‘గ్రిడ్‌’తో రాజధాని అంతటా ఐటీ గుబాళింపు | Sakshi
Sakshi News home page

‘గ్రిడ్‌’తో రాజధాని అంతటా ఐటీ గుబాళింపు

Published Sat, Feb 26 2022 1:28 AM

N Yadagiri Rao Articles On TS Focused On GRID Policy For Over All Development - Sakshi

దేశానికి ఐటీ హబ్‌గా ఎదు గుతూ ప్రపంచస్థాయి సంస్థల గమ్యస్థానంగా మారుతోంది హైదరాబాద్‌ నగరం. ఈ నేప థ్యంలో నగరం నలుదిశలా అభివృద్ధి చెందేందుకు ‘గ్రోత్‌ ఇన్‌ డిస్పర్షన్‌ ’(గ్రిడ్‌) పాలసీకి శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం. 

హైదరాబాద్‌ నగరంలో ఐటీ రంగం మాదా పూర్, గచ్చిబౌలి, కొండాపూర్, నానక్‌రాం గూడ వంటి పశ్చిమ ప్రాంతాల్లోనే 90 శాతానికి పైగా నెల కొని ఉంది. ఫలితంగా ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌ తూర్పు, ఉత్తర, దక్షిణ ప్రాంతాలను కూడా ఇలాగే అభివృద్ధి చేయడం కోసం ఐటీ, ఐటీ అనుబంధ సంస్థలను స్థాపించాలనే లక్ష్యంతో ప్రభుత్వం గ్రిడ్‌ పాలసీకి రూపకల్పన చేసింది. 

హైదరాబాద్‌ ఒకప్పుడు పరిశ్రమలకు కేంద్రంగా ఉండేది. అయితే, కాలక్రమంలో వీటిలో కొన్ని మూత బడ్డాయి. ఇలా మూతబడిన పరిశ్రమలు ఉన్న స్థలా లన్నీ గత కొన్నేళ్లుగా నిరుపయోగంగా మారాయి. ఈ స్థలాల్లో ఐటీ సంస్థల్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే కాలుష్యకారక పరిశ్రమలను నగరానికి దూరంగా ఔటర్‌ రింగ్‌ రోడ్డు బయట ఏర్పాటు చేయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుం టోంది. నగరం బయటకు వెళ్లిన పరిశ్రమల స్థానం లోనూ ఐటీ సంస్థల ఏర్పాటుకు ప్రయత్నిస్తోంది.

నగరంలోని 11 పారిశ్రామికవాడలను ఐటీ పార్కులుగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టు కుంది. ఉప్పల్, నాచారం, మల్లాపూర్, మౌలాలి, కాటేదాన్, పటాన్‌చెరు, రామచంద్రాపురం, సనత్‌ నగర్, బాలానగర్, గాంధీనగర్, కూకట్‌పల్లి పారిశ్రా మిక ప్రాంతాలను క్రమంగా ఐటీ పార్కులుగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. గ్రిడ్‌లో భాగంగా ఏర్పాటయ్యే సంస్థలకు ప్రోత్సాహకంగా విద్యుత్‌ పైన సబ్సిడీగా యూనిట్‌ ఇన్సెంటివ్స్‌ ఇస్తోంది. 500 కంటే ఎక్కువ మందికి ఉపాధి కల్పించే యూనిట్లను యాంకర్‌ యూనిట్‌లుగా పరిగణించి యాంకర్‌ ఇన్సెంటివ్‌లను అందిస్తోంది. 50 శాతం భూమిని ఐటీ, ఐటీ అనుబంధ సంస్థల ఏర్పాటుకు, మిగతా 50 శాతం భూమిని నివాస, వాణిజ్య అవసరా లకు వినియోగించుకునే వెసులుబాటు కల్పిస్తోంది. 

హైదరాబాద్‌ తూర్పు వైపున ఐటీ, ఐటీ అను బంధ రంగాల అభివృద్ధికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని గుర్తించిన ప్రభుత్వం లుక్‌ ఈస్ట్‌ పాలసీతో ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టిపెట్టింది. ఉప్పల్, పోచారం ప్రాంతాల్లో ఇప్పటికే పలు సంస్థలు ఉండగా ఇప్పుడు ప్రభుత్వ ప్రోత్సాహంతో మరిన్ని సంస్థలు ఏర్పాటవుతున్నాయి. ఉప్పల్‌ కేంద్రంగా నగరానికి తూర్పు వైపున ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఉప్పల్‌కు మెట్రో కనెక్టివిటీ ఉంది. కొత్తగా భారీ స్కైవే నిర్మాణం జరుగుతోంది. అధునాతన స్కైవాక్‌ను ప్రభుత్వం నిర్మిస్తోంది. ప్రభుత్వ కృషితో సమీప భవిష్యత్తులోనే ఉప్పల్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల రూపు రేఖలు మారనున్నాయి. 
అలాగే హైదరాబాద్‌ ఉత్తరం వైపున ఉన్న కొంపల్లి, బహదూర్‌పల్లి, పటాన్‌చెరు, బౌరంపేట, కండ్లకోయ ప్రాంతాల్లో కూడా ఐటీ సంస్థల ఏర్పా టుకు అనువైన పరిస్థితులను కల్పిస్తోంది ప్రభుత్వం. కండ్లకోయలో 10.11 ఎకరాల విస్తీర్ణంలో గేట్‌వే ఐటీ పార్క్‌ పేరుతో రెండు భారీ ఐటీ టవర్‌ల నిర్మాణం జరగనుంది. ఇటీవలే మంత్రి కేటీఆర్‌ దీనికి శంకు స్థాపన చేశారు. ఇక్కడ 10 వేల మంది యువతకు ఐటీ, దాని అనుబంధ రంగాల్లో ఉపాధి లభించ నుంది. ఇదే విధంగా హైదరాబాద్‌ దక్షిణ వైపున ఆదిభట్ల, శంషాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దీంతో నగరం నలువైపులా ఐటీ వెలుగులు విరజిమ్మనున్నాయి. 

వ్యాసకర్త: ఎన్‌. యాదగిరిరావు 
జీహెచ్‌ఎమ్‌సీ అదనపు కమిషనర్‌
మొబైల్‌: 97044 05335

Advertisement
 
Advertisement
 
Advertisement