
వైద్య విద్యార్థులతో కూటమి సర్కార్ చెలగాటం
పట్నంబజారు: వైద్య విద్యార్థుల జీవితాలతో కూటమి సర్కార్ చెలగాటమాడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సీహెచ్. వినోద్ ధ్వజమెత్తారు. బృందావన్ గార్డెన్స్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేద విద్యార్థులను డాక్టర్లుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కళాశాలలను నిర్మించారని తెలిపారు. ఎక్కడా రాజీ పడకుండా రూ.8,500 కోట్లతో వైద్య విద్యార్థుల భవిష్యత్తే ధ్యేయంగా ఆయన ముందుకు సాగారని చెప్పారు. ఏడాది పాలనలో కనీసం విద్యార్థుల కోసం ఒక్క మంచి కార్యక్రమం చేపట్టని చంద్రబాబు ప్రభుత్వం, వారి జీవితాలను నాశనం చేస్తోందని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ హయాంలో ఎంతో వైభవోపేతంగా నడిచిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేసే పన్నాగం పన్నుతోందని ఆరోపించారు. కూటమి సర్కార్ దుర్బుద్ధితో తీసుకున్న నిర్ణయం వల్ల వేల మంది మెరిట్ విద్యార్థులకు ఎంబీబీఎస్ విద్య దూరమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 7న విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్‌కు వినతిపత్రం అందజేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో విద్యార్థి సంఘ నేతలు రవి, గంటి, జగదీష్, అజయ్, కోటి, అజయ్, అరుణ్, సన్నీ పాల్గొన్నారు.