యువత నైపుణ్యాలే అభివృద్ధికి చుక్కాని

World Youth Skills Day 2022: Bandaru Dattatreya Article - Sakshi

మానవ వనరులను సరైన రీతిలో వినియోగించుకోవడంలో నైపుణ్యాలు కీలక పాత్ర పోషిస్తాయి. నైపుణ్యం కలిగిన శ్రామికశక్తి అనేది ఒక ఆస్తి. స్థిరమైన ఆర్థిక అభివృద్ధికి అది అత్యంత అవసరం. ప్రస్తుతం కొనసాగుతున్న ‘వరల్డ్‌ యూత్‌ స్కిల్స్‌ డే–2022’ అనేది బిల్డ్‌ బ్యాక్‌ ప్రాసెస్‌ను దృష్టిలో ఉంచుకుని ‘జీవితం, పని, స్థిరమైన అభివృద్ధి కోసం అభ్యాసం, నైపుణ్యాలు’ అనే అంశాలపై దృష్టి సారించింది. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న యువ జనాభా...  విధాన రూపకర్తలకు ప్రతిచోటా అనేక అవకాశాలతోపాటు అనేక  సవాళ్లను విసురుతోంది. లేబర్‌ మార్కెట్‌లో మారుతున్న అవసరాలు... పెరుగుతున్న టెక్నాలజీ వినియోగం అనేవి అందులో కొన్ని. అందుకు తగినట్టుగా మన యువతను ఉపాధి, వ్యవస్థాపక నైపుణ్యాలతో సన్నద్ధం చేయడానికి ప్రయత్నించాలి. తద్వారా వారు మారుతున్న ప్రపంచాన్ని ఎదుర్కోవడమే కాకుండా సానుకూల మార్పులకు క్రియాశీల ప్రతినిధులుగా కూడా మారతారు.  

సాంకేతిక, వృత్తి విద్య, శిక్షణా (టీవీఈటీ) సంస్థలు యువత జీవితాలలో ముఖ్యమైన వ్యవస్థాపక విలువలను ప్రోత్సహించడంలో, ఆర్థికాభివృద్ధి, స్థిరమైన సమాజ నిర్మాణంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. వ్యవస్థాపక అభ్యాసాన్ని నిర్ధారించడం నుండి వృత్తి శిక్షణలో ఉపాధి నైపుణ్యాలను ప్రధాన స్రవంతిలో చేర్చడం వరకూ... ఆరోగ్యకరమైన విధానం అవసరం. ఇందుకు టీవీఈటీ సంస్థలు, ఉద్యోగ సంఘాలు, సంస్థల యాజమాన్యాలు, విధాన రూపకర్తలు, మేధావులు, పబ్లిక్‌ పాలసీ నిపుణులు, అభివృద్ధి భాగస్వాములు ఇలా... అందరూ కలిసి నైపుణ్యానికి సంబంధించిన కార్యక్రమాలను ఉద్యమ స్ఫూర్తితో  అమలు చేయడం అవసరం.

భవిష్యత్తు అవసరాలు, సవాళ్లకు అనుగుణంగా కొత్త జాతీయ విద్యా విధానం–2020 ఉంది.  నైపుణ్యం అంతరాలను పూరించడానికి పాఠశాల స్థాయిలో వృత్తి విద్య ద్వారా తీవ్రమైన ప్రయత్నాలు జరిగాయి. పాఠశాల, ఉన్నత విద్యా వ్యవస్థలలో చదివే వారిలో 2025 నాటికి కనీసం 50 శాతం మంది వృత్తి విద్యను పొందగలరు. 10+2 పూర్తి చేయడానికి ముందే ప్రతి విద్యార్థికీ ఒక వృత్తి విద్యా కోర్సు నేర్పడం ద్వారా అద్భుతాలు సాధించవచ్చు. 2025 నాటికి, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, ఆర్టిíఫీషియల్‌ ఇంటెలిజెన్స్, రియల్‌ టైమ్‌ అనలిటిక్స్, 5ఏ వంటి వాటిని నిర్వహించడానికి నైపుణ్యాలు కలిగిన 2.23 కోట్ల మందికి  కొత్తగా ఉపాధి అవకాశాలు ఉంటాయని అంచనా. అందుకే ఎన్‌ఈపీ–2020 శాస్త్రీయ, వృత్తి శిక్షణకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది.

ఎక్కువ యువజన జనాభా ఉన్న ప్రపంచంలోని దేశాలలో భారతదేశం ఒకటి. 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు జనాభాలో 65 శాతం ఉన్నారు. దేశ జనాభాలో 15–29 సంవత్సరాల వయస్సు గల యువత 27.5 శాతం ఉన్నారు.  

పోటీకి తగిన విధంగా వృత్తి నైపుణ్యానికి సంబంధించి అంతరాలు తగ్గించేలా కేవలం వృత్తి నిపుణత ఉన్న యువతే కాకుండా... రీ స్కిల్లింగ్‌.. అప్‌ స్కిల్లింగ్‌ వంటి లక్షణాలు ఉన్న యువత అవసరం కరోనా మహమ్మారి తర్వాత పెరిగింది. బడి బయట ఉన్న ఉపాధి, విద్య, శిక్షణ లేని యువతకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలను అందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలి. వారు పొందే వృత్తి నైపుణ్యాలను గుర్తించడంతోపాటు సర్టిఫై చేయడం, ఉపాధి పొందేలా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. 

భవిష్యత్తు వృత్తి నైపుణ్య అవసరాలకు తగ్గట్టుగా మన యువతను తయారు చేసుకోవాలి. ‘4వ పారిశ్రామిక విప్లవం – పరిశ్రమ 4.0 ’ అనేది ఉత్పాదకత, సామర్థ్యాన్ని పెంచడానికీ, అన్ని స్థాయిల్లో సమాచార వినిమయం... సుస్థిరత, వాతావరణ మార్పు తదితర అంశాలను సమన్వయం చేసుకోవడానికీ ఉద్దేశించింది. ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ అనేది తయారీ రంగానికి పెద్దపీట వేసింది.

ఈ రంగంలో మొత్తం ఉపాధి అవకాశాలు 2017–18 సంవత్సరంలో 57 మిలియన్ల ఉంటే.. అవి 2019–20 సంవత్సరంలో 62.4 మిలియన్లకు పెరిగాయి. దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో తయారీ రంగం దాదాపు 17 శాతం వాటాను అందిస్తుంది. దీన్ని 25 శాతానికి పెంచగలిగితే నైపుణ్యం కలిగిన కార్మికులకు మరిన్ని ఉద్యోగావకాశాలు లభిస్తాయి. నైపుణ్యాభివృద్ధి ఎందుకు ముఖ్యమంటే... నైపుణ్యాలు, మేధోశక్తి ఏ దేశానికైనా ఆర్థిక వృద్ధి, సామాజిక అభివృద్ధికి చోదక శక్తులు. మెరుగైన నైపుణ్య ప్రమాణాలు కలిగిన దేశాలు దేశీయ, అంతర్జాతీయ ఉద్యోగ మార్కెట్లలోని సవాళ్లు, అవకాశాలను అందిపుచ్చుకోవడానికి మరింత సమర్థవంతంగా తమను తాము తీర్చిదిద్దుకుంటాయి. ‘భారతదేశంలో విద్య, వృత్తి శిక్షణ స్థితి’పై ఎన్‌ఎస్‌ఎస్‌ఓ 2011–12 (68వ రౌండ్‌) నివేదిక ప్రకారం, 15–59 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులలో 2.2 శాతం మంది అధికారిక వృత్తిపరమైన శిక్షణ పొందినట్లు తెలిసింది. మరో 8.6 శాతం మంది నాన్‌–ఫార్మల్‌ వొకేషనల్‌ కోర్స్‌లు చేసినట్టు నివేదిక తెలిపింది. అయితే దేశంలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు భారీ ఆస్కారం ఉందనే విషయంపై మాత్రం ఎలాంటి  వివాదం లేదు.

వ్యవసాయం, భవన నిర్మాణం, రియల్‌ ఎస్టేట్, రిటైల్, లాజిస్టిక్స్, రవాణా, గిడ్డంగులు, వస్త్రాలు, దుస్తులు, విద్య నైపుణ్యాభివృద్ధి, చేనేత, హస్తకళ, ఆటో, ఆటో విడి భాగాలు, ప్రైవేట్‌ భద్రతా సేవలు, ఆహార ప్రాసెసింగ్, ఇంటిపని, పర్యాటకం, ఆతిథ్యం, రత్నాలు, ఆభరణాలు, అందం, ఆరోగ్యం వంటి 24 రంగాలలో 2017–2022లో 103 మిలియన్ల మంది అవసరం ఉందని నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ నియమించిన ఎన్విరాన్‌మెంట్‌ స్కాన్‌ నివేదిక–2016 అంచనా వేసింది. (క్లిక్‌: ఇది సర్కారీ కాంట్రాక్టుల దోపిడీ!)
 

- బండారు దత్తాత్రేయ
హరియాణా గవర్నర్‌
(నేడు ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవం)

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top