
తాడేపల్లి : డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్‌కు హెలికాప్టర్‌లో సీటు, స్పెషల్ ఫ్లైట్ తప్ప ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబు. జగన్‌ని అధికారంలోకి రానివ్వనని చెప్పడం కన్నా.. చంద్రబాబును మోస్తూ ఉంటానని చెప్తే మంచిదని అంబటి రాంబాబు చురకలంటిచారు. జగన మళ్లీ అధికారంలోకి వస్తాడని చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు భయం పట్టుకుందని విమర్శించారు.
ఈరోజు(శుక్రవారం, జూలై 4వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన అంబటి రాంబాబు.. కూటమి నేతల తాటాకు చప్పుళ్లకు భయపడమని హెచ్చరించారు. ‘పుష్ప సినిమా అన్నా, ఆ సినిమాలోని హీరో అన్నా పవన్ కళ్యాణ్‌కు నచ్చదు. అందుకే ఆ సినిమాలోని డైలాగులు పోస్టర్ వేసిన యువకుడిపై కేసులు పెట్టి అరెస్టు చేయించారు.
సినిమా షూటింగులు చేసుకుంటూ రాష్ట్రంలో ఏం జరుగుతుందో పవన్ తెలుసుకోలేక పోతున్నారు. చంద్రబాబు ఇచ్చిన డబ్బులు తీసుకొని, ఆయన ఇచ్చిన స్క్రిప్టులు చదవటమే పనిగా పెట్టుకున్నారు. పవన్‌కి ఇల్లు, ఆఫీసు కట్టిస్తున్నది చంద్రబాబు కాదా?, హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ పేరుతో దియేటర్ల యాజమాన్యాలను బెదిరించారు. నాగబాబుని మంత్రి పదవిలోకి తీసుకుంటానని చంద్రబాబు లెటర్ రాసిచ్చి మోసం చేశాడు. మరి పదవి ఇవ్వలేదని చంద్రబాబును ఎందుకు అడగటం లేదు?’ అని అంబటి ప్రశ్నించారు.
మూడు దాడులు.. ఆరు కేసుల మాదిరి పరిపాలన
ఏపీలో చంద్రబాబు నేతృత్వంలో పరిపాలన మూడు దాడులు.. ఆరు కేసుల మాదిరిగా ఉందని అంబటి స్పష్టం చేశారు. ప్రతిరోజూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడులు చేస్తూనే ఉన్నారు. మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావును చంపేందుకు ప్రయత్నించారు. పొన్నూరు ఎమ్మెల్యేకి తెలియకుండానే ఈ హత్యాయత్నం జరిగిందా?, ఆ నిందితులను ఎమ్మెల్యేనే రక్షించి ఊరు దాటించేశారు.
రెడ్‌బుక్‌ని కొనసాగించేందుకు కొందరు అధికారులు, రిటైర్డ్ అయినవారు కలిసి అజ్ఞాతంగా పని చేస్తున్నారు. పోలీసులు ఈ దాడులను ఆపాలని చూడటం లేదు. ఆ అజ్ఞాత వ్యక్తులు మాకు తెలుసు. సమయం వచ్చినప్పుడు తగిన గుణపాఠం చెప్తాం. పల్నాడులోని గుండ్లపాడులో టీడీపీలోని రెండు వర్గాలు గొడవ పడి చంపుకుంటే మా నేతలపై కేసులు పెట్టారు.

సింగయ్యను ప్రయివేటు కారు ఢీకొట్టి చనిపోయాడని తొలుత ఎస్పీ చెప్పారు తర్వాత మాట మార్చారు. ఆ తర్వాత జగన్ కారే ఢీకొట్టిందంటూ ఆయన మీద కూడా కేసు పెట్టారు. సింగయ్యను ఆస్పత్రికి తరలించటానికి 40 నిమిషాలు ఎందుకు ఆలస్యం చేశారు?, అంబులెన్స్ లో ఎక్కకముందు చక్కగా మాట్లాడిన వ్యక్తి ఆ తర్వాత ఎలా చనిపోయారు?అని అంబటి నిలదీశారు.