కలెక్టర్ బంగ్లాను పరిశీలించిన ‘కుడా’ చైర్మన్
నయీంనగర్ : హనుమకొండ కలెక్టర్ పాత బంగ్లాలో చేపట్టిన పనుల పురోగతిని ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం కాలం నాటి చారిత్రక భవనమైన హనుమకొండ కలెక్టర్ బంగ్లాను ఓరుగల్లుకు ఐకాన్‌గా, హెరిటేజ్ భవనంగా మార్చి చరిత్రలో నిలిచేలా అభివృద్ధి చేసి సందర్శకులకు ఆకర్షణీయ కేంద్రంగా మార్చే దిశగా పనులు జరుగుతున్నాయని చెప్పారు.
7 నుంచి కరీంనగర్,
తిరుపతి వీక్లీ స్పెషల్ ట్రైన్
ఖిలా వరంగల్: జూలై 7వ తేదీ నుంచి కరీంనగర్– తిరుపతి వీక్లీ స్పెషల్ ట్రైన్ నడుపనున్నట్లు రైల్వే అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 8న తిరుపతి– కరీంనగర్ వీక్లి వన్స్ ట్రైన్ నడవనుందని పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
20 వరకు ఫీజు గడువు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి పీజీ కోర్సుల ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ రెండో సెమిస్టర్ విద్యార్థులు పరీక్షల ఫీజు చెల్లించేందుకు (రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్‌మెంట్) గడువు ఈనెల 20 వరకు ఉన్నట్లు పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ తెలిపారు. రూ.250 అపరాధ రుసుముతో 26వ తేదీ వరకు ఉందని పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేరు తొలగించారని..
ధర్మసాగర్: గ్రామ పంచాయతీ కార్యదర్శిని ఓ యువకుడు బుధవారం గదిలో ఉంచి తాళం వేసి నిర్బంధించిన సంఘటన హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం రాపాకపల్లిలో గురువారం వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో ఇటీవల ఎంపిక చేసిన ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో కందుకూరి ప్రశాంత్ అనే యువకుడి పేరు వచ్చింది. ప్రొసీడింగ్ ఇచ్చే సమయంలో అతడి పేరు లేదు. తన పేరు ఎలా తొలగిస్తారంటూ ప్రశాంత్ బుధవారం మధ్యాహ్నం గ్రామ పంచాయతీ కార్యదర్శి భోగి శ్రీనివాస్‌ను ఆఫీస్ గదిలో ఉంచి తాళం వేసి దూషించాడు. దీంతో అతను పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పగా వారు చేరుకుని ప్రశాంత్‌ను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా మండలంలో అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించారని, కార్యదర్శులు కూడా అనర్హుల పేర్లనే ఫైనల్ చేశారని ప్రజలు ఆరోపిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.


