
విజ్ఞాన్, ఏపీ ఫిషరీస్ వర్సిటీల ఒప్పందం
చేబ్రోలు: వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీ – విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ(ఏపీఎఫ్‌యూ)ల మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ పీఎంవీ రావుమంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ(ఏపీఎఫ్‌యూ) స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి.రాజశేఖర్‌తో విజ్ఞాన్ రిజిస్ట్రార్ పీఎంవీ రావు అవగాహన ఒప్పందానికి సంబంధించిన పత్రాలను మార్చుకున్నారు. రిజిస్ట్రార్ మాట్లాడుతూ ఈ ఒప్పందం వల్ల జలజీవుల ఆరోగ్యం, డయగ్నొస్టిక్స్‌లో భాగస్వామ్య పరిశోధన చేస్తామన్నారు. విద్యార్థులు, పరిశోధకులు, ఆక్వా రైతులకు సాంకేతిక శిక్షణ కూడా అందిస్తామన్నారు. అంతేకాకుండా అధ్యాపకులు, సిబ్బంది మార్పిడి, ప్రయోగశాల వనరుల వినియోగం , వివిధ నిపుణుల సేవలు అందిస్తామన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ప్రాజెక్టుల కోసం సంయుక్తంగా ప్రతిపాదనలు తయారు చేస్తామన్నారు. శిక్షణ కార్యక్రమాలు, పరిశోధన కోసం నిపుణుల నియామకం, ఉమ్మడిగా పరిశోధనలు చేయడంతో పాటు డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లను సులభతరం చేయవచ్చునన్నారు.
ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీ (ఏపీఎఫ్‌యూ) స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజశేఖర్ మాట్లాడుతూ అధ్యాపకులను, విద్యార్థులను సరికొత్త టెక్నాలజీల వైపు ప్రోత్సహించడంతో పాటు వారికి ఆయా రంగాలలో తర్ఫీదనివ్వడమే ఈ ఒప్పందం లక్ష్యమన్నారు. కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ టి.సుగుణ, డీన్లు, తదితరులు పాల్గొన్నారు.