సవరించిన గణాంకాల సంగతులు | Sakshi Editorial On India economy GDP Growth | Sakshi
Sakshi News home page

సవరించిన గణాంకాల సంగతులు

Mar 30 2026 12:26 AM | Updated on Mar 30 2026 12:26 AM

Sakshi Editorial On India economy GDP Growth

విశ్లేషణ

ఆర్థిక వ్యవస్థలో చోటుచేసుకుంటున్న మార్పులను తగినంతగా పసిగట్టేందుకు మనకు మరింత వర్తమాన ఆధార సంవ త్సరాలు అవసరమని కొన్నేళ్ళుగా ఒక వాదన సాగుతోంది. స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) నూతన శ్రేణికి సంబంధించి 2022–23ను ఆధార సంవత్సరంగా తీసు కోవాలన్న నిర్ణయంతో అది నెరవేరింది. (ఆర్థిక వ్యవస్థలో మార్పులను లెక్క గట్టేందుకు ఆధార సంవత్సరం (బేస్‌ ఇయర్‌) ఇంతకుముందు 2011–12గా ఉంది.అంతర్జాతీయ ప్రమా ణాల ప్రకారం దీన్ని ఐదేళ్లకోసారి సవరించాలి. కానీ 2017–18లో జీఎస్టీ ప్రవేశపెట్టడం వల్ల అదింకా స్థిరపడలేదని దాన్ని మినహా యించారు. 2019–20; 2020–21 సంవత్సరాల్లో కోవిడ్‌ ప్రభావం ఉండటం, దాని తర్వాతి ఏడాది సహజంగానే వృద్ధి రేటులో పెరుగు దల ఉంటుంది కాబట్టి వాటినీ తీసుకోలేదు. దాంతో 2022–23ను సాధారణ ఆర్థిక సంవత్సరంగా పరిగణించారు.)

మారిన రేట్లు
మొదటగా, ఈ సంవత్సర ఆర్థిక స్థితికి సంబంధించి పెద్దగా మార్పు లేదు. ఈ ఏడాదికి సంబంధించి ఆర్థిక వృద్ధిని 7.4% నుంచి 7.6%కి సవరించారు. కానీ, ఇంతకు ముందు ఏళ్ళకు సంబంధించిన వృద్ధి రేట్లలో తీవ్రమైన మార్పు కనిపించింది. 2024 ఆర్థిక ఏడాదిది 9.2% నుంచి 7.2%కి తగ్గింది. 2025 ఆర్థిక ఏడాదిది 6.5% నుంచి 7.1%కి పెరిగింది. కొత్త శ్రేణిని ప్రవేశపెట్టినపుడు  ఇలాంటివి జరగడం సాధారణ విషయమే. కానీ, 7% వృద్ధి బాటలో ఇలాగే కొనసాగగలిగితే గొప్ప విషయమే. 2027 ఆర్థిక ఏడాదిలో కూడా వృద్ధి రేటు 7% నుంచి 7.5% ఉండగలదని అంటున్నారు. ఇరాన్‌– అమెరికా సంక్షోభ ప్రభావాన్ని తట్టుకుంటూ అలా వృద్ధి రేటును నిలబెట్టుకోగలిగితే సంతోషమే.

సాధారణ, వాస్తవిక జీడీపీని నిరపేక్ష విలువ వచ్చే విధంగా తిరిగి మదింపు చేయడం ఆసక్తికరమైన విషయం. నూతన ఆధార సంవత్సరాన్ని ఎప్పుడు తీసుకున్నా సాధారణ, వాస్తవిక జీడీపీకి సంబంధించి నిరపేక్ష విలువలు ఒకే విధంగా ఉంటాయి. ఇవి ప్రస్తుతం 261.2 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇవి పాత శ్రేణిలోని నిరపేక్ష విలువలకన్నా దాదాపు రూ. 7.8 లక్షల కోట్లు తక్కువ. ఇక ప్రాధాన్యం లేనివి అనుకున్న కొన్ని వస్తువులు, సేవలను కొత్త శ్రేణి నుంచి తొలగించడం దానికి కారణం కావచ్చు. నూతన శ్రేణిలో కొత్తగా కొన్నింటిని చేర్చినా అవి ఆ వెలితిని భర్తీ చేయలేక పోయి ఉంటాయి. 

ఇక్కడ నుంచి, సాధారణ జీడీపీ సంఖ్యలు పాత శ్రేణులకన్నా తక్కువగా ఉన్నాయి. (ద్రవ్యోల్బణానికి సర్దుబాటు చేసిన) వాస్తవిక జీడీపీ అధికంగా ఉంది. ఆధార సంవత్సరాన్ని 2022–23కు ముందుకు సర్దుబాటు చేసినప్పుడు ఇలా జరగడం సహజమే. వృద్ధి రేటు ముఖ్యంకానీ, వాస్తవిక జీడీపీకి ఆ లెక్కలు అంత ప్రాధాన్యం లేనివి కావచ్చు. కానీ, సాధారణ జీడీపీకి ఆ సంఖ్యలు ముఖ్యమైనవి. వాటిద్వారా గుర్తించే ద్రవ్య లోటు నిష్పత్తి వంటి ఇతర నిష్పత్తులను విధానాల రూపకల్పనకు ఉపయోగించుకుంటారు.  

పెరిగినవి–తగ్గినవి
నూతన శ్రేణిలో మూడవ అంశం సాధారణ జీడీపీలో విని మయం వాటా తక్కువగా ఉండటం. గత శ్రేణిలో ఈ నిష్పత్తి 60% పైచిలుకుగా ఉండేది. సవరించిన సిరీస్‌లో ఇది 56.7%కి తగ్గింది. ఆ రెండు సంఖ్యల్లో తేడా పెద్ద ఎక్కువది కాకపోవచ్చు. కానీ, వినిమయానికి తగ్గిన ప్రాధాన్యాన్ని సూచిస్తోంది. కోవిడ్‌ అనంతర కాలం దీనికి ప్రధాన కారణం కావచ్చు. ఆ కాలంలో అధిక ద్రవ్యోల్బణం డిమాండ్‌ను మందగింపజేసింది. స్థూల స్థిర మూల ధన కల్పనకు కూడా అదే వర్తిస్తుంది. అది 30% నుంచి 31.7%కి పెరిగింది. కానీ, అది 2023 ఆర్థిక సంవత్సరంలో 32.4% నుంచి తగ్గింది.

చివరగా, రంగాలవారీ పనితీరులో అంతుపట్టని తేడా కనిపించింది. గత శ్రేణితో పోల్చుకుంటే, వ్యవసాయం, విద్యుత్తు, ఇంధన వాయువు, జల రంగాల పనితీరు వాటి సామర్థ్యం మేరకు లేదు. పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, రక్షణ, ఇతర సర్వీసుల వాటాలో పెద్ద మార్పు ఉంది. గతంలో అవి 9.9% పెరిగితే, కొత్త శ్రేణిలో 5.8% పెరుగుదలనే చూపించాయి. గణనకు అనుసరించిన పద్ధతి దీనికి ఎక్కువ కారణం కావచ్చు. గతంలో, మితిమీరి అంచనా వేశారన డానికి కూడా అది సంకేతం కావచ్చు. 

నిర్మాణ, ఫైనా¯Œ ్స, స్థిరాస్తి వంటి రంగాలు వాటి వృద్ధి రేట్లను నిలబెట్టుకున్నాయి. గనుల తవ్వకం (నెగెటివ్‌ నుంచి 4.1%కి పాజిటివ్‌గా మారింది), వస్తూత్పత్తి, వర్తకం, రవాణా, హోటళ్ళు వంటివి  అత్యధిక పనితీరు కనబరచాయి. గత మూడేళ్ళుగా 11.2% సగటు వృద్ధి రేటుతో వస్తూత్పత్తి రెండంకెలతో మిగిలినవాటికన్నా స్టార్‌గా నిలిచిందని చెప్పవచ్చు. గతంలో, అది 7.9% మాత్రమే ఉంది. అయితే, ఈ విషయంలో ఒక లోపం ఉంది. పారిశ్రామిక ఉత్పత్తి సూచి ఇప్పటికీ పాత ఆధార సంవత్సర ప్రాతిపదికనే ఉంది. ఆ సూచి మొదటి 10 నెలల్లో కేవలం 4% వృద్ధిని కనబరచింది. 

మరింత సమగ్ర డేటా
భారత్‌ వృద్ధి బాటలో ఉందనే కథనంలో ఈ కొత్త శ్రేణి మార్పు తేలేదు. కానీ, కవరేజీ విషయంలో విలువను జోడించింది. పరిస్థితు లకు తగ్గట్లుగా సవరణ చేపడుతూ, బుట్టలో కొత్తవాటిని చేర్చడం, పాత వాటిని కొన్నింటిని తీసేయడం అవసరం. ఇది ప్రతి ఐదేళ్ళ కొకసారి సాగాలి. డేటా సిరీస్‌లు అన్నింటి విషయంలోను ఇది జర గాలి. వాటిమధ్య సమన్వయాన్ని సాధించడం అప్పుడే సాధ్యమవు తుంది. ప్రపంచం మారుతున్నట్లుగానే, ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులు కూడా మారుతూ ఉంటాయి. బోలెడంత డేటాను సమీకరించుకునేందుకు డిజిటలీకరణ తోడ్పడుతోంది. ఆ డేటాను ఈ ప్రక్రియలో వినియోగించుకోవాలి. 

దేశంలో డిజిటల్‌ ప్రక్రియలు సమగ్రమైనవిగా తయారవు తున్నాయి. మొత్తం డేటానంతటినీ అనుసంధానపరచే అవకాశం చిక్కుతోంది. దీనివల్ల అంచనా విలువపై ఆధారపడటం తగ్గించుకోవచ్చు. జీడీపీ, వినియోగదారుల ధరల సూచి సిరీస్‌ను పున ర్వ్యవస్థీకరించడం వల్ల సాధించిన పెద్ద విజయం బహుశా ఇదే అవుతుంది. రానున్న రోజుల్లో పారిశ్రామిక ఉత్పత్తి సూచి, టోకు ధరల సూచి సిరీస్‌ల వల్ల కూడా పరిస్థితి మరింత తేటతెల్లం కావచ్చు. డిజిటలీకరణకు నిరంతరం ఇస్తున్న ప్రాధాన్యం వల్ల దేశంలో డేటా సిస్టంలను పటిష్టపరచడం కుదిరింది. ఆర్థిక వ్యవస్థ పనితీరుకు సంబంధించి మెరుగైన సంకేతాలు అందుకోగలుగు తున్నాం. విధానపరంగా కూడా మెరుగైన స్పందనలకు ఇది సహాయపడాలి. 

మదన్‌ సబ్నవీస్‌
వ్యాసకర్త బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా చీఫ్‌ ఎకనామిస్ట్, ‘కార్పొరేట్‌ క్విర్క్స్‌: ద డార్కర్‌ సైడ్‌ ఆఫ్‌ ద సన్‌’ పుస్తక రచయిత
(‘ద ఫ్రీ ప్రెస్‌ జర్నల్‌ సౌజన్యంతో) 

Advertisement
 
Advertisement
Advertisement