
రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన
గుంటూరు మెడికల్: పొన్నూరు మండలం మన్నవ గ్రామ సర్పంచ్ బొనిగల నాగమల్లేశ్వరరావుకు ఏమైనా జరిగితే దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కారణమని మాజీ మంత్రి మేరుగ నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడి గుంటూరు రమేష్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సర్పంచ్ నాగమల్లేశ్వరరావును శుక్రవారం మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పరామర్శించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ నాగమల్లేశ్వరరావు కుటుంబానికి ఎప్పటి నుంచో నియోజకవర్గంలో మంచి పేరు ఉందని తెలిపారు. గ్రామంలో అడ్డగోలుగా టీడీపీ నేతలు మట్టి తవ్వకాలు చేస్తున్నారని ఫిర్యాదు చేసినందుకే త్రీవంగా దాడి చేశారని ఆరోపించారు. నాగమల్లేశ్వరరావు మెదడు బాగా దెబ్బతిందని, అవయవాలు పని చేయడం లేదని తెలిపారు. టీడీపీ కూటమి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు ఒక టీమ్ పెట్టుకుని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు, నాయకులపై దాడి చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇటీవల మృతి చెందిన సింగయ్య కేసు విషయంలో కూడా గుంటూరు జిల్లా ఎస్పీ సింగయ్య మృతికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కాన్వాయ్ కారుకు సంబంధం లేదని చెప్పారన్నారు. మళ్లీ జగన్ కారుపై కేసు పెట్టడంపై కోర్టు కూడా తీవ్రంగా ప్రభుత్వానికి , పోలీసులకు అక్షింతలు వేసిందని తెలిపారు. సింగయ్య మృతి గురించి సీఎం చంద్రబాబు సభలో మాట్లాడుతూ కుక్కలతో పోల్చారని, ఇది ఎస్సీలను తీవ్రంగా అవమానించటమేనని పేర్కొన్నారు. అనంతపురంలో 13 ఏళ్ల బాలికపై 18 మంది రేప్ చేస్తే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ల రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మండిపడ్డారు. ఎస్సీలంతా వైఎస్ జగన్ వెంట ఉంటారు కాబట్టి వారిని భయపెట్టేలా, అంతం చేసేలా దాడులు చేస్తున్నారని ఆరోపించారు. నాగమల్లేశ్వరరావు దాడి ఘటనలో నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని, రిటైర్డ్ జడ్డితో విచారణ చేయించాలని నాగార్జున డిమాండ్ చేశారు. పోలీసుల సహకారం లేకుండా ఇలాంటి దాడులు జరగవని ఆయన ఆరోపించారు.
మాజీ మంత్రి మేరుగ నాగార్జున ఆగ్రహం నాగమల్లేశ్వరరావుకు ఏమైనా జరిగితే చంద్రబాబే బాధ్యులు