Agnipath: బంధాలను తెంచుతున్న అగ్నిపథ్‌

Former Major General of Indian Army Ashok K Mehta About Agnipath - Sakshi

విశ్లేషణ

‘చావుకు భయపడటం లేదని ఏ సైనికుడు అయినా అన్నాడంటే, అతడు అబద్ధమాడుతూ ఉండాలి, లేదా గోర్ఖా అయి ఉండాలి’ అని ఫీల్డ్‌ మార్షల్‌ శామ్‌ మానెక్‌షా చెప్పేవారు. పిరికివాడిగా ఉండటం కంటే చావడం మేలనేది వీరి ఆదర్శం. స్వాతంత్య్ర కాలం నుంచీ వీరు భారత సైన్యంలో విడదీయలేని శక్తిగా ఉంటున్నారు. సాహసానికి పేరొందిన నేపాలీ గోర్ఖాలకు ఇప్పటికీ తొలి ప్రాధాన్యం సైన్యంలో చేరడమే. వీరంతా నేపాల్‌లో బలమైన భారత్‌ అనుకూల బృందంగా ఉంటున్నారు. 1947లో భారత్, బ్రిటన్, నేపాల్‌ మధ్య కుదిరిన త్రైపాక్షిక ఒప్పందానికి తీవ్ర ప్రభావం కలిగిస్తూ, గోర్ఖా యువత ఆకాంక్షలను దెబ్బ తీయబోతున్న అగ్నిపథ్‌ పథకం గురించి నేపాల్‌ను భారత్‌ సంప్రదించలేదు.

గోర్ఖా జానీ, గోర్ఖా సాథీ, లహురే... పేరు ఏదైనా కావొచ్చు; కీర్తి, సంపద ఆర్జించడం కోసం వీరు మహారాజా రంజిత్‌ సింగ్‌ సైన్యంలో చేరడానికి అప్పట్లో లాహోర్‌ వరకు వెళ్లారు. వీరిని నేపాలీ అమ్మాయిలు ఏరికోరి పెళ్లాడేవారు. ఇప్పటికీ చేసుకుంటున్నారు. ‘గోర్ఖాలు మీతో యుద్ధానికి దిగారు’ అనేది వీరి సమర నినాదం. పిరికివాడిగా ఉండటం కంటే చావడం మేలనేది వీరి ఆదర్శం. అలా వీరి పేర్లలో బహదూర్‌ (సాహసి), జంగ్‌ (సమరం) అనేవి వచ్చి కలిసేవి.

ఫీల్డ్‌ మార్షల్‌ శామ్‌ మానెక్‌షాకు ‘శామ్‌ బహదూర్‌’ అని గుర్తింపు ఉండటం తెలిసిందే. తాను చావుకు భయపడటం లేదని ఏ సైనికుడు అయినా మీతో అన్నాడంటే, అతడు అబద్ధమాడుతూ ఉండాలి, లేదా గోర్ఖా అయివుండాలి అని మానెక్‌షా చెప్పేవారు. ఇండియన్‌ మిలిటరీ అకాడెమీలో నన్ను ఇష్టమైన మూడు ఆయుధాలు ఎంచుకొమ్మ న్నప్పుడు... నేను గోర్ఖాలు, గోర్ఖాలు, గోర్ఖాలు అని చెప్పేవాడిని. ఇప్పుడు చరిత్రలో మొదటిసారిగా వారిని అగ్నిపథ్‌ గోర్ఖాలు అని పిలవనున్నారు. ఈ బిరుదు, లేదా గుర్తింపు వారికి ఏమాత్రం సరిపోనిది అనే చెప్పాలి.

‘కిరాయి’ సైనికులు కాదు
దేశ విభజనకు ముందు భారతీయ అధికార్లను గోర్ఖాల్లో చేరడానికి బ్రిటిష్‌ అధికార్లు అనుమతించేవారు కాదు. 1947 తర్వాత అంటే గోర్ఖా ట్రూప్‌ కమాండ్‌ను భారతీయ అధికారులు ప్రారంభించిన తర్వాతే బ్రిటిష్, ఇండియన్‌ ఆర్మీల మధ్య గోర్ఖా రెజిమెంట్లను విభజించారు. 1947లో కుదిరిన త్రైపాక్షిక రిక్రూట్‌మెంట్‌ ఒప్పందం... బ్రిటిష్, ఇండియన్, నేపాలీ సైన్యాల్లో నేపాలీ గోర్ఖాలను చేరడానికి అనుమతించింది. అయితే వేతనాలు, పెన్షన్లలో తేడాలు ఉండేవి. గోర్ఖాలను కిరాయి సైనికులు అని పిలవవద్దని నేపాల్‌ షరతు పెట్టడమే ఈ ఒప్పందంలోని చివరి అంశం. నేపాలీ గోర్ఖాలు ఇప్పుడు ఫ్రెంచ్‌ ఆర్మీలో చేరుతున్నారు. అనేకమంది రిటైరయిన గోర్ఖాలు ప్రైవేట్‌ కాంట్రాక్టర్లుగా చేరుతున్నారు.

సారాంశంలో, మాతృ బెటాలియన్లతో సాంప్రదాయ వారసత్వ బంధం కారణంగా గోర్ఖాలు ఇప్పటికీ భారతీయ రెజిమెంట్లలో చేరుతున్నారు. మన సైన్యంలోని 1,3,4,5,8 సంఖ్యలు గల గోర్ఖా రెజిమెంట్లు ప్రధానంగా మాగర్లు, గురుంగులతోనూ; 9వ గోర్ఖా రెజిమెంట్‌ ఛెత్రీలు, ఠాకూర్లతోనూ; 11వ గోర్ఖా రెజిమెంట్‌ రాయిలు, లింబూలతోనూ ఉంటున్నాయి. వీళ్లందరూ భారతీయ సైన్యంలో భాగంగా ఉంటున్నారు. దివంగత భారత చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ 11వ గోర్ఖా రైఫిల్స్‌కి చెందిన 5వ బెటాలియన్‌కి నాయకత్వం వహించేవారు. బ్రిటిష్‌ ఆర్మీ నాయకత్వం 1947 తర్వాత 2, 6, 7, 10 రెజిమెంట్లను తమతో తీసుకుపోయింది. వాటిని ఇప్పుడు కేవలం రెండు బెటాలియన్లుగా కుదించారు.

గోర్ఖా రెజిమెంట్లలోకి నియామకాలను ప్రారంభంలో భారత్‌–నేపాల్‌ సరిహద్దులోని భైర్‌హవా సమీపంలోని నౌతన్వాలో జరిగేవి. తర్వాత కుంరాఘాట్, గోరఖ్‌పూర్, డార్జిలింగ్‌ సమీపంలోని ఘూమ్‌ ప్రాంతాలను శాశ్వత ప్రాంతాలుగా ఎంపిక చేశారు. ఈ రిక్రూట్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్లకు యువ గోర్ఖాలను తీసుకురావడానికి గల్లా వాలాస్‌ అని పిలిచే నేపాలీ రిక్రూటర్లను ఉపయోగించుకునే వారు. భారతీయ సైన్యంలో భర్తీ కావడం కోసం వీరు 20 నుంచి 24 రోజులపాటు ట్రెక్కింగ్‌ చేసి వచ్చేవారు. శారీరక, వైద్య పరీక్షలు అనంతరం ఎంపికైన∙వారిని రెజిమెంటల్‌ శిక్షణా కేంద్రాలకు పంపించేవారు.

వ్యూహాత్మక సంపద
తర్వాతి కాలంలో భారతీయ సైన్య నియామక బృందాలు నేపాల్‌ మారుమూల ప్రాంతాలకు వెళ్లి రాటుదేలిన యువత కోసం ప్రయత్నించడంతో సైనిక రిక్రూట్‌మెంట్‌ వ్యవస్థ మారిపోయింది. నేపాల్‌ పశ్చిమ, తూర్పు ప్రాంతాల్లోని పోఖ్రా, ధరాన్‌ తదితర చోట్ల రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలను నిర్వహించేవారు. నియామక వ్యవస్థ పూర్తి పారదర్శకంగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు దానికి రాత పరీక్షను కూడా చేర్చారు. మొదట్లో నేపాల్‌ నుంచే 100 శాతం చేర్చుకునేవారు. తర్వాత దీన్ని కాస్త మార్చి, నేపాల్‌ దేశస్థులైన గోర్ఖాల నుంచి 70 శాతం, భారతీయ గోర్ఖాల నుంచి 30 శాతం రిక్రూట్‌ చేస్తూ వచ్చారు. కోవిడ్‌ మహమ్మారి రిక్రూట్‌మెంట్‌ను అడ్డుకున్నప్పుడు రిక్రూట్‌మెంట్‌ విభాగాలు 60:40 నిష్పత్తిలో చేర్చుకున్నాయి. 2018లో 6/1 గోర్ఖా రైఫిల్స్‌ని పూర్తిగా భారతీయ గోర్ఖాల నుంచే తీసుకున్నారు. సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో నేపాల్‌కు రాజకీయ సందేశాన్ని ఇవ్వడమే దీని ఉద్దేశం.

నేపాల్‌లోని కమ్యూనిస్టులు కూడా 1990లో పాలక పక్షానికి విధించిన తమ 40 పాయింట్ల డిమాండ్లలో ఒకటి, భారత సైన్యంలో నేపాలీల చేరికను ఆపడం. కానీ సైనికుడు కావాలన్న కోరిక గోర్ఖాల్లో ఇప్పటికీ అలాగే ఉంది. 1970లలో భారత సైన్యం నుంచి గోర్ఖాలను తొలగించాలంటూ వచ్చిన సంకుచిత ప్రతిపాదనను భారత్‌ తోసి పుచ్చింది. నాటి ఆర్మీ చీఫ్‌ జనరల్‌ గోపాల్‌ బెవూర్‌ నాటి ప్రధాని ఇందిరాగాంధీకి గోర్ఖాలు మనకు వ్యూహాత్మక సంపద అని నొక్కి చెప్పారు.

భారత అనుకూల బృందం
రెజిమెంటల్‌ వ్యవస్థను కొనసాగిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. అయితే అగ్నిపథ్‌ పథకం నేపాలీ గోర్ఖాలకు కూడా వర్తిస్తుంది. భారతీయ సైన్యంలో 38 ఇన్‌ఫాంట్రీ బెటాలియన్లు, రెండు రాష్ట్రీయ రైఫిల్స్‌ బెటాలియన్లు, రెండు టెరిటోరియల్‌ ఆర్మీ బెటాలియన్లు, ఆర్టిల్లరీకి చెందిన 64 ఫీల్డ్‌ రెజిమెంట్లు మొత్తం గోర్ఖాలతో కూడి ఉన్నాయి. అందుకే భారత గోర్ఖా బ్రిగేడ్‌ అతిపెద్ద రెజిమెంట్‌గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం భారతీయ సైన్యంలో పనిచేస్తున్న, రిటైర్‌ అయిన గోర్ఖాలు 17 లక్షల మంది ఉన్నారని అంచనా. వీరంతా నేపాల్‌లో బలమైన భారత్‌ అనుకూల బృందంగా ఉంటున్నారు. చైనా ప్రభావంలో ఉన్న నేపాల్‌తో ప్రత్యేక సంబంధాలు కొనసాగించడానికి, ఆ దేశంతో పూర్వ ప్రాధాన్యతా స్థానం పొందడానికి ఈ బృందం చాలా అవసరం. మాజీ సైనికులు నేపాల్‌ వ్యాప్తంగా ఇండియన్‌ రెజిమెంటల్‌ అసోసియేషన్లను ఏర్పర్చుకున్నారు. బెటాలియన్లలో తాము ఎదిగిన రోజులను తల్చుకుంటూ, యుద్ధ గౌరవాలను అందుకుంటూ ఇండియా సైనికులతో వీరు పరస్పర సంబంధాలు కొనసాగిస్తున్నారు.  

సైన్యంలో తాత్కాలిక నియామకాలకు సంబంధించి భారత ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్‌ పథకంపై నేపాల్‌ ఇంతవరకూ అధికారికంగా స్పందించలేదు. 1947లో త్రైపాక్షిక ఒప్పందంపై తీవ్ర ప్రభావం కలిగిస్తూ, గోర్ఖా యువత ఆకాంక్షలను దెబ్బ తీయబోతున్న అగ్నిపథ్‌ పథకం గురించి నేపాల్‌ను భారత్‌ సంప్రదించలేదు. అగ్నిపథ్‌ ఒక పెద్ద అసంతృప్తి పథకంగా కనబడుతోంది. నాలుగేళ్లపాటు నియంత్రణ రేఖ, వాస్తవాధీన రేఖల వద్ద ప్రాణాలు పణంగా పెట్టి సైన్యంలో పనిచేయటం కంటే, ఏ దుబాయ్‌లోనో మరింతగా సంపాదించగలరు. మొత్తం మీద చూస్తే, ఏదో ఒకరోజున గోర్ఖా వారసత్వానికి ముగింపు పలకాలని బీజేపీ ప్రభుత్వం చూస్తోంది. 2014లో నేపాల్‌ని తొలిసారిగా సందర్శించినప్పుడు గోర్ఖా సైనికుల త్యాగాలను ఎత్తిపడుతూ తానాడిన మాటల్ని ప్రధాని నరేంద్రమోదీ అప్పుడే మర్చిపోయినట్లు కనబడుతోంది. భారత్‌తో గోర్ఖా బంధాన్ని అగ్నిఫథ్‌ బలహీనపరుస్తుంది.


అశోక్‌ కె. మెహతా  
వ్యాసకర్త ఆర్మీ మేజర్‌ జనరల్‌ (రిటైర్డ్‌)
(‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top