కుదిరి చెదిరిన ఒప్పందం

Sakshi Guest Column Story On India Pakistan Problems

దీర్ఘకాల సరిహద్దు ఘర్షణలను పరిష్కరించే ఒక ఒప్పందం భారత్, పాకిస్తాన్‌ మధ్య దాదాపుగా కుదిరినట్లు కనిపించిందని సతీందర్‌ లాంబా పుస్తకం ‘ఇన్‌ పర్స్యూట్‌ ఆఫ్‌ పీస్‌’ వెల్లడిస్తోంది. ఈ ఒప్పందం కోసం ఇరుదేశాలు తెరవెనుక చర్చలను విస్తారంగా కొనసాగించాయనీ, దాదాపు సంతకాల దాకా వచ్చాయనీ ఈ పుస్తకం చెబుతోంది. 2014 సార్వత్రిక ఎన్నికలపై భారత్‌ దృష్టి పెట్టిన తర్వాత ఈ ప్రక్రియ నత్తనడక నడిచి ఆగిపోయింది. ఈ ఒప్పందం కుదిరివుంటే, చరిత్రే మారిపోయేది. ఈ ఒప్పంద ప్రక్రియను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని ఇరుపక్షాలూ భావిస్తే దానికి అవసరమైన మార్గదర్శక సూత్రాలు సిద్ధంగా ఉన్నాయని ఈ పుస్తకం గట్టిగా చెబుతోంది.

మాజీ రాయబారి సతీందర్‌ లాంబా రచించిన పుస్తకం ‘ఇన్‌ పర్సూ్యట్‌ ఆఫ్‌ పీస్‌’ విషాదకరంగా ఆయన మరణానంతరం ప్రచురితమైంది. అయితే భారత్, పాకిస్తాన్‌ బ్యాక్‌ చానెల్‌కు (గుప్త లేదా ద్వితీయ శ్రేణి సమా చార బదిలీ మార్గం) సంబంధించిన అద్భుతమైన వివరాలను ఈ పుస్తకం వెల్లడించింది. అలాగే రెండు దేశాలు ఒప్పందానికి ఎంత సమీపానికి వచ్చాయో కూడా ఇది చక్కగా వివరించింది. యూపీఏ ప్రభుత్వ రెండో పాలనా కాలంలో, ప్రధానిగా డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ పదేళ్ల పాలన చివరలో ఈ ముసాయిదా ఒప్పందంపై సంతకాలు చేయడానికి కూడా అంగీ కారం కుదిరిందని ఈ పుస్తకం నిర్ధారిస్తోంది.

‘2003 మే నుంచి 2014 మార్చి వరకు బ్యాక్‌ చానెల్‌ సమా వేశాలు 36 జరిగాయి’ అని నాకు తెలిసిన సతీ (సతీందర్‌) రాశారు. ఈ ఒప్పందంలో చాలావరకు జనరల్‌ ముషారఫ్‌ హయాంలో ముగింపునకు వచ్చింది. ఆయన అధికారం కోల్పోయిన తర్వాత ఏమీ జరగ లేదు. కానీ నవాజ్‌ షరీఫ్‌ ‘ఈ ప్రక్రియకు కొత్త ఊపును, వేగాన్ని తీసు కొచ్చారు’. దురదృష్టవశాత్తూ, ఆ తర్వాత ‘భారత్‌ దృష్టి 2014 సార్వ త్రిక ఎన్నికల వైపు మళ్లింది.’ నేను అనుకునేది సరైనదే అయితే, రెండు సందర్భాల్లో ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరే పరిస్థితులు ఏర్పడ్డాయి. మొదట 2007లో అది సాధ్యపడేట్టు కనిపించింది కానీ ముషారఫ్‌కు ఉన్న ‘అంతర్గత సమస్యల’ వల్ల  వీగిపోయింది. ఇక రెండోది– ఇది నా వ్యాఖ్యానం – ఎన్నికల వైపు దృష్టిని భారత్‌ మరల్చడానికి ముందుగా నవాజ్‌ షరీఫ్‌ కాలంలో!

అనూహ్య ఘటన
అయితే, మోదీ గెలుపుతో ఆశలేమీ పోలేదు. ‘బ్యాక్‌ చానెల్‌ ప్రక్రియను కొనసాగించాలనే ఉద్దేశం ఉన్నట్లు కనిపించింది’ అని  సతీ పేర్కొన్నారు. ‘ఈ అంశంపై ఫైల్‌ని సమీక్షించారు. ఈ ఒప్పందంలో ఎలాంటి ముఖ్యమైన మార్పూ ఉండబోదని కూడా నాకోసారి చెప్పారు. ప్రత్యేక దూతగా ఒక విశిష్ట రాయబారిని నియమించాలని కూడా ప్రధానమంత్రి మోదీ భావించారు. నన్ను ఆయన్ని కలవాలని కోరారు.’ కానీ ఆ రాయబారిని నియమించనేలేదు.

మోదీ ప్రభుత్వం 2017 ఏప్రిల్‌లో మరోసారి ఆ ఒప్పందం కోసం ప్రయత్నించింది. ‘ప్రధాని కార్యాలయంలోని సీనియర్‌ అధికారి ఒకరు నన్ను కలవడానికి మా ఇంటికొచ్చారు. పాకిస్తాన్‌ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌తో భేటీ కావడానికి మీరు పాకిస్తాన్‌ వెళ్లాలని ప్రధాని కోరుకుంటున్నారని ఆయన నాతో చెప్పారు’. అయ్యో! అయితే, భారత్‌ తరహా ఒక పరిణామం దీన్ని మొగ్గలోనే తుంచేసింది. షరీఫ్‌తో చర్చించాల్సిన అంశాల వివరాలతో పాటు పాకిస్తాన్‌కు ప్రయాణించడానికి అవసరమైన ట్రావెల్‌ డాక్యుమెంట్లను ఇవ్వాలని సతీందర్‌ కోరి, వాటికోసం వేచి ఉన్నారు.

కానీ ఆ తరుణంలోనే విచిత్రమైన ఘటన జరిగింది. ‘దూతగా వ్యవహరిస్తున్న ఒక ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త తన వ్యక్తిగత విమానంలో పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌తో భేటీ కావడానికి పాకిస్తాన్‌ వెళ్లారనే వార్తను నేను చూశాను. అలాంటి పరిస్థితుల్లో ఒకే ఉద్దేశం కోసం పాక్‌ ప్రధాని వద్దకు వెళ్లడానికి ఇద్దరు వ్యక్తులు ప్రాతినిధ్యం వహించడం సరైంది కాదు.’ ఆ వ్యాపారవేత్త పేరు సతీందర్‌ బయటపెట్టలేదు. అయితే ఆయన సజ్జన్‌ జిందాల్‌ కావచ్చునని పాకిస్తాన్‌ హైకమిషనర్‌గా పనిచేసిన అబ్దుల్‌ బాసిత్‌ అన్నారు. ‘ఈ అంశం మీద నేను జరిపిన చివరి సంభాషణ ఇదే’ అని సతీందర్‌ రాశారు.

మన్మోహన్‌ సింగ్‌ పాలనలో ఇరుదేశాల మధ్య ఒప్పందం దాదాపుగా ఫలవంతమయ్యేటట్టు కనిపించిందని సతీందర్‌ చెప్పిన వివరాలు స్పష్టం చేస్తున్నాయి. ‘ప్రధాని మన్మోహన్‌తో నేను 68 సార్లు కలిసినట్లు నా డైరీ గుర్తుచేసింది’. పైగా ‘ఈ పరిణామాల గురించిన మొత్తం సమాచారం ప్రణబ్‌ ముఖర్జీకి తెలియజేయడమైంది’. 2006 నవంబర్‌లో సోనియాగాంధీకి ఈ ఒప్పంద వివరాలు తెలపడం జరిగింది. అంతకుముందు 2005లో ఆర్మీ చీఫ్‌ ఈ విషయంలో పాలు పంచుకున్నారు. పైగా అటల్‌ బిహారీ వాజ్‌పేయి, ఎల్‌కే అడ్వాణీ, బ్రజేశ్‌ మిశ్రా, ఫరూఖ్‌ అబ్దుల్లా, ఒమర్‌ అబ్దుల్లా, ముఫ్తీ మహమ్మద్‌ సయీద్, కరణ్‌ సింగ్, గులామ్‌ నబీ ఆజాద్‌లకు కూడా ఈ సమా చారం అందించడం జరిగింది. ఈ ఒప్పందం ఫలితం భారత రాజ్యాంగానికీ, జమ్ము–కశ్మీర్‌ రాజ్యాంగానికీ, పార్లమెంటరీ తీర్మానాలకూ అనుగుణంగా ఉండేలా ప్రయత్నాలు జరిగాయి. ప్రధాన న్యాయ మూర్తి ఆనంద్‌తో 2006 మార్చి నుంచి 2007 మార్చి మధ్యలో సతీందర్‌ ఆరుసార్లు సమావేశమయ్యారు. ప్రఖ్యాత న్యాయవాది ఫాలీ నారిమన్‌ను కూడా కలిశారు.

సరిహద్దులు మారవు

ముషారఫ్‌ నాలుగు సూత్రాల(ఫోర్‌–పాయింట్‌ ఫార్ములా)పై, మన్మోహన్‌ సింగ్‌ అమృత్‌సర్‌లో చేసిన ప్రసంగంలోని మూడు ఆలోచనలపై ఈ ఒప్పందం ఆధారపడింది. ఈ చర్చలకు పెట్టుకున్న  14 మార్గదర్శక సూత్రాలను సతీందర్‌ పేర్కొన్నారు. వాటిల్లో కొన్ని: ‘సరిహద్దులను తిరగరాసే ప్రసక్తి లేదు.’ ‘ఎల్‌ఓసీ(నియంత్రణ రేఖ)కి ఇరువైపులా, ముఖ్యంగా జనం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సైనిక కదలికలను కనిష్ఠ స్థాయిలో ఉంచాలి.’ ‘నియంత్రణ రేఖకు ఇరు వైపులా అంతర్గత నిర్వహణ కోసం స్వయంపాలనను ఏర్పర్చాలి.’ ‘నియంత్రణ రేఖకు ఇరువైపులా ఉన్న ప్రజలు ఒక వైపు నుంచి మరొక వైపునకు వెళ్లడానికి స్వేచ్ఛ ఉండాలి.’ అలాగే, ‘ప్రభుత్వ విధానంగా ఉగ్రవాదాన్ని ఉపయోగించకుండా, తన భూభాగాన్ని రాజ్యేతర శక్తులకు అనుమతించకుండా పాక్‌ కట్టడి చేయాలి’.

ఈ ఒప్పందం జరిగివుంటే, ‘చరిత్ర క్రమాన్ని మార్చివేయడం సాధ్యపడేది’. అయితే ఇప్పటికి కూడా ఇది ముగిసిపోలేదని సతీందర్‌ సూచిస్తున్నారు. ‘ఈ ఒప్పంద సంభావ్యత ఇప్పటికీ ఉనికిలో ఉంది. ముసాయిదా ఒప్పంద సూత్రాలు కానీ, దాని పాఠం కానీ ఇప్పటికీ ఉన్నాయి. ఒప్పంద ప్రక్రియను పునరుద్ధరించాల్సిన ఆవశ్యకత
ఉందని ఇరుపక్షాలూ భావించినప్పుడు ఎప్పుడైనా దాన్ని మొదలు పెట్టవచ్చు’. నేననుకోవడం ఆశ అనేది నిత్యవసంతం!

- కరణ్ థాపర్, వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌ 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top