
పాత గుంటూరు: కవిగా, గుంటూరు జిల్లా రచయితల సంఘం, ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులుగా సోమేపల్లి వెంకట సుబ్బయ్య సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు కొనియాడారు. ఎస్‌వీయన్ కాలనీలోని చిన్మయ ఫంక్షన్ హాలులో ఆదివారం సోమేపల్లి వెంకట సుబ్బయ్య సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సోమేపల్లి వారి ‘చేను చెక్కిన శిల్పాలు‘ హిందీ అనువాద పుస్తకాన్ని నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీ కృష్ణ దేవరాయలు, ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ మందపాటి శేషగిరిరావు, డాక్టర్ వెన్నా వల్లభరావు ఆవిష్కరించారు. చలపాక ప్రకాష్ రచించిన ‘అప్పగింతలు ’ కథా సంపుటిని పాపినేని శివశంకర్, పెనుగొండ లక్ష్మీనారాయణ, చిల్లర భవానీదేవి ఆవిష్కరించి సోమేపల్లికి అంకితమిచ్చారు. కార్యక్రమంలో సాహితీవేత్తలు భూసురుపల్లి వెంకటేశ్వర్లు, బీరం సుందరరావు, గుమ్మా సాంబశివరావు, రావెల సాంబశివరావు, కందిమళ్ల సాంబశివరావు, కోసూరి రవికుమార్, వి. నాగరాజ్యలక్ష్మి, మోదుగుల రవికృష్ణ, ఆచార్య ఎన్. వి.కృష్ణారావు, సీహెచ్. మస్తానయ్య, నూతలపాటి తిరుపతయ్య, తూములూరి రాజేంద్రప్రసాద్, వల్లూరి శివప్రసాద్, రావి రంగారావు, కొండా శివరామిరెడ్డి, సయ్యద్ జానీ బాషా, తదితరులు సభలో పాల్గొన్నారు. సోమేపల్లితో తమకున్న సాహితీ స్మృతుల్ని నెమరు వేసుకున్నారు. తొలుత ఆయన చిత్రపటానికి నివాళులర్పించి, రెండు నిమిషాల మౌనం పాటించారు. కార్యక్రమాన్ని శ్రీ వశిష్ట, శ్రీ విశ్వనాథ విరించి, తోటకూర వెంకట నారాయణ, మానుకొండ ఉపేంద్ర, చలపాక ప్రకాష్ నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సాహితీవేత్తలు, సోమేపల్లి బంధు మిత్రులు పాల్గొన్నారు. రెవెన్యూ, జిల్లా పరిషత్ అధికార అనధికారులు పాల్గొని, విధి నిర్వహణలో ఆయన నీతి, నిజాయతీ, క్రమశిక్షణ ఆదర్శప్రాయమని కొనియాడారు.
జిల్లావ్యాప్తంగా
పటిష్ట బందోబస్తు
నగరంపాలెం: శాంతి, సమాధానం సుగుణాలుగా కలిగిన ఏసుక్రీస్తు మార్గం అనుసరణీయమని జిల్లా ఎస్పీ కె. ఆరిఫ్‌హఫీజ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలకు ఆయన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా జిల్లావ్యాప్తంగా అన్ని చర్చిల వద్ద, ముఖ్యమైన ప్రదేశాలలో పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలంతా పోలీసులకు సహకరించాలని, క్రిస్మస్ పండుగను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని ఆయన సూచించారు.
శరవేగంగా దీక్ష విరమణ ఏర్పాట్లు
● తుది దశకు క్యూలైన్ పనులు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానంలో జనవరి 3 నుంచి 7వ తేదీ వరకు నిర్వహించే భవానీ దీక్ష విరమణ మహోత్సవాలకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. వినాయకుడి గుడి వద్ద నుంచి ప్రారంభమైన క్యూలైన్ల ఏర్పాటు దాదాపు పూర్తయింది. కనకదుర్గనగర్‌లో ప్రసాదం కౌంటర్ల కోసం క్యూలైన్లు ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. లక్ష్మీ గణపతి ప్రాంగణంలో షెడ్డు నిర్మాణం, మహా మండపం దిగువన హోమ గుండాల పనులు జరుగుతున్నాయి. రెండు, మూడు రోజుల్లో హోమగుండాల నిర్మాణం పూర్తవుతుందని ఆలయ ఇంజినీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు. దీక్ష విరమణలపై ఆలయ ఈవో కె.ఎస్.రామారావు ఇంజిరింగ్ అధికారులతో సమీక్షిస్తున్నారు. దేవస్థాన చైర్మన్ కర్నాటి రాంబాబు పనులు నెలాఖరుకు పూర్తి కావాలని సూచిస్తున్నారు. వీరితోపాటు కలెక్టర్ ఢిల్లీరావు, సీపీ టీకే రాణా ప్రత్యేక దృష్టి పెట్టారు.
రేపు గిరిప్రదక్షిణ
పౌర్ణమి పురస్కరించుకుని డిసెంబర్ 26వ తేదీన ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఈవో కె.ఎస్.రామారావు పేర్కొన్నారు. లోక కల్యాణార్థం, భక్తజన శ్రేయస్సును కాంక్షిసూ ప్రతి పౌర్ణమి రోజు శ్రీ దుర్గామల్లేశ్వరస్వామివార్లు కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ నిర్వహించడం ఆనవాయితీ. మంగళవారం తెల్లవారుజామున 5.55 గంటలకు ఘాట్ రోడ్డులోని కామధేను అమ్మవారి ఆలయం నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభం కానుంది.
