
బీఆర్టీయూ నాయకుల అరెస్ట్
సుబేదారి పోలీస్‌స్టేషన్‌కు తరలింపు
హన్మకొండ: కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం హనుమకొండ కలెక్టరేట్‌కు భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ (బీఆర్టీయూ) ఆధ్వర్యంలో వెళ్తున్న కార్మిక నాయకులు, కార్మికులను పోలీసులు అరెస్ట్ చేసి సుబేదారి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కార్మికుల సమస్యలపై వినతి పత్రం ఇచ్చేందుకు ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియం ఆవరణలో సమాయత్తమైన నాయకులు, కార్మికులు ర్యాలీగా వెళ్లేందుకు సిద్ధమవుతున్న క్రమంలో సుబేదారి పోలీసులు చేరుకుని వారిని స్టేషన్‌కు తరలించారు. రెండు గంటల పాటు నిర్భందించి తర్వాత పోలీసుల సమక్షంలో కలెక్టరేట్‌కు తరలించగా ప్రజావాణి కార్యక్రమంలో డీఆర్‌ఓ వై.వి.గణేశ్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం పోలీసులు వారిని వదిలిపెట్టారు. ఈసందర్భంగా భవన నిర్మాణ కార్మికుల సంఘం రాష్ట్ర గౌరవ సలహాదారుడు ఎంజాల మల్లేశం, బీఆర్టీయూ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నాయిని రవి మాట్లాడుతూ శాంతియుతంగా కలెక్టరేట్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్న తమను అక్రమంగా అరెస్ట్ చేయడం దుర్మార్గమని అన్నారు. సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే అరెస్తు చేస్తారా? అని ప్రశ్నించారు. కార్యక్రమంలో నాయకులు, కార్మికులు సారంగపాణి, సిరికొండ భిక్షపతి, రాజారపు రాజు, రాజేందర్, నారాయణగిరి రాజు, చేరాలు, శ్యామ్, ఎండీ గౌస్ సాదిక్, ఎండీ.ఇస్మాయిల్, ఎండీ.షబ్బీర్, ఉమేందర్ పాల్గొన్నారు.