సమ(గ్ర) అభివృద్ధికే వికేంద్రీకరణ | Andhra Pradesh Government Withdraws Three Capital Bill: DVG Shankar Rao Opinion | Sakshi
Sakshi News home page

సమ(గ్ర) అభివృద్ధికే వికేంద్రీకరణ

Nov 24 2021 1:10 PM | Updated on Nov 24 2021 1:10 PM

Andhra Pradesh Government Withdraws Three Capital Bill: DVG Shankar Rao Opinion - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటు ద్వారా పాలనా వికేంద్రీకరణ ఆశించే చట్టాన్ని, దానికి అనుబంధమైన రెండో చట్టం–సీఆర్‌డీఏని రద్దు చేసిన చట్టాన్ని వెనక్కి తీసుకోవడం కీలక పరిణామం.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటు ద్వారా పాలనా వికేంద్రీకరణ ఆశించే చట్టాన్ని, దానికి అనుబంధమైన రెండో చట్టం–సీఆర్‌డీఏని రద్దు చేసిన చట్టాన్ని వెనక్కి తీసుకోవడం కీలక పరిణామం. మొన్న కేంద్రం వ్యవసాయ చట్టాల విషయంలో వ్యవహరించినట్టుగానే, రాష్ట్రం రాజధాని చట్టాల విషయంలో వ్యవహరించడం– అంటే తాను తెచ్చిన చట్టాల్ని తానే రద్దు పరచడం విశేషం. ఈ నిర్ణయానికి ప్రభుత్వాన్ని తప్పుబట్టడం, ఎద్దేవా చేయాల్సిన అవసరం ఏమీ లేదు. అయితే ఆ చర్యకు నేపథ్యంగా చెప్పిన కారణాలు అభినందనీయం. రాష్ట్రం అభివృద్ధితో ముడిపడివున్న ఈ చట్టాలపై విస్తృత ప్రజాభిప్రాయం తెలుసుకోవాల్సి ఉంది. వివిధ వేదికలపై జనబాహుళ్యంలో చర్చలు జరిపిన పిమ్మట మెరుగైన చట్టాల్ని తీసుకురావాల్సి ఉంటుంది. అయితే ఈ చట్టాలపైన రాజకీయాలకు అతీతంగా, ప్రాంతీయ భావాలకు అతీతంగా రాష్ట్ర శ్రేయస్సు ప్రాతిపదికన చర్చలు జరిగినప్పుడే ఫలితం ఉంటుంది. ప్రస్తుత తరుణంలో  అది అత్యాశే కావొచ్చు కానీ ఆవశ్యం మాత్రం అదే. (చదవండి: ఇది సెల్ఫ్‌ గోల్‌ కాదా బాబూ?)

అభివృద్ధి అంటే సమాజంలో అందరికీ సంబంధించిన విషయం. సమాజంలో చిట్టచివరి వరుసలో నిలబడ్డ చిట్టచివరి వ్యక్తికీ మేలు జరిగే అవకాశమిచ్చేదే అసలైన అభివృద్ధి. ప్రజాస్వామ్య పాలనలో ప్రభువులైన ప్రజలకు పాలనా వ్యవహారాలు ఎంత చేరువైతే అంత మంచిది. ఒక గ్రామస్థుడు, మండల కేంద్రం దాకా వెళ్లి, తిరిగి సాధించుకోవాల్సిన పని తన గ్రామ సచివాలయంలో చేసుకోగలిగితే ఎంత సౌలభ్యం! సమయం, ధనం మిగులు కదా! అలాగే పాలనా వికేంద్రీకరణ  రాష్ట్రంలో ముఖ్యమైన మూడు ప్రాంతాలకు విస్తరిస్తే మూడు ప్రాంతాలూ వివక్షకు గురి కావు. సమాన అభివృద్ధిని చవిచూస్తూ సమప్రాధాన్యతతో ఉంటాయి. అలాగే అమరావతి ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలి. అన్యాయం జరిగిందన్న భావన, విస్మరణకు గురయ్యామన్న భావన నెలకొనని రీతిలో రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి. (చదవండి: చట్టాల రద్దుతో మారనున్న రాజకీయం)

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చెప్తున్నట్లు అమరావతిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడానికి లక్షలాది కోట్లు సేకరించడం తలకు మించిన భారం. కరోనా నేపథ్యంలో అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్ధిక మాంద్యం పరిస్థితిలో ఇది భారమే కాకుండా దాదాపు అసాధ్యం. ఈ వాస్తవం ప్రశ్నించలేనిది. దీనిపై మాటల గారడీ పనికిరాదు. ఇప్పటి పరిస్థితుల్ని గమనంలోకి తీసుకొని ఆర్థిక, సామాజిక, సమతుల్య, సమగ్ర అభివృద్ధి కోసం మెరుగైన ఆలోచనలు చెయ్యాలి. అందులో వాస్తవిక దృక్పథం, ఆచరణీయ మార్గం, స్పష్టమైన గమ్యం ఉండాలి. జనబాహుళ్యంలో విస్తృత చర్చల ద్వారానే అసలు మేలైన మార్గమేదో స్పష్టమౌతుంది. 

– డా. డి.వి.జి. శంకర రావు
మాజీ ఎంపీ, పార్వతీపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement