
ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల వివర
సాక్షి ప్రతినిధి, గుంటూరు, ప్రత్తిపాడు: జిల్లాలో రోజురోజుకు రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. పెరుగుతున్న వ్యవసాయ ఖర్చులు, అరకొర దిగుబడులు, పంట చేతికొచ్చే సమయానికి ప్రకృతి విలయ తాండవం.. అన్నీ గట్టెక్కినా చివరి గిట్టుబాటు ధర లేకపోవడం, వడ్డీలకు తెచ్చిన అప్పులు రెట్టింపు అవుతుండటం, వాటిని తీర్చలేక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. కూటమి గద్దెనెక్కిన తరువాత ఇప్పటి వరకు ఒక్క ప్రత్తిపాడు నియోజకవర్గంలోనే పది మంది రైతులు బలిపీఠం ఎక్కారు. అప్పుల బాధలు తాళలేక బలవన్మరణాలకు పాల్పడి ఊపిరి తీసుకున్నారు.
నిండా ముంచేసిన పత్తి, మిర్చి, పొగాకు
గత ఏడాది జిల్లాలో వేల ఎకరాల్లో పత్తి, మిర్చి పంటను రైతులు సాగు చేశారు. గులాబీరంగు పురుగు ఉధృతి అధికంగా ఉండటంతో పత్తి రైతులు నిలువునా నష్టపోయారు. అదేవిధంగా మిర్చిని నల్లి తామర ముంచెత్తడంతో పంటను మధ్యలోనే పీకేయాల్సిన పరిస్థితి. పత్తికి, మిర్చికి ఎకరాకు సుమారు రూ.లక్ష నుంచి లక్షన్నర వరకు పెట్టుబడులు పెట్టారు. ఆరుగాలం ఽశ్రమించి పండించుకున్న పంటలకు కనీస గిట్టుబాటు ధర కూడా లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇక మిర్చి సాగు చేసి నట్టేట మునిగిపోయిన రైతులు పంటను పీకేసి, నల్లబర్లీ పొగాకు సాగుచేశారు. తీరా పంట దిగుబడులు చేతికొచ్చే సమయానికి ధర లేకపోవడంతో రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. గత ఏడాది క్వింటా రూ.15వేల వరకు అమ్మిన నల్లబరీని మొన్నటివరకు రూ.3 వేలకు కూడా కొనే వారులేక నానాఅగచాట్లు పడ్డారు. ప్రస్తుతం పొగాకు కొనుగోలు కేంద్రాలని ప్రభుత్వం చెబుతున్నా వాటి ద్వారా కొనుగోళ్లు కూడా ఆశించిన స్థాయిలో ఉండటం లేదని రైతులు వాపోతున్నారు.
రైతుపేరు ఊరు ఆత్మహత్య చేసుకున్న తేదీ
పుట్టా నాగరాజు (40) చినకోండ్రుపాడు 2024 జూన్ 30
ధూపాటి శివయ్య (56) ప్రత్తిపాడు 2024 జూలై 27
గడ్డం గోపాలకృష్ణ (31) చినకోండ్రుపాడు 2024 అక్టోబరు 17
యనగందలు వీరారావు (54) ప్రత్తిపాడు 2024 అక్టోబరు 23
జొన్నలగడ్డ అశోక్ (36) కోయవారిపాలెం 2024 నవంబరు 13
గేరా ప్రసాద్ (32) తిక్కిరెడ్డిపాలెం 2024 నవంబరు 23
వరగాని బాబూరావు (59) వంగిపురం 2025 ఫిబ్రవరి 13
కావూరి శివశంకరప్రసాద్ (46) పుసులూరు 2025 జూన్ 7
చిమటా శేషయ్య (52) కొర్నెపాడు 2025 జూన్ 13
చల్లగిరి నాగరాజు (42) ప్రత్తిపాడు 2025 జూన్ 28
జిల్లాలో పెరుగుతున్న రైతు ఆత్మహత్యలు అప్పుల ఊబిలో కూరుకుపోయి బలిపీఠం ఎక్కుతున్న అన్నదాతలు భరోసా దక్కక, గిట్టుబాటు ధర లేక బలవన్మరణాలు ఒక్క ప్రత్తిపాడు నియోజకవర్గంలోనే పది మంది రైతుల ఆత్మహత్య మృతుల కుటుంబాలకు పరిహారం అందజేయని కూటమి ప్రభుత్వం కనీసం వారిని పరామర్శించే దిక్కుకూడా లేని దుస్థితి
గత ప్రభుత్వం పంటలు సాగు చేసుకునే సమయంలో రైతన్నకు ఆదరువుగా ఉండేందుకు రైతు భరోసా పథకం ద్వారా రూ. 13,500లను వారి ఖాతాలకు నేరుగా జమ చేసింది. అదే పథకాన్ని పేరు మార్చి అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి రూ. 20 వేలు ఆర్థిక సాయం రైతుల ఖాతాలకు జమచేస్తామని ఎన్నికలకు ముందు ఊదరగొట్టిన కూటమి నేతలు తొలి ఏడాది అన్నదాత సుఖీభవకు మంగళం పాడేశారు. ఈ ఏడాది అదిగో ఇదిగో అని ఊరిస్తూ ఇప్పటి వరకు నగదు జమ చేయలేదు.

ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల వివర

ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల వివర