● ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి
ఖిలా వరంగల్: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి అన్నారు. విజయోత్సవ ర్యాలీలో భాగంగా ఆయన ఆదివారం వరంగల్ రంగశాయిపేటకు చేరుకోగా ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు ఘన స్వాగతం పలికారు. శ్రీ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నాక బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ దేవతకు కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. అనంతరం దామెరకొండ సదానందం అధ్యక్షతన జరిగన సమావేశంలో శ్రీపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. మండలిలో ఉపాధ్యాయుల గొంతుకనై ఉంటానని అన్నారు. తన గెలుపునకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రవీందర్‌రెడ్డి, సతీశ్, తిరుపతిరెడ్డి, అబ్దుల్ గోపాల్, విజయపాల్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, నరసింహస్వామి, దయాకర్ పాల్గొన్నారు.
నేడు గ్రేటర్ గ్రీవెన్స్
వరంగల్ అర్బన్: వరంగల్ మహా నగరపాలక సంస్థ(జీడబ్ల్యూఎంసీ) ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కమిషనర్ అశ్విని తానాజీ వాకడే ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు వినతులు స్వీకరిస్తామని, ప్రజలు సమస్యల పరిష్కారానికి ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
వరంగల్ ప్రజావాణి..
వరంగల్: వరంగల్ కలెక్టరేట్‌లో నేడు(సోమవారం) ఉదయం 11 గంటలకు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు తమ సమస్యలపై వివిధ శాఖల అధికారులకు వినతులు సమర్పించేందుకు రావాలని సూచించారు.
భద్రకాళి సన్నిధిలో జ్ఞానేశ్వర్
హన్మకొండ కల్చరల్: రాష్ట్ర ముదిరాజ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బుర్ర జ్ఞానేశ్వర్ ఆదివారం శ్రీభద్రకాళి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. అనంతరం జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ ముదిరాజ్ కులస్తులకు కార్పొరేషన్ నుంచి వచ్చే ప్రతీ సంక్షేమ పథకం అందేలా కృషి చేస్తానని అన్నారు.
కార్మిక వ్యతిరేక
విధానాలపై పోరాటం
● ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
రాంచందర్
హన్మకొండ: కార్మిక వ్యతిరేక విధానాలపై స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ పోరాటం చేస్తోందని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్.రాంచందర్ అన్నారు. ఈ మేరకు సంఘం ఆధ్వర్యాన నేడు(సోమవారం)ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిర్వహించే బహరంగ సభలో పాల్గొనేందుకు ఆర్టీసీ కార్మికులు ఆదివారం కాజీపేట రైల్వేస్టేషన్ నుంచి బయల్దేరారు. ఈ సందర్భంగా రాంచందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ బస్సులు రావడం మూలంగా ఆర్టీసీ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని, బస్సులను ఆర్టీసీకి సంబంధం లేని సంస్థలకు అప్పగించి వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను రద్దు చేయడంతోపాటు మోటార్ వెహికల్ చట్టం–2019ను సవరించాలన్నారు. విద్యుత్ బస్సు ల నిర్వహణ ఆర్టీసీకి అప్పగించి సబ్సిడీని సంస్థకు కేటాయించి ప్రజారవాణాను కాపాడాలని డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి