
లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి
తాడికొండ: పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించాలనే లక్ష్యంతో ఈ నెల ఒకటో తేదీ నుంచి 90 రోజుల పాటు నిర్వహిస్తున్న దేశవ్యాప్త మధ్యవర్తిత్వ క్యాంపైన్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ (డిస్ట్రిక్టు అండ్ సెషన్స్ జడ్జి) బీఎస్‌వీ హిమబిందు విజ్ఞప్తి చేశారు. సివిల్ కేసులు, కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, ప్రీ లిటిగేషన్ కేసులను పరిష్కరించేందుకు ఈ నెల 5న నిర్వహించే 2వ జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బుధవారం రాష్ట్ర సచివాలయం సమీపంలోని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ.... జూలైలో పరిష్కరించదగ్గ కేసులను గుర్తించి, మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. శిక్షణ పొందిన దాదాపు 893 మంది విశ్రాంత న్యాయమూర్తులు, సమాజ సేవకులు, న్యాయవాదులకు ఆయా కేసులను అప్పగించనున్నట్లు చెప్పారు. మధ్యవర్తిత్వం ద్వారా లేదా లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులు ఇరువురూ లబ్ధి పొందే అవకాశం ఉంటుందన్నారు. రాజీపడ దగ్గ కేసులు రాష్ట్రంలో మొత్తం 1,15,071 ఉన్నట్లు గుర్తించారని తెలిపారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఉప కార్యదర్శి డాక్టర్ హెచ్ అమర రంగేశ్వర రావు మాట్లాడుతూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ప్యాటర్న్ ఇన్ చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ రవీనాథ్ తిలహరి సూచనల మేరకు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందన్నారు. సహాయ కార్యదర్శి ఎన్‌జే రావు సమావేశంలో పాల్గొన్నారు.
రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ బీఎస్‌వీ హిమబిందు