రక్షకులకు... రక్షణ అవసరం లేదా?

Varakumar Gundepangu Opinion On Economic, Political, Social issues of Police - Sakshi

అభిప్రాయం

సమాజంలో యంత్రంలా నిరంత రాయంగా పనిచేసే ఒకే ఒక వ్యక్తి పోలీస్‌. వారు లేని సమాజాన్ని మనం ఊహించలేమంటేనే మనకు అర్థమౌతుంది పోలీసుల అవసరం ఎంతగా ఉన్నదో! వారి ఔన్నత్యం గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా మిగిలేవుంటుంది. ఇదే సమయంలో వారి ఆర్థిక, రాజకీయ, సామాజిక సమస్యలు కూడా ఇదే తరహాలో ఉంటాయి.

దేశంలో నానాటికి చోటుచేసుకుంటున్న విపరీత పరిణామాలు, తలెత్తుతున్న వికృత మానసిక ధోరణులు, రాజకీయ నిర్ణయాలు... ఇలా మరెన్నో కారణాల ప్రభావం మొదటగా పడుతున్నది పోలీసుల జీవితాల పైనే. తీవ్ర వాద, ఉగ్రవాద చర్యలతో జరిగే నష్టాలు ప్రముఖంగా కన బడతాయి. కానీ వారి వృత్తి బాధ్యతల్లోని ఒత్తిడి వారిని హృద్రోగులుగా మారుస్తోంది. పేరుకు పోలీసు ఉద్యోగం. కానీ ఇరవై నాలుగు గంటల పనిభారం. అవిశ్రాంతంగా విధులు నిర్వహిస్తూ రోగాల బారిన పడుతున్నవారున్నారు. నిరంతరం ట్రాఫిక్‌ పనుల్లో మునిగి ఊపిరితిత్తులు, శ్వాసకోశ రోగాలతో అసువులు బాస్తున్నవారున్నారు. కుటుంబాలకు దూరంగా ఉండాల్సిరావడం స్వీయ మానసిక వేధింపులను ప్రేరేపి స్తోంది. విధుల ఒత్తిడి భారంతో ఆత్మహత్యలకు కూడా దారితీస్తోంది. సమాజం కోసం కొవ్వొత్తిలా కరిగిపోతున్న పోలీసుల జీవితాలపై ప్రభుత్వాలు శ్రద్ధ వహించాలి.

పోలీసుల సంక్షేమం కొరకు మాట్లాడే గొంతుకలు చట్టసభల్లో ఉండాలి. అదేవిధంగా  మనదేశంలో పోలీసు శాఖను ప్రత్యేక ప్రతిపత్తి వ్యవస్థగా తీర్చిదిద్దుకున్నప్పుడే మెరుగైన పోలీసింగ్‌ ఉంటుంది. పోలీసుల జీవితాల్లో మెరుగుదల కోసం సంక్షేమ ఏర్పాట్లు చేయాలి. ప్రపంచ దేశాలలో అమలౌతున్న సానుకూల పోలీసు విధివిధానా లను మనదేశానికి అనుగుణంగా మలుచుకుని, అమలు చేయవలసి ఉన్నది. మరీ ముఖ్యంగా శాఖలో అంతర్గ తంగా దాగివున్న బాసిజాన్ని పూర్తిస్థాయిలో అంతం చేసిన ప్పుడే ఆరోగ్యవంతమైన సేవలు ప్రజలకు మరింత చేరు వగా వస్తాయి. ఫ్రెండ్లీ పోలీస్, పీపుల్‌ పోలీస్‌ ఉండటం మంచిదే. మరి పోలీసు శాఖలో అంతర్గతంగా ఫ్రెండ్లీ కల్చర్‌ అవసరం లేనిదా? కిందిస్థాయి పోలీసుల్లో మరింత ఆత్మస్థైర్యం పెంపొందించేలాగ ఆఫీసర్లు, సిబ్బంది మధ్యలో సోదరభావ దృఢత్వాన్ని పెంచాల్సి ఉంది. దేశాన్ని పట్టి పీడిస్తున్న కులాన్ని పోలినటువంటిదే నిచ్చెన మెట్ల ర్యాకింగ్‌ సిస్టం. మొదట దీనిని రద్దుచేసి అందరూ ఆఫీసర్లు అనే మాటను అమల్లోకి తేవాలి.

మానసిక భయాందోళనలకు గురవుతున్న పోలీసు కుటుంబాల జీవితాలకు ప్రభుత్వాలే భరోసాగా నిలవా ల్సిన ఆవశ్యకత ఉంది. జీతాల మెరుగుదల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసులకు ప్రత్యేక పీఆర్సీ వ్యవస్థను అమలు చేయాలి. మరీ ముఖ్యంగా సారవంతమైన పోలీ సింగ్‌ ప్రజలకు అందుబాటులోకి రావాలంటే, దేశంలో ఉండే ఆర్మీ, పారామిలిటరీ వంటి బలగాల మాదిరిగా అన్ని రాష్ట్రాలూ పోలీసుల సర్వీసు పరిమితిని ఇరవై ఐదేళ్లకు కుదించాలి.

అమరుల కుటుంబాలకు నిబద్ధతతో విద్య, వైద్యం పూర్తిగా ఉచితంగా ప్రభుత్వాలే అందించాలి. కరోనా వంటి భయంకరమైన మహమ్మారి కాలంలో సేవలు అందిస్తూ అసువులుబాసిన పోలీసుల్ని కూడా యోధులుగా చూడాలి. మారుతున్న సమాజానికి దీటుగా పోలీసు వ్యవస్థను మార్చుకోవాల్సిన అవసరం దేశం మొత్తానిది. ఏటా భారీ సంఖ్యలో రిక్రూట్మెంట్లు జరిపి పనిభారం వలన కలిగే ఒత్తిడిని నివారించాలి. పోలీసుల త్యాగాలు వారి వ్యక్తిగత మైనవి కాదు, వ్యవస్థీకృతమైనవి. అందుకే పోలీసులపట్ల గౌరవప్రదమైన నడవడికను ప్రజల్లో నింపే విధంగా పోలీసు ఉద్యోగ ఔన్నత్యాన్ని పాఠ్యాంశాలలో చేర్చాలి. నేడు మన తెలుగు రాష్ట్రాల్లో అనేక రకాలుగా విధులు నిర్వహిస్తున్న పోలీసుల సమస్యల్లో ముందు వరుసలో ఉండేవి – ప్రమోషన్లు, బదిలీలు, ఏక్‌ పోలీస్‌ విషయాలు. వీటిల్లో సత్వర న్యాయాన్ని అందించే క్రియాశీలక పాత్రను ప్రభుత్వాలు పోషిస్తూ కిందిస్థాయి పోలీసులకు అండగా ఉండాలి. పోలీసుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పని చేస్తే ప్రతి రాష్ట్రం దేశంలో ఉత్తమ రాష్ట్రం అవుతుంది.


వరకుమార్‌ గుండెపంగు 
వ్యాసకర్త రచయిత, పోలీసు ఉద్యోగి, సూర్యాపేట
మొబైల్‌: 99485 41711

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top