
కార్యకర్తలకు అండగా వైఎస్సార్ సీపీ
పొన్నూరు: టీడీపీ మూకల దాడిలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందుతున్న మన్నవ సర్పంచ్ బొనిగల నాగమల్లేశ్వరరావుకు అంబటి మురళీకృష్ణ అండగా నిలిచారు. హాస్పిటల్‌కు వచ్చినప్పటి నుంచి ఆయన దగ్గర ఉండి మెరుగైన వైద్యం అందించే విధంగా పర్యవేక్షిస్తున్నారు. స్పెషలిస్టులతో మాట్లాడి ఎప్పటికప్పుడు నాగమల్లేశ్వరరావు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ, కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతున్నారు. నాగమల్లేశ్వరరావు త్వరగా కోలుకోవాలని అంబటి మురళీకృష్ణతో పాటు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ప్రార్థనలు చేస్తున్నారు. నాగమల్లేశ్వరరావుపై దాడిని అంబటి మురళీకృష్ణ తీవ్రంగా ఖండించారు. పొన్నూరు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే విధంగా టీడీపీ పాలన సాగిస్తోందని మండిపడ్డారు. ప్రజలకు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ నాయకులు రాజకీయంగా ఎదుర్కోలేక భౌతిక దాడులకు పాల్పడటం అత్యంత హేయమైన చర్యగా ఖండించారు. పచ్చగా ఉండే పల్లెల్లో ఎర్రటి రక్తాన్ని చిందిస్తున్నారని మండిపడ్డారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రజలు ఎన్నడూ చూడని హత్యా రాజకీయాలను నేడు టీడీపీ చేస్తోందని విమర్శించారు. ఎస్సీ సామాజిక వర్గాన్ని అణచివేయడమే లక్ష్యంగా మన్నవ గ్రామంలో కుల రాజకీయాలు చేయడాన్ని తప్పుబట్టారు. టీడీపీ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే నరేంద్రకుమార్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారనే విషయం ప్రజలకు స్పష్టంగా అర్థమవుతోందని వెల్లడించారు. భవిష్యత్తులో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు.
పొన్నూరు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న టీడీపీ స్థానికంగా ప్రతిపక్షం లేకుండా చేయాలన్నదే లక్ష్యం కుల, హత్యారాజకీయాలను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే నరేంద్ర మన్నవలో ఒకే సామాజిక వర్గాన్ని అణచి వేయడమే లక్ష్యంగా కుట్ర