
సీఎం చంద్రబాబు దళిత ద్రోహి
తాడేపల్లి రూరల్ : ముఖ్యమంత్రి చంద్రబాబుకు మొదటి నుంచి దళితులంటే చులకన భావన ఉంది.. బహిరంగ ప్రాంతాల్లోనే ఎస్సీలను దూషిస్తూ అవమాన పరుస్తున్నారు.. తాజాగా చిత్తూరు జిల్లా కుప్పంలో ఓ సమావేశంలో సింగయ్య మృతిని కుక్కతో పోల్చారని దళిత సంఘ నాయకులు, బీసీ నాయకులు శుక్రవారం తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీ విభాగ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే టి.జె.ఆర్. సుధాకర్‌బాబు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాదిగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొమ్మూరు కనకారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో ఎన్నోసార్లు దళితులను అవమానించారని తెలిపారు. బహిరంగ సభల్లో, విలేకరుల సమావేశంలో దళితులుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా ? అని వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. ఇప్పుడు కార్యకర్త సింగయ్య మృతి చెంది వారి కుటుంబం బాధల్లో ఉంటే మృతిని కుక్కతో పోల్చి అవమానించారని ధ్వజమెత్తారు. ఆయన వ్యాఖ్యలు చేయడమే కాకుండా వారి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని దళితులు, బీసీలు జరిగిన సంఘటనపై చాలా బాధపడుతున్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై పోలీస్‌శాఖ వెంటనే నిజాయితీగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలపై కేసులు పెడుతున్నామని చెప్పారు. ఆయన్ను అరెస్ట్ చేసేంతవరకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా ఎస్సీ విభాగ అధ్యక్షులు గద్దేటి సురేంద్ర, గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు అంకంరెడ్డి నారాయణమూర్తి, ఎస్టీ నాయకులు లక్ష్మీపతి, రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు బూదాల శ్రీను, శ్రీరాంశెట్టి పూర్ణచంద్రరావు, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ముదిగొండ ప్రకాష్, నలకుర్తి రమేష్, రాష్ట్ర బొందిలి సంఘం అధ్యక్షులు బొందిలి నరేంద్ర సింగ్, రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ కార్యదర్శి కలపాల అజయ్, మల్లవరపు సుధారాణి, సుభాషిణి, కొమ్ము చంటి, తాడేపల్లి రూరల్ అధ్యక్షులు అమరా నాగయ్య, కాపు సంఘం నాయకులు మిరియాల రాంబాబు, చిట్టిమల్ల సుబ్బు, దర్శి రమేష్, ప్రేమ్‌కుమార్ పాల్గొన్నారు.
ఎస్సీలంటే చులకన భావన
అదే బాటలో మంత్రులు, ఎమ్మెల్యేలు
సింగయ్య మృతిని కుక్కలతో పోల్చడం దారుణం
ముఖ్యమంత్రిపై వెంటనే కేసు నమోదు చేయాలి
రాష్ట్ర వ్యాప్తంగా
ఉద్యమానికి పిలుపునిస్తాం
వైఎస్సార్ సీపీ ఎస్సీ, ఎస్టీ, బీసీ సెల్ నాయకులు