ప్రమాద స్థలం పరిశీలన
ఎల్కతుర్తి : భీమదేవరపల్లి మండలంలోని కొత్తపల్లి శివారులో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని శనివారం అధికారులు పరిశీలించారు. వరంగల్ కమిషనరేట్ రోడ్డు సేఫ్టీ వింగ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, రవాణా శాఖ డీటీఓ రమేశ్ రాథోడ్, సీఐ పులి రమేశ్, నేషనల్ హైవే ఏఈ ప్రశాంత్ ఉన్నారు. అధికారులు ప్రమాదం జరిగిన కారణాలను సమీక్షించి, రహదారి పనుల్లో నిర్లక్ష్యం చోటు చేసుకోకుండా కాంట్రాక్టర్‌కు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ప్రమాద సూచిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. రాత్రివేళ డ్రైవర్లకు కనబడేలా లైటింగ్ సదుపాయం, రిఫ్లెక్టీవ్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ముల్కనూర్ ఎస్సై రాజు, సిబ్బంది ఉన్నారు.
ఉదయం ప్రిపరేషన్..
రాత్రి చోరీలు
● అప్పులు తీర్చడం కోసం దొంగతనాలు
● పోలీసులకు చిక్కిన యువకుడు
హసన్‌పర్తి : ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షలకు సిద్ధమవుతూనే మరో వైపు రాత్రి వేళ చోరీలకు పాల్పడుతున్న ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈమేరకు శనివారం కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్‌స్పెక్టర్ ఎస్.రవికుమార్ మాట్లాడారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన సెండే అరుణ్‌కుమార్ మూడేళ్ల క్రితం డిగ్రీ పూర్తి చేశాడు. ఓ ఏడాదిపాటు ఇంట్లోనే ఖాళీగా గడిపాడు. 2024లో ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలకు సిద్ధం కావడానికి హనుమకొండకు వచ్చి అద్దె గది తీసుకున్నాడు. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేరవుతూ బెట్టింగ్‌కు బానిసై అప్పులు చేశాడు. అప్పులు తీర్చడం కోసం దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. గోపాలపురం, భీమారం ఏరియాల్లో తాళాలు వేసి ఉన్న 10 ఇళ్లలో రాత్రి వేళ చోరీలకు పాల్పడ్డాడు. పెగడపల్లి డబ్బాల వద్ద గుర్తు తెలియని వాహనంపై పారిపోతుండగా పెట్రోలింగ్ చేస్తున్న సిబ్బంది నిందితుడిని పట్టుకున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు. నిందితుడి నుంచి 40 గ్రాముల బంగారు ఆభరణాలు, 50 గ్రాముల వెండి ఆభరణాలతోపాటు రూ.56,400 నగదు స్వాధీనం చేసుకున్నట్లు రవికుమార్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ సుమారు రూ.6 లక్షలు ఉంటుందని చెప్పారు. నిందితుడిని పట్టుకోవడంలో అత్యంత ప్రతిభ కనబరిచిన ఎస్సై శ్రీకాంత్, నవీన్‌కుమార్‌తో పాటు పోలీస్ సిబ్బంది అహ్మద్ పాషా, రాజశేఖర్, జితేందర్, సీసీఎస్ సిబ్బంది మధు, చందును పోలీస్ ఇన్‌స్పెక్టర్ అభినందించారు.
ప్రమాద స్థలం పరిశీలన


