అభివృద్ధి పేరుతో భూ వ్యాపారమా?

Kakatiya Urban Development Authority Secretly Surveying Farmers Lands in Warangal - Sakshi

‘కాకతీయ అర్బన్‌ డెవలప్‌ మెంట్‌ అథారిటీ’ (కుడా) వరంగల్‌ నగర శివారును ఆనుకొని ఉన్న గ్రామాల్లోని రైతుల భూముల్లో గత మూడేళ్ల నుంచీ రహస్య సర్వే చేస్తోంది. మొదట్లోనే స్థానిక రైతాంగం ‘మా భూముల్లో మా అనుమతి లేకుండా సర్వే చేయడం ఏమిటి?’ అని అడ్డుకున్నారు. అడ్డుకున్న రైతులపై పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. ‘కుడా’ ప్రయత్నాలను ఆదిలోనే రైతులు అడ్డుకోవ డంతో ఒక అడుగు వెనక్కి వేసి సర్వేను ఆపుతున్నాం అని అధికారులు ప్రకటించారు.

వరంగల్‌ చుట్టూరా అవుటర్‌ రింగురోడ్డును ఆనుకొని పచ్చని పంట భూములు ఉన్నాయి. అక్కడి నుంచే కొత్తిమీర, పుదీనా, వంకాయ ఇతర  కూర గాయలు ఉదయం 3 గంటలకే వరంగల్‌ మార్కెట్‌కు చేరుకుంటాయి. హన్మకొండ, వరంగల్‌ సిటీ ప్రజలకు 90 శాతం కూరగాయలు సిటీ శివారు గ్రామాల రైతులు తీసుకొచ్చేటివే. కూరగాయలు, మార్కెట్‌ వ్యాపారంపై చిన్న, సన్నకారు పేద రైతులు వేలాదిగా ఆధారపడి ఉన్నారు.

‘కుడా’ అవుటర్‌ రింగ్‌రోడ్డును ఆనుకొని ఉన్న 27 గ్రామాల్లో ల్యాండ్‌ పూలింగ్‌ కోసం 21,510 ఎకరాల భూమిని సేకరించాలని సర్వే  చేసింది. ఆ తర్వాత సర్వే నంబర్లతో సహా జీవో నం. 80(ఎ) విడుదలయింది. 27 గ్రామాల్లో 2 గ్రామాల రైతుల అభిప్రాయ సేకరణ జరగలేదు. ముందుగా అసైన్డ్‌ భూముల సర్వే చేశారు. ఇవి పడావ్‌ భూములు కావు. దశాబ్దాల కాలం నుండి రైతుల వద్ద సాగులో ఉన్న భూములే. తర్వాత రైతుల పట్టా భూముల్లో సర్వే చేశారు. మొత్తంగా తమ ప్రాజెక్ట్‌కు కావాల్సిన భూమి మొత్తాన్ని సేకరించారు.

27 గ్రామాల్లోని 21,510 ఎకరాల భూమిని ప్లాట్లుగా విభజించి వ్యాపారం చేయబోతున్నారు. అందులో నుండి భూమి ఇచ్చిన రైతుకు 1200–1400 గజాల భూమిని ప్లాట్ల రూపంలో ఇస్తారు. వ్యవ సాయ భూమి ప్లాట్ల రూపంలోకి మారడం వల్ల... భూమి రేటు రెట్టింపు అవుతుంది. కాబట్టి మొత్తం 1400 గజాల్లో రైతుకు లాభం కోట్లల్లో వస్తుందని అధికారులు లెక్కలు చెబుతున్నారు. అంటే వేలాది ఎకరాల పంట భూముల్ని భారీగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయడానికి ప్రభుత్వం పూనుకున్నదన్న మాట! మొన్న వరంగల్, పరకాల మీటింగ్‌లలో మంత్రి కేటీఆర్‌ ఇదే విషయాన్ని ప్రకటించారు. రైతుల భూమిని రైతుల అనుమతి లేకుండా గుంజు కొని ప్రభుత్వమే రియల్‌ భూవ్యాపారం అధికారి కంగా చేస్తుందనేది ఇందువల్ల రూఢి అయింది.

ల్యాండ్‌ పూలింగ్‌పై ప్రజలు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ముందుగా ఈ సందేహాలను తీర్చే బాధ్యత ప్రభుత్వానిదే. ల్యాండ్‌ పూలింగ్‌కు భూమి ఇచ్చిన రైతు భవిష్యత్‌ ఏమిటి? భూమిపై ఆధారపడి పంటలు పండిస్తూ బ్రతికే రైతును ప్రభుత్వమే భూమి లేని వాడిగా చేస్తోంది. కూలీగా మార్చివేస్తోంది. 21,510 ఎకరాలను ప్లాట్లుగా మార్చి పెద్ద ఎత్తున ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసి... వచ్చిన ఆదాయంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనేది ప్రభుత్వ ఉద్దేశం అని స్పష్టమయింది. (క్లిక్‌: వారికో న్యాయం.. ఊరికో న్యాయం)

భూ వ్యాపారమే లక్ష్యంగా పెట్టుకొని వరంగల్‌ నగర అభివృద్ధి అంటే ఎలా? వరంగల్‌ చుట్టూ ఎత్తయిన భవనాల నిర్మాణం జరిగేతేనే అభివృద్ధా? ఇందులో బడా కార్పొరేట్‌ సంస్థల ప్రయోజనం దాగి ఉంది. స్థానిక అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ల్యాండ్‌ పూలింగ్‌ వేగవంతం అవుతోంది. రైతుల ఆందోళనల ఫలితంగా ‘కుడా’ చైర్మన్‌ ల్యాండ్‌ పూలింగ్‌ను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనలో కూడా స్పష్టత లేదు. ల్యాండ్‌ పూలింగ్‌ కోసం తెచ్చిన జీఓను వెంటనే రద్దు చేయాలి. రైతాంగానికి ప్రజలందరూ అండగా నిలబడాలి. (క్లిక్‌: భూ రికార్డుల ప్రక్షాళన ఎప్పుడు?)


- ఎల్‌. రాజు 
సీపీఐ (ఎంఎల్‌) ప్రజాపంథా జిల్లా కార్యదర్శి, వరంగల్‌

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top