ఆధ్వర్యంలో శనివారం హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు వాకథాన్ నిర్వహించారు. ఈ వాకథాన్‌ను జిల్లా ప్రిన్సిపల్, సెషన్స్ జడ్జి డాక్టర్ పట్టాభి రామారావు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిబద్ధత, పారదర్శకత, నైతిక విలువలు ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలన్నారు. వరంగల్ ప్రాంతీయ నిఘా, అమలు అధికారి కార్యాలయం అడిషనల్ ఎస్పీ ఎస్.శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ.. అక్టోబర్ 27 నుంచి ఈనెల 2 వరకు విజిలెన్స్ అవేర్‌నెస్ వీక్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా.. ప్రతీ రోజు ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వ శాఖల్లో అవకతవకలు, అవినీతి జరిగినట్లు గుర్తిస్తే 14432 నంబర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. అనంతరం వరంగల్ గొర్రెకుంట ఈఎస్‌ఐ ఆస్పత్రిలో అటవీ శాఖ అధికారుల ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ వాకథాన్‌లో జిల్లా రెవెన్యూ అధికారి గణేశ్, విజిలెన్స్ డీఎస్పీ బి.మల్లయ్య, ఇన్‌స్పెక్టర్లు బి.అనిల్‌కుమార్, కిశోర్, ఆయా శాఖల అధికారులు ఎ.శ్రీనివాస్ నాయక్, మల్సూరు, రమేశ్, జె.లక్ష్మారెడ్డి, మున్సిపల్, అటవీ శాఖ అధికారులు ఎస్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ వలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
జిల్లా ప్రిన్సిపల్, సెషన్స్ జడ్జి
డాక్టర్ కె.పట్టాభి రామారావు


