
ఎల్‌ఐసీని బలహీనపరచడం తగదు
కొరిటెపాడు(గుంటూరు): ప్రభుత్వరంగ సంస్థ ఎల్‌ఐసీని బలహీనపరిచే విధానాలను ప్రభుత్వం విడనాడాలని సౌత్ సెంట్రల్ జోన్ ఇన్సూరెన్స్ ఫెడరేషన్ సంయుక్త కార్యదర్శి జి.కిషోర్‌కుమార్ డిమాండ్ చేశారు. అరండల్‌పేటలోని ఎల్‌ఐసీ కార్యాలయంలో గురువారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఉద్యోగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ జాతీయ కార్మిక సంఘాలు, స్వతంత్ర యూనియన్లు జూలై 9వ తేదీన ఉద్యోగ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా సమ్మె జరగనుందని తెలిపారు. 85 శాతానికిపైగా ఎల్‌ఐసీ ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆల్ ఇండియా ఇన్సూరెనన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కూడా సమ్మెలో భాగస్వామిగా ఉందన్నారు. బీమా రంగంలో విదేశీ పెట్టుబడులను ప్రస్తుతం ఉన్న 74 శావాతం నుంచి వంద శాతానికి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. ఎల్‌ఐసీ ఐపీఓ ప్రక్రియను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోందన్నారు. ప్రజల పొదుపును ప్రోత్సహించాలని, విదేశీ పెట్టుబడులు ప్రత్యామ్నాయం కాదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజల ఆస్తులని చెప్పారు. ఈ సంస్థల్లో ప్రభుత్వ వాటాల విక్రయం దేశ ప్రయోజనాలకు హానికరం అని స్పష్టం చేశారు. ఎల్‌ఐసీలో వేల సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని, క్లాస్ 3, 4 క్యాడర్లలో రిక్రూట్‌మెంట్ వెంటనే చేపట్టాలని తెలిపారు. యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులందరికీ పాత పెన్షన్ స్కీం వర్తింపజేయాలన్నారు. ఉద్యోగులు దాచుకున్న పెన్షన్ నిధులను స్టాక్ మార్కెట్లకు తరలించడం నష్టదాయకమని పేర్కొన్నారు. ఎల్‌ఐసీలో 1996 నోటిఫికేషన్ ద్వారా నియమించబడిన ఉద్యోగులకు పాత పెన్షన్ పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎల్‌ఐసీ ఫెడరేషన్ మచిలీపట్నం డివిజన్ సంయుక్త కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ బీమా ప్రీమియంపై 18 శాతం జీఎస్టీ విధించడం పాలసీదారులపై ఆర్థిక భారాన్ని మోపడమేనని, పైగా ఇది ప్రజలకు బీమాను దూరం చేయడమేనన్నారు. ఎన్నో ఏళ్లుగా పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని దుయ్యబట్టారు. ఈ సమ్మెకు ప్రజలందరూ మద్దతు తెలిపాలని కోరారు. సమావేశంలో ఫెడరేషన్ నాయకులు ఆర్‌వీఎస్ శ్రీనివాస్, డి.సైదులు, ఐ.వెంకట్రావు, శివరామకృష్ణారావు, రాజశేఖర్, రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
సౌత్ సెంట్రల్ జోన్ ఇన్సూరెన్స్ ఫెడరేషన్ సంయుక్త కార్యదర్శి జి.కిషోర్‌కుమార్