ఉప్పు సాగుకు ప్రకృతి విఘాతం | - | Sakshi
Sakshi News home page

ఉప్పు సాగుకు ప్రకృతి విఘాతం

Jul 2 2025 5:42 AM | Updated on Jul 2 2025 5:42 AM

ఉప్పు సాగుకు ప్రకృతి విఘాతం

ఉప్పు సాగుకు ప్రకృతి విఘాతం

చినగంజాం: ఉప్పు సాగుకు ఇటీవల కాలంలో ప్రకృతి తీవ్ర విఘాతం కలుగజేస్తోంది. అయినా ఉప్పు రైతు వాటిని తట్టుకొని నెగ్గుకు రాగలుగుతున్నాడు. వేసవి ఉష్టోగ్రతలు పంట దిగుబడిని, నాణ్యతను పెంచుతాయి. ఉప్పు సాగు ముమ్మరంగా సాగే అనుకూల సీజన్‌లో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే ఉప్పు రైతు కోలుకోవడం కష్టమే. గత నాలుగు సీజన్‌లుగా ఇదే పరిణామాలు ఉప్పు సాగు విషయంలో చోటు చేసుకుంటున్నాయి.

సీజన్‌లో భారీగా పడిపోయిన ఉప్పు ఉత్పత్తి

రాష్ట్రంలో ఏర్పడిన ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య సీజన్‌లో ఉప్పు ఉత్పత్తి భారీగా పడిపోయింది. రాష్ట్రంలో ఇచ్చాపురం నుంచి తడ వరకు ఉన్న ఉప్పు పరిశ్రమల్లో మొత్తం 22 వేల ఎకరాల్లో ఉప్పు ఉత్పత్తి కొనసాగుతుంది. తుఫాన్‌లు, భారీ వర్షాల కారణంగా ఉప్పు రైతు నష్టపోక తప్పడం లేదు. ఉప్పు సాగు ప్రతి ఏడాది నవంబరు నెల నుంచి తరువాత ఏడాది జూన్‌ వరకు దాదాపు 8 నెలలపాటు కొనసాగుతుంది. నవంబరు, డిసెంబరు నెలల్లో ఉప్పు సాగును ప్రారంభించి తొలి తీత సంక్రాంతి పండుగ నాటికి తీయాల్సి ఉంది. 2024–25 సీజన్‌లో నవంబరు, డిసెంబరు నెలలో ప్రకృతి అనుకూలించక ఆలస్యంగా రైతులు సాగును ప్రారంభించాల్సి వచ్చింది.

ఉప్పు కొఠారుల్లో భారీగా వర్షపు నీరు నిలిచి సాగుకు భూములు అనుకూలత లేక జనవరి నెలలో సాగుకు భూములను సిద్ధం చేసుకునే పనిలో ఉండి ఫిబ్రవరి నెలాఖరు వరకు కొనసాగించారు. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో సుమారు 30 శాతం మాత్రమే ఉప్పును రైతులు తీయగలిగారు. వేసవి ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉండి ఉప్పు దిగుబడికి అనుకూలంగా ఉండే మే, జూన్‌ నెలల్లో తుఫాన్‌లు, అకాల వర్షాలతో సాగు పూర్తిగా నిలిచిపోయింది. ఉప్పు రైతుకు ఎన్నడూ లేని విధంగా తీవ్ర విఘాతం కలిగింది. సొంత భూములున్న రైతులు, లైసెన్స్‌దారులు పరిస్థితి ఎలా ఉన్నా ముఖ్యంగా కౌలుదారులకు మాత్రం తీవ్ర ఇబ్బంది కలిగింది.

ఉమ్మడి ప్రకాశంలోఉపాధి కోల్పోయిన వేల కుటుంబాలు

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఊళ్లపాలెం, కనపర్తి, కొత్తపట్నం, చినగంజాం మండలాల్లో ఉప్పు సాగు కొనసాగుతోంది. బాపట్ల జిల్లాలో చినగంజాం మండలంలో చినగంజాం, పెదగంజాం గ్రామాల్లో రైతులు ఉప్పు సాగు చేస్తున్నారు. మండల పరిధిలో ప్రభుత్వ, ప్రైవేట్‌ భూములు మొత్తం 3,600 ఎకరాల్లో ఉప్పు సాగు చేసే భూములున్నాయి. వాటిలో ప్రభుత్వ భూములు 2,400 ఎకరాలు కాగా, 500 ఎకరాలు స్నోవైట్‌ సాల్ట్‌ భూముల్లో సాగు సాగడం లేదు. ప్రభుత్వ భూమిలో 620 ఎకరాలు చిన్న, సన్నకారు రైతులు సాగు చేసుకుంటున్నారు. ప్రైవేట్‌ వ్యక్తులకు సంబంధించి మరో 1200 ఎకరాల్లో ఉప్పు సాగు చేస్తున్నారు. చినగంజాం మండల పరిధిలో చిన్న, పెద్ద రైతులు సుమారు 1050 కుటుంబాలు ఉండగా వారితో పాటు ఉప్పు కొఠారుల్లో పనులు నిర్వహిస్తూ కూలీలుగా సుమారు 8 వేల మంది పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. చినగంజాం సాల్ట్‌ వర్కర్స్‌ కో ఆపరేటివ్‌ ప్రొడక్షన్స్‌ సేల్స్‌ సొసైటీ (ఎల్‌ నంబర్‌ 73 అండ్‌ 86)లో 400 ఎకరాలు సుమారు 700 కుటుంబాలు, రాజుబంగారుపాలెం సాల్ట్‌ సొసైటీలో 120 ఎకరాలు 350 కుటుంబాలు మొత్తం 1050 కుటుంబాలు ఉప్పు సాగు మీద ఆధారపడి జీవిస్తున్నాయి. ఊళ్లపాలెం గ్రామ పరిధిలో ఎస్సీ సాల్ట్‌ వర్కర్స్‌ సొసైటీ కింద 500 ఎకరాలు, ఓసీ సాల్ట్‌ వర్కర్స్‌ సొసైటీ కింద మరో 350 ఎకరాలు ఉప్పు సాగు చేస్తుండగా, కొత్తపట్నం మండలంలోని సాల్ట్‌ సొసైటీ కింద 275 ఎకరాల్లో ఉప్పు సాగు చేస్తున్నారు. వీటితో పాటు సుమారు మరో వెయ్యి ఎకరాలు ప్రైవేట్‌ భూముల్లో రైతులు సాగు చేస్తున్నారు. ఉప్పు సాగుకు అవాంతరం కలగడంతో వేల కుటుంబాలు ఈ సీజన్‌లో తమ ఉపాధిని కోల్పోయారు.

సీజన్‌లో భారీగా పడిపోయిన ఉత్పత్తి గతంలో ఎన్నడూ లేని విధంగా దెబ్బతిన్న రైతు రైతుల ఆశలపై నీరు చల్లిన అకాల వర్షం ఉమ్మడి ప్రకాశంలో రైతులకు కోలుకోలేని దెబ్బ రైతుల కష్టం పట్టించుకోనికూటమి ప్రభుత్వం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement