కార్యదర్శి లేక చెల్లింపులు పెండింగ్
వరంగల్ : వరంగల్ వ్యవసాయ మార్కెట్ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రాల్లో రైతుల వద్ద కొనుగోలు చేసిన పత్తికి చెల్లింపులు నాలుగు రోజులుగా పెండింగ్ ఉన్నట్లు తెలిసింది. వ్యవసాయ మార్కెట్‌కు ఉన్నత శ్రేణి కార్యదర్శిగా ఎవరూ లేకపోవడమే ఇందుకు కారణమని సమాచారం. వరంగల్ మార్కెట్‌కు రెగ్యులర్ ఉన్నత శ్రేణి కార్యదర్శి లేక ఏడాది కావొస్తున్నా నియామకం చేపట్టలేదు. నర్సంపేట కార్యదర్శికి అదనపు బాధ్యతలు అప్పగించి చేతులు దులుపుకున్నారు. మార్కెట్ పాలకవర్గం లేక అస్తవ్యస్తంగా తయారు కావడంతో ఆయన అక్టోబర్ 4వ తేదీ నుంచి 31వ తేదీ వరకు దీర్ఘకాలిక సెలవులో ఉన్నారు. ఆయన స్థానంలో మరో మార్కెట్ కార్యదర్శికి గాని స్థానిక గ్రేడ్–2 కార్యదర్శుల్లో ఒకరికి అదనపు బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం జరిగింది. పక్క జిల్లాలోని ఓ మార్కెట్‌కు చెందిన కార్యదర్శి వరంగల్‌కు వచ్చేందుకు పైరవీలు చేసుకోవడంతో ఉన్నతాధికారులు ఇన్‌చార్జ్ బాధ్యతల విషయాన్ని పట్టించుకోలేదు. ఇటీవల మంత్రి కొండా సురేఖ సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అప్పటి నుంచి కొనుగోళ్లు చేసిన పత్తిని మార్కెట్ కార్యదర్శి ధ్రువీకరిస్తేనే సీసీఐ అందుకు సంబంధించిన నగదును రైతుల ఖాతాల్లో జమచేస్తుంది. కార్యదర్శికి మళ్లీ 10రోజుల వరకు సెలవు పొడిగించినట్లు తెలిసింది. మార్కెట్ కార్యదర్శి లేకపోవడంతో వరంగల్, నర్సంపేట మార్కెట్ల పరిధిలోని ఉద్యోగులకు వేతనాలు, పింఛన్లు నిలిచిపోయాయి. నెల రాగానే ఈఎంఐలు, ఇతరత్రా చెల్లింపులు చేయాలంటే జీ తాల రాలేదని, కార్యదర్శి లేనందున జీతాలు ఆలస్యం అవుతున్నాయని ఉద్యోగులు, పింఛన్‌దారులు వాపోతున్నారు. అలాగే సుమారు రూ.కోటి వరకు పత్తి రైతులకు సీసీఐ చెల్లించాల్సి ఉంటుందని, వేతనాలు, పింఛన్లు కలిపి సుమారు మరో రూ.2కోట్ల వరకు ఉంటాయని సమాచారం. ప్రభుత్వం వెంటనే ఈవిషయంపై చర్యలు తీసుకుని మార్కెట్‌కు ఉన్నత శ్రేణి కార్యదర్శిని నియమించాలని వ్యాపారులు, రైతులు డిమాండ్ చేస్తున్నారు.
పట్టించుకోని అధికార పార్టీ నాయకులు
పత్తి రైతులకు సుమారు
రూ.కోటి బకాయిలు
వేతనాలు, పింఛన్ల కోసం
ఎదురుచూపులు


