
ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరిట టోకరా
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాల పేరుతో మోసగాళ్లు నిరుద్యోగులకు వల వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ ద్వారా ఉద్యోగాలు కల్పిస్తున్నామంటూ మోసం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులను పోలిన నియామక పత్రాలను సృష్టించి, బురిడీ కొట్టిస్తున్నారు. విద్యాంజలి సంస్థ పేరుతో కొంత మంది వ్యక్తులు జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లు, రికార్డ్ అసిస్టెంట్లు, యోగా టీచర్లు, అటెండర్ పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్నట్లు తప్పుడు నియామక ఉత్తర్వులను సృష్టించి, రూ.లక్షల్లో వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. తాజాగా విద్యాంజలి సంస్థ పేరుతో గుంటూరు జిల్లా తుళ్లూరులోని జెడ్పీ హైస్కూల్లో ఒకేషనల్ ట్రైనర్‌ను నియమిస్తున్నట్లుగా సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి సమాచారం పంపుతున్నట్లుగా సిద్ధం చేసిన నియామక ఉత్తర్వుల కాపీ ప్రస్తుతం వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతోంది. జెడ్పీ పాఠశాలల్లో ఔట్ సోర్సింగ్ నియామక విషయమై సమగ్రశిక్ష ఎస్పీడీ బి. శ్రీనివాసరావు దృష్టికి వెళ్లడంతో ఆయన ఇదంతా బోగస్ అని, ఎవ్వరూ నమ్మవద్దని కొట్టిపారేశారు. క్షేత్రస్థాయిలో ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకుని నిరుద్యోగ యువత మోసపోకుండా చూడాలని సమాచారం పంపారు. ప్రధానోపాధ్యాయులు కూడా తప్పుడు నియామక ఉత్తర్వులపై అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.
ఢిల్లీలోని విద్యాంజలి సంస్థ పేరుతో నియామక ఉత్తర్వులు
నిరుద్యోగ యువతకు ఎరవేస్తున్న మోసగాళ్లు
ఉద్యోగాల పేరుతో మోసపోవద్దని సమగ్ర శిక్ష ఎస్పీడీ సూచన