ఇది రాజ్యాంగ విరుద్ధం

AP Election Commission Guest Column By Justice DSR Varma - Sakshi

సందర్భం

పస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు కొన్ని ప్రత్యేక పరిస్థితులను చవిచూస్తున్నారు. కిందటేడాది మార్చిలో ప్రభుత్వం స్థానిక ఎన్నికలు జరపాలని ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను కోరడమూ, కరోనా మహమ్మారి తీవ్రరూపంలో ఉన్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఎన్నికలను నిర్వహించలేమని వారు చెప్పడమూ తెలిసిందే. అయినా ప్రభుత్వం స్థానిక ఎన్నికలు జరపాలన్న ఉద్దేశంతో హైకోర్టుకూ, ఆ పై సుప్రీంకోర్టుకూ వెళ్లింది. సుప్రీంకోర్టు ఇరువురినీ కలిసి కూర్చుని మాట్లాడుకుని ఎన్నికలు ఎప్పుడు జరపాలన్న విషయం మీద ఒక అవగాహనకు రావాలని చెప్పింది. దానర్థం, రాజ్యాంగం ప్రకారం ‘ఇన్‌–కన్సల్టేషన్‌ విత్‌’ అన్న సూత్రానికి కట్టు బడి ఉండాల్సిందిగా ఎన్నికల కమిషన్‌నూ, రాష్ట్ర ప్రభుత్వాన్నీ ఆదేశించడం జరిగింది.

ప్రజాస్వామికంగా ఎన్నిక అయిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఐదేళ్లకు ఒకసారి స్థానిక ఎన్నికలు జరపాలన్న ప్రిన్సిపుల్‌ని అమలు జరపాలని భావించినప్పుడు, ఆ ప్రక్రియ కొనసాగించ వలసింది ఎన్నికల కమిషన్‌ కాబట్టి కమిషన్‌ను కోరింది. కానీ కమిషన్‌ ప్రభుత్వంతో ఎలాంటి చర్చ జరపకుండానే రాజ్యాంగ సూత్రానికి విరుద్ధంగా ఏకపక్ష నిర్ణయం తీసుకుంది. కాకపోతే ఆ తర్వాతి పరిణామాలు కీలకమైన మలుపులు తీసుకున్నాయి.

కోవిడ్‌ తీవ్రత పెరిగిన కార ణంగా, ప్రజలకు మరింత హాని పొంచివుందని ప్రపంచ దేశాల భయాందోళన అందులో ఒకటి. దీని నివారణకు టీకా కనిపెట్ట డంలో వివిధ దేశాలు పురోగతి సాధించడం రెండవది. అందులో భారతదేశం కూడా ఒకటి. మన దేశంలో తయారైన వ్యాక్సిన్‌ను ప్రజలకు అందుబాటులోకి తేవడానికి కేంద్ర ప్రభుత్వం డిసెంబర్‌ 4, 2020 నాడు ఒక సర్క్యులర్‌ జారీ చేసింది. అన్ని వర్గాల ప్రజలకు, ఇంతకుముందు కోవిడ్‌ బారిన పడి కోలుకున్నవారితో సహా టీకా అందించడానికి వీలుగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాల అధికార యంత్రాంగం సమా యత్తంగా ఉండాలని చెప్పింది.

అదే కేంద్ర ప్రభుత్వం 2019లో ఉన్నటువంటి ఓటర్లను కూడా పరిగణనలోకి తీసుకుని కొత్త ఓటర్ల జాబితా ప్రత్యేకించి స్థానిక ఎన్నికల కోసం రూపొందిం చమని కూడా చెప్పింది. ఆ ప్రక్రియ మొదలై ఎంతో కాలం కాలేదు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ స్థానిక ఎన్నికలను నాలుగు విడతలుగా ఫిబ్రవరి నెలలో జరుపుతానని ప్రకటించారు. దానికి చీఫ్‌ సెక్రటరీ ప్రభుత్వ అభ్యంతరాలను కమిషనర్‌కు నివేదించారు. అయినా అదేరోజు, అంటే కొద్ది గంటల తర్వాతే కమిషనర్‌ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించారు.

విచిత్రమైన అంశం ఏమిటంటే, ఇదే కమిషనర్‌ నవంబర్‌ 17, 2020 నాడు 2019 నాటికి ఉన్న ఓటర్ల జాబితాను 2020 నాటికి సవరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఇది సామా న్యమైన ప్రక్రియ కాదు. మొత్తం ప్రభుత్వ యంత్రాంగం– ఉపా ధ్యాయులు, కింది తరగతి ఉద్యోగులు తమ అసలు విధులను మానుకుని ఇది చేపట్టాలి. ఈ పని ఇంకా పూర్తిగా జరగలేదు. కరోనా సెకండ్‌ వేవ్‌ ఒక కారణం. అటు ప్రజలు, ఇటు ప్రభుత్వో ద్యోగులు ఒకరికొకరు సహకారం అందించుకోలేని గందరగోళం. ఇలాంటి పరిస్థితుల్లో కోర్టు ఉత్తర్వుల ప్రకారం (ఇన్‌–కన్సల్టేషన్‌ విత్‌) ప్రభుత్వంతో సంప్రదించి ఒక సరైన నిర్ణయానికి ఎన్నికల కమిషన్‌ రావడం రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ.

రాష్ట్ర ఎన్నికల అధికారి గవర్నర్‌ నియమించిన ఒక ప్రత్యేక అధికారి. ఎన్నికలు జరిగేవరకు, సాధారణ పరిస్థితుల్లో, ఆయన అత్యంత స్వతంత్రుడు. కానీ, ఆర్టికల్‌ 243 ప్రకారం ప్రభుత్వంతో సమాలోచన జరిపి మాత్రమే తగిన నిర్ణయం తీసుకోవాలి. కమిషనర్‌ తన ఇష్టం వచ్చినప్పుడు ఎన్నికలు జరుపుతానంటే... అది ప్రభుత్వ యంత్రాంగం మొత్తం దానిపై దృష్టి కేంద్రీక రించాల్సి వుంటుంది... దానికి ప్రభుత్వం నుంచి, అధికారుల నుంచి, ఉపాధ్యాయుల నుంచి ఏరకమైన సహకారం లభిస్తుం దన్నది పెద్ద ప్రశ్న. పైగా, కోవిడ్‌ సెకండ్‌వేవ్‌ నేపథ్యంలో ప్రభుత్వం ఎన్నికలను జరపడానికి తన సన్నద్ధతను తెలుపగలదా అన్నది మరో ప్రశ్న. అయినా సరే, పరస్పర చర్చలు విస్మరించడం ఎన్నికల కమిషన్‌ బాధ్యతారాహిత్యమే అవుతుంది. 

మార్చిలో రిటైర్‌ కాబోతున్న ఎన్నికల కమిషనర్‌ తన హయాంలో ఏమైనా సరే, ఎన్నికలు జరపాలనే పట్టుదలతో ఉన్నట్టుగా కనబడుతోంది. అయితే టీకా పంపిణీ గురించిన కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, ప్రజా సంక్షేమం దృష్ట్యా ఎన్నికలను మరికొంత కాలం వాయిదా వేయాలని అసెంబ్లీ తీర్మానం చేసింది. ఇది అత్యంత ప్రాధాన్యత ఇవ్వవలసినది. ఏ రాజ్యాంగ వ్యవస్థ అయినా చట్ట సభ ద్వారా వచ్చిన తీర్మానాన్ని సహేతుకమైనదైతే దాన్ని ప్రజల అభీష్టంగానే గౌరవించాలి. ఒక ప్పుడు ప్రభుత్వం తన సంసిద్ధ తను వ్యక్తపరిచినప్పుడు ఇదే కమి షన్‌ కోవిడ్‌ను కారణంగా చూపి, ఎన్నికలు వాయిదా వేసింది.  

మూడు కారణాలు ఎన్నికలు వాయిదా వేయడానికి అనుకూ లంగా కనిపిస్తున్నాయి. 1. కోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం, కమిషన్‌ చర్చించుకుని ఒక నిర్ణయానికి రావాలి. అది జరగలేదు 2. ఓటర్ల జాబితా సవరణ ఇంకా పూర్తి కాలేదు. 3. టీకా పంపిణీ గురించిన ఏర్పాట్లలో ప్రభుత్వం నిమగ్నమై ఉండటం. నందలాల్‌ వర్సెస్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఆఫ్‌ మహారాష్ట్ర, 14–8–2008 కేసులో సుప్రీంకోర్టు ఒక విలక్షణమైన తీర్పు ఇచ్చింది.

నందలాల్‌ ఆనాటి మహారాష్ట్ర ఎన్నికల కమిషనర్‌. ప్రివి లేజ్‌ కమిటీ తీర్మానాన్ని గౌరవించనందుకు ఎన్నికల కమిషనర్‌ను ఎందుకు అభిశంసించకూడదో కారణాలు చెప్పాలని అసెంబ్లీ కోరింది. దానికి కమిషనర్‌ తన సెక్రటరీ ద్వారా సంతకం చేయించి పంపించారు. దానికి ప్రివిలేజ్‌ కమిటీ అంగీకరించక, ఆయన సంతకంతో సమాధానం కోరింది. అయినప్పటికీ సదరు కమిషనర్‌ మళ్లీ సెక్రటరీతోనే సమాధానం పంపారు. దానితో సంతృప్తి చెందని ప్రివిలేజ్‌ కమిటీ ఎన్నికల కమిషనర్‌ను వ్యక్తి గతంగా అసెంబ్లీ ముందు హాజరుకమ్మని ఆదేశించి, ఆయనను అభిశంసిస్తూ రెండు రోజులు జైలుశిక్ష విధించింది. సుప్రీంకోర్టు ఈ పూర్వపరాలన్నీ విచారించిన మీదట, ఎన్నికల కమిషనర్‌నే తప్పుపట్టింది. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల కమిషనర్‌ కూడా ఒకసారి ఆ తీర్పును వివరంగా చదవడం అవసరం.

-జస్టిస్‌ డి.ఎస్‌.ఆర్‌. వర్మ
వ్యాసకర్త విశ్రాంత న్యాయమూర్తి

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top