
హాస్టల్ వార్డెన్‌కు విద్యార్థుల అప్పగింత
తెనాలి రూరల్: సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఉంటున్న ముగ్గురు విద్యార్థులు ఉదయం టిఫిన్ చేసి స్కూలుకు అని బయలుదేరారు. కానీ వారు స్కూలుకు హాజరు కాలేదు. ఆ విషయం వార్డెన్‌కు కూడా తెలియదు. అనుమానాస్పదంగా రైల్వేస్టేషన్లో ఉండగా జీఆర్పీ కానిస్టేబుల్ గమనించారు. వెంటనే వార్డెన్‌కు సమాచారం ఇచ్చి క్షేమంగా విద్యార్థులను అప్పగించారు. ఎస్‌ఐ వెంకటాద్రి దీనిపై మాట్లాడుతూ.. కొల్లిపర మండలం దావులూరిపాలెంకు చెందిన ఎల్.కిషోర్ బాబు(12), వేమూరు మండలం వరహాపురం గ్రామానికి చెందిన నాయుడు అభిరామ్ (13), రేపల్లె ఓల్డ్ టౌన్‌కు చెందిన ఎ.జితేంద్ర దర్శన్ (14) స్థానిక నాజరుపేటలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహంలో ఉంటున్నారని తెలిపారు. స్కూలుకు వెళ్లకుండా స్టేషన్ వైపు వచ్చినట్లు చెప్పారు. వెంటనే వార్డెన్‌కు సమాచారం అందించి బాలలను అప్పగించినట్లు తెలిపారు. వార్డెన్ ఆదినారాయణను వివరణ కోరగా.. వారిలో ఇరువురికి ఇంకా స్కూలులో అడ్మిషన్ కాలేదన్నారు. హాస్టల్లో మాత్రం జాయిన్ అయ్యారని, చెప్పులు కొనుక్కునేందుకు ముగ్గురు స్టేషన్ సమీపంలోని షాపునకు వచ్చారన్నారు. అక్కడి నుంచి నీరు తాగేందుకు స్టేషన్‌లోకి వెళ్లగా పోలీసులు గమనించి తమకు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు.