
చెవులకు చిల్లు.. గుండె గుభేల్..!
పట్నంబజారు: గుంటూరు నగరం వాహనాల రణగొణ ధ్వనులతో హోరెత్తుతోంది. నగరంలో సుమారు 2 లక్షలకుపైగా ద్విచక్ర వాహనాలు ఉన్నాయని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. వాటిలో బుల్లెట్‌ల సంఖ్య 40 వేలకు పైమాటే. లక్ష్మీపురం, బృందావన్ గార్డెన్స్, కొరిటెపాడు రోడ్డు, అరండల్‌పేట, బ్రాడీపేట, ఈస్ట్ పరిధిలోని కొత్తపేట, ఎత్తురోడ్డు సెంటర్, నల్లచెరువు, ఆర్టీసీ బస్టాండ్, నాజ్‌సెంటర్, ఉమెన్స్ కళాశాల రోడ్డు, ఓల్డ్‌క్లబ్ రోడ్డు, అరవై అడుగుల రోడ్డు ప్రాంతాల్లో విచ్చలవిడిగా బైక్ సైలెన్సర్‌లు మార్చి ఆకతాయిలు ఇబ్బందులు పెడుతున్నారు. అధిక శబ్దాన్నిచ్చే హారన్లు, సైలెన్సర్లతో దూసుకెళ్తున్నారు.
చట్టాలు ఏం చెబుతున్నాయంటే..
వాహనం ఏదైనా కంపెనీ ఇచ్చిన సైలెన్సర్ తప్ప మరొకటి వాడకూడదని చట్టాలు స్పష్టంగా చెబుతున్నాయి. కేంద్ర మోటార్ వెహికల్ (ఎంవీఐ) చట్టం 1988 రూల్ నెంబర్ 120 ప్రకారం వాహనాల్లో వాడే సైలెన్సర్ నిర్దిష్ట నాయిస్ లిమిట్ కంటే ఎక్కువ శబ్దం చేయకూడదు. భారతీయ శబ్ద కాలుష్య నియంత్రణ చట్టం (నాయిస్ పొల్యూషన్, రెగ్యులేషన్ అండ్ కంట్రోల్) 2000 ప్రకారం భారీ సౌండ్ వచ్చే సైలెన్సర్‌లు నిషిద్ధం. ఎంవీఐ రూల్ 190(2) ప్రకారం చట్టబద్ధమైన రీతిలో వాహనాలు నడపకపోతే రూ.1000 నుంచి రూ. 10 వేల వరకు జరిమానాలు విధించే అవకాశం ఉంది. ఎన్విరాల్‌మెంట్ ప్రోటెక్షన్ యాక్ట్ 1986, నాయిస్ పొల్యూషన్ రూల్స్ ప్రకారం సైలెన్సర్‌ల నుండి వచ్చే శబ్దం నిబంధనలకు లోబడి ఉండాలి.
ఆరోగ్యానికి చేటు
శబ్ద కాలుష్యం 100 డెసిబుల్స్‌కు మించి ఉండటం వలన వినికిడి సమస్యలు తలెత్తే అవకాశం లేకపోలేదు. శబ్ద కాలుష్యం వలన ఆరోగ్యానికి ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, గర్భిణులకు హాని కలుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అనుమతులు లేని మార్పులు ట్రాఫిక్ నిబంధనలకు పూర్తి విరుద్ధం. పోలీసులకు సదరు వాహనాన్ని సీజ్ చేసే అధికారం కూడా ఉంది. ఇన్సూరెన్స్ క్లైయిమ్ తిరస్కరణకు అవకాశం లేకపోలేదు. ఎంవీఐ యాక్ట్ ప్రకారం పలు సందర్భాల్లో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్‌సీ) రద్దు చేయటంతోపాటు వాహనాన్ని సీజ్ కూడా చేయొచ్చు.
కనీస తనిఖీలు తూచ్...
రూ.15 వేల నుంచి రూ. 40 వేల వరకు విలువైన సైలెన్సర్‌లను ఆకతాయిలు వాడుతున్నారు. మరోవైపు నగరంలో వీటి అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (ఆర్టీఏ), ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేపట్టడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా సైలెన్సర్లను విక్రయించే వ్యాపారులు, దుకాణాదారులు, మెకానిల్‌లపైనా చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికై నా ఇలాంటి శబ్ద కాలుష్యాన్ని సృష్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఇష్టానుసారంగా బైక్ సైలెన్సర్లు మారుస్తున్న ఆకతాయిలు రహదారులపై తిరుగుతూ భారీ శబ్దాలతో హల్‌చల్ నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్న వ్యాపారులు కనీస చర్యలు తీసుకోవడంలో పోలీసుల ఉదాసీనత
భరించలేని భారీ శబ్దాలతో బుల్లెట్, ఇతర ద్విచక్రవాహనాలపై ఆకతాయిలు హల్‌చల్ చేస్తున్నారు. రోడ్డుపై వెళ్లేవారే కాదు.. ఇళ్లలోని వారి చెవులు కూడా చిల్లులు పడేలా, గుండె గుభేల్‌మనేలా
దూసుకుపోతున్నారు. దీంతో చిన్నారులు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అధికారులు మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
నగరంలో శబ్ద కాలుష్యం కలిగించేలా బైక్ సైలెన్సర్‌లు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. కచ్చితంగా వాహనాలు సీజ్ చేయటంతోపాటు కోర్టుకు హాజరుపరుస్తాం. పరిమిత స్థాయికి మించి సైలెన్సర్‌లు ఏర్పాటు చేయటం చట్ట విరుద్ధం. సైలెన్సర్లను విక్రయించే వారితోపాటు వాహనాలకు అమర్చుకునే వారిని కూడా ప్రత్యేక తనిఖీల ద్వారా గుర్తిస్తాం. వారిపై తగిన చర్యలు తీసుకుంటాం. శబ్దకాలుష్యం లేకుండా చూస్తాం.
– ఎం. రమేష్, డీఎస్పీ,
ట్రాఫిక్ విభాగం, గుంటూరు

చెవులకు చిల్లు.. గుండె గుభేల్..!

చెవులకు చిల్లు.. గుండె గుభేల్..!