Heat Wave: మండే ఎండలు తగ్గాలంటే... మైండ్‌సెట్‌ మారాలి!

How To Control Heat Wave, High Temperature - Sakshi

రోహిణి కార్తెలో రోళ్లు బద్దల వుతాయి అనేవాళ్లు. కానీ గడచిన కొన్ని సంవత్సరాలుగా ఆ సమయం రాగానే ఓ తుపాను, అడపాదడపా వర్షాలు వచ్చి ఎండలు మరీ మండకుండానే వేసవి ముగుస్తున్నది. అలాగని అంతటా అదే పరిస్థితి మాత్రం లేదు. ఉత్తరంగా పోయినకొద్దీ ఎండల తాకిడి మరీ దుర్భరంగా ఉంటున్నది. ఈసారి మే మొదటి వారం ముగియక ముందే దేశంలో హీట్‌ వేవ్‌ మొదలయింది అన్నారు. మార్చ్‌–ఏప్రిల్‌ మాసాలలో కూడా మామూలు కన్నా ఎక్కువ వేడిమి సాగింది. ఉత్తర భారతంలో 46 డిగ్రీలు సెల్సియస్‌ మామూలయింది. ఇక పాకిస్తాన్‌లో 49 డిగ్రీల వేడి కనిపిస్తోంది.

‘వర్షాలకు ముందు ఇటువంటి ఎండలు కొత్తేమీ కాదు. అయితే ఈసారి తీవ్రత... అనుకున్న సమయానికి ముందే మొదలయింది. వ్యవసాయం జరుగుతున్నది. బడులు, కాలేజీలకు సెలవులు ఇవ్వలేదు. ఇక ఎక్కువమంది ఎండకు గురవుతున్నారంటే ఆశ్చర్యం లేద’ంటున్నారు ప్రపంచ వనరుల సంస్థలో వాతావరణ కార్యక్రమం డైరెక్టర్‌ ఉల్కా కేల్కర్‌. రుతుపవనాలు కూడా ఈసారి త్వరగా వస్తాయంటున్నారు మరోవైపున.

ప్రతి సంవత్సరం ఉత్తర భారతదేశంలో, మన దగ్గర కొన్ని ప్రాంతాలలో 40 డిగ్రీలు దాటిన వేడిమి మామూలుగా అలవాటయింది. అంతటి వేడికి మానవ శరీరం తట్టుకోజాలదు. కండరాల సమస్యలు మొదలవుతాయి. అలసట, తల తిప్పటం, చివరికి గుండెపోట్లు కూడా రావచ్చు. హాయిగా ఎయిర్‌ కండిషనర్‌లు, కూలర్‌ల ముందు బతికే వారికి పరిస్థితి అర్థం కాదు. బతుకుతెరువు పేరున ఎండనబడి పనిచేసే కష్టజీవుల స్థితి అధ్వాన్నం అవుతుంది. అయినా వాళ్లు అలవాటుగా పనిచేస్తూనే ఉండటం ఆశ్చర్యం.

వాతావరణం రానురానూ మారుతున్నది అన్న సంగతి అందరికీ అర్థమయింది. రానురానూ మరింత వేడి పెరుగుతుంది. అందరూ ఒంటినిండా కప్పుకుని అరబ్‌ దేశాల వారివలె తిరిగే పరిస్థితి వస్తుంది. ఎండ తాకిడికి గురవుతున్న వారి సంఖ్య దేశంలో ఇప్పటికే బిలియన్‌ను దాటిందని పరిశోధకులు చెబుతున్నారు. ఎండ కారణంగా పంటలు, ముఖ్యంగా గోధుమ పంట దెబ్బతింటుంది అంటున్నారు. ముంబయి వంటి చోట్ల పరిస్థితి మరింత విచిత్రంగా ఉంది. అక్కడ గాలిలో తేమ మరీ ఎక్కువ. వేడిమి 32 డిగ్రీలే ఉన్నప్పటికీ 38 దాటినట్లు ఉడికిపోతుంది. దానివల్ల అలసట, అనారోగ్యం ఎక్కువవుతాయి అంటారు ఐఐటీ పరిశోధకురాలు అర్పితా మొండల్‌. 

మొత్తానికి దేశంలో ఎండలు మండే దినాల సంఖ్య పెరుగుతున్నది. 2011 నుంచి 2020 మధ్యన ఇటువంటి దినాలు 600 అని లెక్క తేలింది. 1981–1990లలో ఆ సంఖ్య కేవలం 413 మాత్రమే.

మార్చి నుంచి జూన్‌ మధ్యన ఇటువంటి వేడి రోజులు ఎదురవుతాయి. కానీ మారుతున్న పరిస్థితులలో వాటి తీవ్రత పెరుగుతున్నది అంటారు ఎన్‌ఆర్‌డీసీ నిపుణురాలు కిమ్‌ నోల్‌టన్‌. భవన నిర్మాణం, వ్యవసాయం, మరిన్ని రకాల రంగాల మీద ఈ ప్రభావం తీవ్రంగా పడింది.  

ఎండలు పెరుగుతున్నందుకు ఇప్పుడు ఏదో చేయడం అర్థం లేని పని. మొత్తం దక్షిణాసియాలోనే దీర్ఘకాలిక పథకాలు అమలు చేయాలి. ముందుగా ప్రజలకు ఈ విషయంపై అవగాహన కలుగజేయాలి. ఎండ తీరును ముందే అంచనాలు వేసే పద్ధతులు అమలులోకి రావాలి. అందరికీ ఆరోగ్య రక్షణ, కాస్తంత నీడ, తాగునీరు అందాలి. పల్లె ప్రాంతాలలో పశువుల విషయంగా తగు జాగ్రత్తలు తీసుకొని ఏర్పాట్లు ముందే చేయాలి అంటారు ఉల్కా కేల్కర్‌. (చదవండి: విపత్తులు సరే... నివారణ ఎలా?)

నగరాల పెరుగుదల తీరును గట్టిగా పట్టించు కోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జలాశయాలు తరిగిపోవడం, నిర్మాణాల పేరున అడవుల వినాశనం తీవ్రమైన పరిస్థితులకు దారితీస్తాయి. ఏసీల పేరున విద్యుత్తు డిమాండ్‌ పెరగడం మరొక సమస్య. ప్రత్యామ్నాయ ఇంధనాల వాడకం వేపు చూపు మరలించాలి. అంతా కలసి పెద్ద ఎత్తున ప్రణాళికలు వేయడంతో ఏదీ జరగదు. ‘నా పని నేను చేసుకుంటాను, నా బతుకు నేను బతుకుతాను’ అనే మనస్తత్వం మారాలి. అందరి కోసం ఆలోచించే తీరు రావాలి. (చదవండి: ఇప్పటికీ నేర్వని ఆహార పాఠాలు)


- కె.బి. గోపాలం 
రచయిత, అనువాదకుడు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top