
జీజీహెచ్‌లో ఘనంగా డాక్టర్స్ డే
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్‌లో మంగళవారం డాక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆస్పత్రిలోని శుశ్రుతాహాల్‌లో జరిగిన ఈ వేడుకలకు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ముఖ్యఅతిథిగా విచ్చేసి వైద్యులను సత్కరించి మాట్లాడారు. జీజీహెచ్‌లో పేద రోగులకు వైద్యులు ఎంతో కష్టపడి సేవలందిస్తున్నారని చెప్పారు. ఆస్పత్రిలో పచ్చదనం బాగా పెంచారని అభినందించారు. వైద్యులు ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుని రోగులకు ఇంకా మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్‌ఎస్‌వీ రమణ మాట్లాడుతూ ఆస్పత్రిలో దాతల సహాయంతో పలు అభివృద్ధి పనులు చేశామన్నారు. రోగులకు ఓపీ రద్దీని తగ్గించేందుకు నూతనంగా ఓపీ కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. అనంతరం ఆస్పత్రిలో పనిచేస్తున్న 50 మంది వైద్యులను ఘనంగా సత్కరించారు.సివిల్ సర్జన్ ఆర్‌ఎంఓ డాక్టర్ బి.వెంకటేశ్వరరావు, డెప్యూటీ సివిల్ సర్జన్ ఆర్‌ఎంఓ డాక్టర్ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.