
పారిశుద్ధ్య పనులు చేపట్టండి
నగర మేయర్ గుండు సుధారాణి
వరంగల్ అర్బన్: రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని నగరంలో ముందస్తుగా పారిశుద్ధ్య పనులు చేపట్టాలని మేయర్ గుండు సుధారాణి అధి కారులను ఆదేశించారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న 29వ డివిజన్‌లో మేయర్ మంగళవారం పర్యటించారు. సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి రఘునాథకాలనీలో విరిగిన మూడు విద్యుత్ స్తంభాలు, చెట్టును పరిశీలించారు. వాటిని తొలగించాలని డీఆర్‌ఎఫ్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు పరిశీలించి మేయర్ మాట్లాడారు. నాలాల్లో పూడికతీసేందుకు టెండర్లు పిలవాలని సూచించారు. రోడ్లు, డ్రెయిన్లలో ప్రజలు చెత్త వేయకుండా చూడాలని, అనుమతి లేకుండా పోతనరోడ్డులోని స్క్రాప్ దుకాణాలు నిర్వహిస్తున్న వారికి నోటీసులు జారీచేసి జరిమానా విధించాలని, వేంకటేశ్వరస్వామి ఆలయ పక్క వీధిలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలను సరిచేయాలని ఎన్పీడీసీఎల్ అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య సిబ్బందికి డివిజన్‌లో అనువుగా ఉన్న ఏదైనా ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసి అన్నపూర్ణ భోజనం ఏర్పాటు చేయాలని, సమయపాలన పాటించేలా చూడాలని సీఎంహెచ్‌ఓ రాజారెడ్డిని మేయర్ ఆదేశించారు. ఆమె వెంట శానిటరీ సూపర్‌వైజర్ భాస్కర్, ఎన్పీడీసీఎల్ ఏఈ రవీందర్, లైన్‌మన్ సాంబయ్య, వర్క్ ఇన్‌స్పెక్టర్ కంటేష్ తదితరులు పాల్గొన్నారు.
యూజీడీ డీపీఆర్ సిద్ధం చేయండి
నగరంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ (యూజీడీ)పై సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధం చేయాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో అధి కారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. జోన్ల వారీగా సమగ్ర అధ్యయనం చేసి యూజీడీ డీపీఆర్ తయారచేయాలని సూచించారు. సమీక్షలో గ్రేటర్ కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే, ఇన్‌చార్జ్ ఎస్‌ఈ శ్రీనివాస్, ఈఈలు రవికుమార్, సంతోష్‌బాబు, మాధవీలత పాల్గొన్నారు.