
మనవరాలిని చంపిన తాత అరెస్ట్
తాడేపల్లి రూరల్ : మండలంలోని కుంచనపల్లి వద్ద 16వ నంబరు జాతీయ రహదారిపై ఉన్న బకింగ్ హామ్ కెనాల్ బ్రిడ్జి పైనుంచి మనవరాలిని నీళ్లలోకి విసిరేసి, మృతికి కారణమైన తాతయ్యను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. ఈ సందర్భంగా నార్త్ జోన్ డీఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ ఈనెల 1వ తేదీ రాత్రి 8.30 గంటల సమయంలో ఓ వృద్ధుడు బాలికను తీసుకువచ్చి బలవంతంగా కాలువలోకి విసిరి వేశాడని తెలిపారు. 100కు సమాచారం రావడంతో జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ ఆదేశాల మేరకు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందంతో కాలువలో గాలించి, బాలిక మృతదేహాన్ని గుర్తించినట్లు చెప్పారు. బాలికను తాడికొండ మండలం బడేపురానికి చెందిన కూరపాటి హేమగా గుర్తించామని చెప్పారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి బాలిక తాతయ్యను తాడికొండ అడ్డరోడ్డు వద్ద అదుపులోకి తీసుకున్నామని వివరించారు. పుట్టుకతోనే మానసిక వికలాంగురాలైన హేమ తల్లి, తండ్రి చనిపోయారన్నారు. తాతయ్య మాధవరావు, నాయనమ్మ సుమతి పెంచుతున్నట్లు చెప్పారు. నాయనమ్మ కూడా అనారోగ్యం పాలు కావడంతో ఈ మధ్య గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారన్నారు. హేమకు కూడా అక్కడే వైద్యం చేయిస్తున్నారు. వైద్యులు అనారోగ్యం కుదుటపడదని చెప్పడంతో తాతయ్య, నాయనమ్మ ఆందోళన చెందారు. ఇద్దరికీ మందులు ఖర్చులకు డబ్బులు లేకపోవడం, తాము లేకపోతే మనవరాలు ఏమవుతుందనే ఆందోళనతో కాలువలోకి పడవేసి హత్య చేశాడని వివరించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి మాధవరావును అదుపులోకి తీసుకుని కోర్టుకు హాజరుపరిచామని డీఎస్పీ తెలిపారు. కేసును 24 గంటల్లో ఛేదించిన సిబ్బందికి ఎస్పీ సతీష్‌కుమార్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
జీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ నల్లపాటి చంద్రశేఖరరావు మృతి
నరసరావుపేట: గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (జీడీసీసీ) మాజీ చైర్మన్ నల్లపాటి శివరామ చంద్రశేఖరరావు (84) మృతిచెందారు. గత 20రోజులుగా ఆయన హైదరాబాదులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందారు. మృతదేహాన్ని ఆయన స్వగ్రామం జొన్నలగడ్డకు తీసుకొచ్చారు. ఆయన భార్య రెండేళ్ల క్రితం చనిపోయారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో నల్లపాటి రామచంద్రప్రసాదు టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. గురజాల మాజీ శాసనసభ్యులు కాసు మహేష్‌రెడ్డి, ప్రస్తుత జీడీసీసీ బ్యాంకు అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుతో పాటు పలువురు రాజకీయ నాయకులు, పట్టణ ప్రముఖులు చంద్రశేఖరరావు మృత దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. శనివారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. చంద్రశేఖరరావు మృతికి మాజీ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి ఓ ప్రకటనలో ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
వివరాలు వెల్లడించిన డీఎస్పీ మురళీకృష్ణ

మనవరాలిని చంపిన తాత అరెస్ట్