
వర్షాల నేపథ్యంలో ఇసుక ప్రత్యేక డంప్
గుంటూరు వెస్ట్: వర్షాకాలం నేపధ్యంలో నిర్మాణాలకు అవసరమైన ఇసుకను ముందుగానే ప్రత్యేకమైన డంప్ యార్డుల్లో నిల్వ చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని డీఆర్సీ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ, డీఆర్‌ఓ షేక్ ఖాజావలితో కలిసి నిర్వహించిన అధికారుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు అణుగుణంగా ఇసుక తవ్వకాలు, విక్రయాలు జరపాలన్నారు. ఇసుక విక్రయాలు జరిగే ప్రాంతాల్లో ధరల బోర్డులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. సంబంధిత తహసీల్దార్‌లు తనిఖీ నివేదకలు ఎప్పటికప్పుడు సమర్పించాలన్నారు. ఏపీ స్పేస్ అప్లికేషన్ సెంటర్ నివేదిక ప్రకారం జిల్లాలో 2021–24 మధ్యలో జిల్లాలో అక్రమంగా ఇసుక తవ్విన ఏజెన్సీలకు నోటీసులివ్వాలన్నారు. వర్షాకాలం నేపధ్యంలో ఏర్పాటు చేస్తున్న ఇసుక స్టాక్ పాయింట్లు ప్రధాన రహదారులకు సమీపంలో ఉండాలన్నారు. స్టాక్ పాయింట్ల నుంచి వసూలు చేసే రవాణా చార్జీల విషయంలో వినియోగదారుల అభిప్రాయాలు సేకరించాలన్నారు. జిల్లా మైన్స్ అండ్ జియాలజీ అధికారి డి.వెంకట సాయి, జిల్లా భూగర్భ వనరుల శాఖ డీడీ వందనం, డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పరిశ్రమల ఏర్పాటుకు ఎంఎస్‌ఎంఈ క్లస్టర్లు..
గుంటూరు వెస్ట్: జిల్లాలో వ్యవసాయంతో పారిశ్రామికాభివృద్ధి జరగాలంటే ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్‌ఎంఈ క్లస్టర్లు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని డీఆర్సీ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా ఇండస్ట్రీయల్ అండ్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఎంఎస్‌ఎంఈ క్లస్టర్ ఏర్పాటుకు అవసరమైన స్థలాలు గుర్తించాలన్నారు. మంగళగిరిలో ఏర్పాటు చేయనున్న గోల్డ్, హ్యాండ్‌లూమ్ క్లస్టర్ పనులు వేగవంతం చేయాలన్నారు. తాడికొండ, ప్రత్తిపాడు నియోజకవర్గాల పరిధిలో మాడ్యూలర్ కిచెన్ క్లస్టర్ ఏర్పాటుకు స్థలాలు గుర్తించాలన్నారు. రాష్ట్ర స్థాయిలో ఎస్‌ఐపీబీ, ఎస్‌ఐపీసీలో జిల్లాకు అనుమతులు మంజూరు చేయాలని తెలిపారు. జిల్లాలో 45 ఎస్‌ఎంఎస్‌సీ పరిశ్రమలకు సంబంధించి రూ.2,52,74,672 మంజూరు చేస్తూ కలెక్టర్ సమావేశంలో ఆమోదించారు. డీఆర్‌ఓ షేక్ ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, పరిశ్రమల శాఖ జీఎం జయలక్ష్మి, తెనాలి ఆర్డీఓ శ్రీహరి, డీఆర్‌డీఏ పీడీ విజయలక్ష్మి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి