ఇంటిపంట ఓ స్టేటస్‌ సింబల్‌!

Terrace Garden Is New Status Symbol - Sakshi

ఇవాళ మనం ఒక ప్రత్యేక సందర్భంలో నిలిచి ఉన్నాం. ఇటువంటి సందర్భాన్ని ప్రపంచం మునుపెన్నడూ చూడలేదు. ఇలా ప్రపంచం యావత్తూ మృత్యుభయంతో గజగజ వణికిపోయి సమస్త పారిశ్రామిక కార్యకలాపాలను సమస్త రవాణా సాధనాలను ఎక్కడికక్కడ ఆపేసుకుని సమస్త దేశాలూ స్వీయ లాక్‌డౌన్‌ పాటించడం మునుపు ఎన్నడూ లేని విషయం. లాక్‌డౌన్‌ అనేది దశల వారీగా ఇంకా సాగుతూనే ఉంది. ఇదంతా కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తి – తదనంతర సంక్షోభ పరిస్థితుల గురించి అని మీలో అందరికీ తెలుసు. కోవిడ్‌ వైరస్‌ అనేది ప్రపంచానికి అనేక పాఠాలను నేర్పుతోంది. నేర్చుకున్న వారికి నేర్చుకున్నంత.అందులో ఒక పాఠం ’రోగనిరోధక శక్తి– బలవర్ధకమైన ఆహారం’ అనేది అతి ముఖ్యమైన పాఠం.

బలమైనరోగ నిరోధకశక్తి కలిగిన వారిని కోవిడ్‌ వైరస్‌ ఏమీ చెయ్యలేకపోతోంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది కోవిడ్‌ వైరస్‌ వల్ల మృత్యువాత పడ్డారు. వారంతా బలహీనమైన వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉన్న వారు. రోగనిరోధక శక్తిని కలిగి ఉండటానికి, ప్రకృతి సిద్ధ పద్ధతిలో పండించిన ఆహారం అవసరం. రసాయన పురుగు మందుల వ్యవసాయం మూలంగా ఉత్పత్తి చెయ్యబడిన ఆహారంలో రోగనిరోధక శక్తి దాదాపుగా ఉండదని ప్రామాణిక నివేదికలు తెలియజేస్తున్నాయి. ప్రపంచం సంగతి తెలియదు కానీ, మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో మటుకు, మనం ఇక ముందు ఏది మాట్లాడుకోవాలన్నా’ కోవిడ్‌ కు ముందు– తరువాత’ అని మాట్లడుకోవలసి ఉంటుంది. అంతగా గత తొమ్మిది నెలల లాక్‌డౌన్‌ ప్రజలకు పాఠాలు చెప్పింది.

ఒక అంచనా ప్రకారం.. ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలలో సుమారు రెండున్నర లక్షల మంది మిద్దె తోటలు లేదా ఇంటి పంటల సేద్యం చేస్తున్నారు. గత తొమ్మిది నెలల లాక్‌డౌన్‌కు పూర్వం వీరి సంఖ్య కేవలం వేలల్లో ఉండేది. కేవలం తొమ్మిది నెలల కోవిడ్‌ కాలంలో అనూహ్యంగా పెద్ద సంఖ్యలో ఇంటి పంటల సాగు వైపు మొగ్గు చూపారు ప్రజలు. ఇందుకు గల ముఖ్య కారణాల్లో గత దశాబ్ద కాలంగా ’సాక్షి’ దినపత్రిక ’ఇంటిపంట’ పేరుతో ప్రచారం చెయ్యడం కూడా. ప్రారంభంలో ‘అది సాధ్యమేనా?‘ అని అనుమానాలు వ్యక్తం చేసిన వారు కూడా, ప్రస్తుతం మిద్దె తోటల కల్చర్‌ వైవు, పెరటి తోటల కల్చర్‌ వైవు మరలుతున్నారు.

మరోవైపు అటు వ్యవసాయ రంగంలో కూడా, గత దశాబ్ద కాలంగా సాక్షి దినపత్రిక ‘సాగుబడి’ ద్వారా రసాయన వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తూ వస్తోంది. ఈ రెండు రకాల ప్రోత్సాహాలకు తోడుగా అనేక ఇతర సంస్థలు కూడా బాధ్యతగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రచారం చేస్తూ వచ్చాయి. ఇంకా మరికొన్ని సంస్ధలు వ్యక్తులు కూడా ఇటువంటి ప్రచారంలో పాలు పంచుకోవడం మనం ఎరుగుదుం. అటువంటి గత దశాబ్దపు కృషికి కోవిడ్‌ వైరస్‌ నేర్పిన పాఠాలు కూడా తోడై, అతి తక్కువ కాలంలోనే లక్షలాది మంది మిద్దె తోటలు/ పెరటి తోటలు/ ఇంటిపంటల సాగు వైపు మరలారు. ఇదంతా రసాయన ఎరువులు పురుగుమందులు హైబ్రిడ్‌ విత్తనాలు లేకుండా, పూర్తి దేశీ పద్ధతిలో, తిరిగి మన పురాతన వ్యవసాయ పద్ధతుల వైపు ఆలోచించడానికి– ఆచరణలోకి తేవడానికి కారణం అయింది.

ఏదీ ఏమైనా ఇవాళ తెలుగునాట కోట్లాది మంది ప్రకృతి వ్యవసాయం గురించి, ఈ పంటల ప్రాధాన్యత గురించి, అవి మన ఆరోగ్యానికే కాకుండా సమస్త పర్యావరణానికి ఎలా మేలు కలిగిస్తాయో తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలోనే అనేకమంది ఇంటి పంటల వైపు మరలారు. ఇంటిపంట అంటే ప్రధానంగా మిద్దెతోట సేద్యమే. పట్టణాలలో పెరటి తోటల సేద్యానికి అవకాశాలు తక్కువ– దాదాపుగా లేవు. స్థలాల ఖరీదు విపరీతంగా పెరిగింది. అందువల్ల పెరటి తోటల సేద్యం చెయ్యడానికి అవకాశాలు మూసుకుపొయ్యాయి. కేవలం మిద్దె తోటల సేద్యానికి మాత్రమే అవకాశాలున్నాయి. నగరాల విస్తీర్ణం ఎంత ఉంటుందో, మిద్దె తోటల సేద్యానికి అంత అవకాశం ఉంటుంది. నగరాలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం, నగర మిద్దె తోటల్లో ఉంది.

ఇప్పుడు మిద్దె తోట అనేది ఒక ఆరోగ్యమంత్రం. ఒక స్టేటస్‌ సింబల్‌గా మారింది. ఇది శుభపరిణామం. ఇందుకు ప్రత్యక్ష, పరోక్ష కారకులకు అందరికీ అభినందనలు తెలుపుతూ.. మిద్దె తోటల లేదా ఇంటిపంటల అవసరం గురించి, వాటి నిర్మాణ, నిర్వహణల గురించి కొన్ని విషయాలను చర్చిద్దాం. మిద్దె తోటల సాగు వల్ల నూరు లాభాలు ఉన్నాయి. అందులో ప్రధానమైన లాభం పురుగుమందుల అవశేషాలు లేని కూరగాయలు, పండ్లు, ఇతర వంటింటి సుగంధ ద్రవ్యాల సాగు ఉత్పత్తి. ప్రధాన ఆహారమైన వరి, గోధుమ, చిరుధాన్యాలు, పప్పు దినుసులు వగైరా మిద్దె తోటల్లో పెరటి తోటల్లో సాగు చెయ్యలేం. కారణం? తగినంత విస్తీర్ణంలో మిద్దె కానీ పెరడు భూమి కానీ అందుబాటులో ఉండకపోవడం.

కనుక మనం ఇంటిపంట అని పిలుస్తున్నది అటు గ్రామాలలో ప్రకృతి వ్యవసాయాన్నీ ఇటు పట్టణాలలో మిద్దె తోటల సేద్యాన్ని ఉద్దేశించి మాత్రమే.
► స్వాతంత్య్రానంతరం వ్యవసాయ రంగంలో హైబ్రిడ్‌ విత్తనాలు రసాయన ఎరువులు పురుగుమందుల వాడకం క్రమంగా పెరిగింది. ఓ దశాబ్దం క్రితం వరకు కేవలం పైర్ల మీద మాత్రమే పురుగుమందులను స్ప్రే చేసే వారు! క్రమంగా కలుపు నివారణ కోసం విషపూరిత రసాయన మందులను భూమి మీద స్ప్రే చెయ్యడం ప్రారంభం అయింది.
ఒకప్పుడు కూరగాయల మార్కెట్‌కు వెళ్లిన వారు బెండ, వంగ వంటి కూరగాయలను కొనేముందు పురుగు పుచ్చు ఉందో లేదో అని ప్రతీ కాయను పరీక్షగా చూసి తీసుకునే వారు. అయినా ఒకటో రెండో పుచ్చు కాయలు వచ్చేవి. ఇటీవల అటువంటి పురుగు, పుచ్చు కాయలు కనబడటమే లేదు. ఎందుకని?
అంతగా పురుగుమందుల వాడకం పెరిగింది. వారం వారం ఏదో ఒక పురుగుమందును కూరగాయల మొక్కల మీద స్ప్రే చేస్తుంటారు. అదీ సంగతి!
ఇవాళ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఒక జిల్లా కేంద్రంలో సుమారు అయిదు వందల పురుగుమందుల దుకాణాలు ఉన్నాయి. సాలీనా వాటి టర్నోవర్‌ అయిదు వందల కోట్ల రూపాయల వరకు ఉంటుంది.
ఇలా ఉభయ తెలుగు రాష్ట్రాల జిల్లాల్లో జరుగుతున్న పురుగుమందుల వ్యాపారం ఏ లెవల్లో సాగుతోందో అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ లెక్క. ఇది స్వయంగా ఓ జిల్లా కేంద్రంలోని పురుగుమందుల వ్యాపారి చెప్పిన లెక్క.
అంటే నిత్యం ముప్పూటలా మనం పురుగుమందులనే పళ్లాలలో పెట్టి మన పిల్లలకు, తల్లిదండ్రులకు తినమని పెడుతున్నాం– మనమూ అదే విషాహారం తింటున్నాం. 
ఎంత సంపాదిస్తున్నాం అన్న దానికన్నా, ఎంత నాణ్యమైన ఆహారాన్ని తింటున్నాం అనేది ముఖ్యమైన విషయం.
ఇవాళ మధ్య తరగతి ఎగువ దిగువ మధ్య తరగతి వాళ్లలో క్యాన్సర్‌ పేషెంట్‌ లేని ఇల్లు అరుదు.
అదంతా ఈ పురుగుమందుల తిండి వల్లనే అని మనకు అనేక నివేదికలు చెప్తున్నాయి.

మనం తినే ఆహారంలో సగభాగమైన కూరగాయలను పండ్లను ఇతర వంటింటి సుగంధ ద్రవ్యాలను మనమే మన ఇంటిపంటలుగా ఇంటి మీదనే పండించుకోవచ్చు. అందుకు మిద్దె తోటలే సరైన సాధనాలు.
ప్రకృతి జీవన విధాన సాధనకు, మిద్దె తోట సరైన సాధనం.
పురుగుమందుల తిండికి భయపడితే చాలు, సమయమూ ఓపిక వాటంతట అవే చక చకా వస్తాయి.
మిద్దె తోటల సాగు వల్ల అనేక లాభాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా? అందులో ప్రధాన లాభాలను ఒకసారి మీ దృష్టికి తెస్తాను.
మిద్దె మీద తోట ఉండటం వల్ల, ఇంటిలో కనీసం మూడు డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువ ఉంటుంది.
ఆ కారణంగా ఏసీ, కూలర్‌ వగైరా వాడవలసిన అవసరం తగ్గుతుంది. వాటి జీవిత కాలం పెరుగుతుంది.
ఆ మేరకు విద్యుత్‌ బిల్లులతోపాటు విద్యుత్‌ ఉత్పత్తి వల్ల వచ్చే కాలుష్యం కూడా తగ్గుతాయి.
ఒక ఇంటి మీద తోట ఉండటం వల్ల అంత ఉష్ణోగ్రత తగ్గినప్పుడు, ఒక నగరం మీద మొత్తం మిద్దె తోటల సాగు చేస్తే నగరపు ఉష్ణోగ్రతలు ఎంత తగ్గాలి?

ఓ సజృనాత్మక ప్రక్రియ!
కూరగాయల కోసం మార్కెట్‌కు వెళ్ళవలసిన అవసరం తప్పుతుంది– అందుకు వాడే వాహనం దానికి ఇంధనం తద్వారా వెలువడే వాయు కాలుష్యం, సమయం వగైరా తప్పుతాయి. రోడ్ల మీద ట్రాఫిక్‌ కూడా తగ్గుతుంది. రోజూ ఓ అరగంట మిద్దెతోటలో లేదా పెరటి తోటలో పని చేసుకోవడం మూలంగా శరీరానికి కావలసిన వ్యాయామం లభిస్తుంది. అలాగే మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. మిద్దెతోట లేదా పెరటితోట లేదా వ్యవసాయం అనేది ఓ సజృనాత్మక ప్రక్రియ! పిల్లల్లో సృజనాత్మకత అభివృద్ధి చెందుతుంది. ఇలా ఒక కాలంలో ఒక పద్ధతిలో ఒక విత్తనాన్ని నాటితే ఇలా సంరక్షణ చర్యలు తీసుకుంటే ఇలా ఉత్పత్తి వస్తుంది అని ఒక ఉత్పత్తి క్రమం పిల్లలకు అర్థం అవుతుంది. అదే క్రమం పిల్లలకు బ్రతుకు క్రమాన్ని కూడా తెలియచేస్తుంది.
ఇంటి మీద ఒక తోట ఉంటే, కుటుంబ సభ్యుల మధ్య ఉమ్మడి సబ్జెక్టుగా మారి అందరి మధ్యా ఒక బంధం ఏర్పడుతుంది. పిల్లలు పెద్దవారై ఉద్యోగాలకు ఎటు వారు అటు పోయి ఒంటరితనానికి లోనయ్యే గృహిణులకు మిద్దెతోట ఒక ఆలంబనగా మారుతుంది. ఉపశమనం కలిగిస్తుంది. రిటైర్డ్‌ ఉద్యోగులకు మిద్దె తోట ఒక పునర్జన్మను ఇస్తుంది. మీ మిద్దెతోట మూలంగా తిరిగి వారికి ఒక సోషౖల్‌ లైఫ్‌ ప్రారంభం అవుతుంది.

సమస్యలు తగ్గుతాయి!
మిద్దె తోటల సాగు విస్తీర్ణం ఎంత పెరిగితే, ఉష్ణోగ్రతలు వాయు, ధ్వని కాలుష్యాలు అంత తగ్గుతాయి, ఆ మేరకు ప్రజలకే కాదు పరోక్షంగా ప్రభుత్వాలకు కూడా సమస్యలు తగ్గుతాయి. మిద్దె తోటల సాగు మూలంగా ప్రజల ఆరోగ్యాలు బాగు పడతాయి– ఆ మేరకు ఖర్చులు తగ్గుతాయి, ఆ డబ్బును ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించ వచ్చు. ఇంటిపంట/మిద్దెతోట అనేది ఓ నాలుగు అక్షరాల చిన్నపదం మాత్రమే కాదు, అది బహుళార్థ సాధక సాధనం.

బరువు సమస్యే కాదు!
’ఇంటి మీద మిద్దెతోట నిర్మాణం జరిపితే బరువు మూలంగా ఇంటికి ప్రమాదం కాదా?’ అని కొందరికి అనుమానం కలుగుతుంది. ’ఇంటి మీద మొక్కల పెంపకం చేపడితే, నీటి ఉరుపు సమస్య ఏమైనా ఏర్పడుతుందా?’ అని మరికొందరు అనుమానపడతారు. మిద్దె తోట బరువు ఒక ఇంటిమీద పెద్ద బరువు కాదు. కాలమ్స్‌ పద్ధతిలో కట్టిన ఆర్సీసీ బిల్డింగ్‌ అయితే, అది స్టాండర్డ్‌ బిల్డింగ్‌ అయితే, మనం భయపడాల్సిన పని లేదు. ప్రత్యేకంగా ఎటువంటి జాగ్రత్తలు కూడా అవసరం లేదు. మిద్దె మీద వర్షపు నీరు నిలవకుండా ఒక వైపు వాలు ఉంటుంది. పై కప్పు వేసేటప్పుడు ఆ వాలును సరిగా మెయింటైన్‌ చెయ్యమని మేసన్‌ పని వారికి, బిల్డర్‌కు చెప్పాలి.

ఖర్చు ఎక్కువ అక్కర్లేదు 
’మిద్దె తోటల సాగు చాలా ఖర్చుతో కూడుకున్నది’ అని కొందరు అనుకుంటున్నారు– అదీ నిజం కాదు. మీరు ఎంత బడ్జెట్లో అయినా ఓ మిద్దెతోటను ప్రారంభం చెయ్యవచ్చు. ఓ వంద రూపాయల సిమెంట్‌ లేదా మట్టి కుండీలో ఓ కరివేపాకు మొక్కను పెంచవచ్చు. అలాగే చిన్న చిన్న ట్రేలలో ఆకుకూరల పెంపకం చేపట్టవచ్చు. ఓ నెలలోనే ఆకుకూరలను పొందవచ్చు. ఓ ఖాళీ సిమెంట్‌ సంచిని నీళ్లలో ఝాడించి ఉతికి, సగానికి మడిచి మట్టి ఎరువుల్ని కలిపి నింపుకుని ఓ రెండు వంగ మొక్కలను నాటుకుని వారంలో ఒకసారి వంకాయలను ఉత్పత్తి చెయ్యవచ్చు. అది అన్నిటి కంటే చవకైన పద్ధతి. ఓ పదివేల రూపాయల నుండి ఓ లక్ష రూపాయల వరకు వ్యయం చేసుకుని చక్కని మిద్దెతోట నిర్మాణం చేసుకోవచ్చు. పురుగుమందుల దృష్టి కోణం నుంచి చూస్తే, ఇవాళ ఇల్లు ఎంత ముఖ్యమో ఇంటి మీద తోట కూడా అంతే ముఖ్యం. మిద్దె తోటల నిర్మాణం విషయంలో పీనాసితనం పనికి రాదు.

సరైన సాధనం ఎంపిక ముఖ్యం 
మునుపు మిద్దె తోటల నిర్మాణానికి సరైన సాధనం లేదు. ఎవరికి తోచిన పాత్రలను వారు పెట్టుకుని, అరకొర ప్రయత్నాలు చేసే వారు.
పగిలిన ప్లాస్టిక్‌ బకెట్‌ లేదా సంచులు మట్టి సిమెంట్‌ కుండీలు మాత్రమే అందుబాటులో ఉండేవి.
ఇప్పుడు అందమైన పటిష్ఠమైన ఇటుకల మడుల నమూనాలు అందుబాటులో ఉన్నాయి. మడుల కింద చీపురుతో ఊడ్చుకోవచ్చు. అంత సౌకర్యవంతమైన మడుల నమూనాలు అభివృద్ధి చెయ్యబడ్డాయి.
మిద్దెతోట నిర్మాణం విషయంలో సరైన సాధనాన్ని ఎన్నుకోవడం ముఖ్యమైన విషయం.
ఏవో చిప్పా దొప్పా మొక్కలను నాటడానికి వాడితే , సరైన ఉత్పత్తులు రావు. పైగా నిరాశ ఉత్పత్తి అవుతుంది. మొదటికే మోసం వస్తుంది.

ఇటుకల మడులు శ్రేయస్కరం
మిద్దెతోట నిర్మాణానికి ఇటుకల మడులు శ్రేయస్కరం.
నాలుగు ఫీట్ల పొడవు వెడల్పు, ఒక ఫీటు లోతు కలిగిన మడులు అవసరం ఉంటుంది. ప్రతీ మడి లేదా బెడ్‌ కింద ప్రత్యేకంగా రెండు అంగుళాల మందం కలిగిన ’సిమెంట్‌– ఐరన్‌ రాడ్‌ – బిళ్లను పోత పోసి వేస్తారు. క్యూరింగ్‌ తరువాత ఆ బిళ్లను ఒక ఫీటు ఎత్తుపైకి లేపి దిగువన నాలుగుౖ వెపులా నాలుగు ఇటుకలనే కాళ్లుగా పెట్టి, బిళ్ల మీద చుట్టూ నాలుగుౖ వెపులా ఫీటు ఎత్తు ఇటుకల గోడ కట్టాలి. మడి అడుగున నీరు నిలవ కుండా ఒక వైపు కాస్తా వాలుగా సిమెంట్‌ ప్లాస్టరింగ్‌ చెయ్యాలి. మడి గోడలకు లోపల బయట కూడా సిమెంట్‌ ప్లాస్టరింగ్‌ చేయించాలి. టెర్రకోట రంగు చేయించుకున్న తరువాత చక్కగా నచ్చిన ముగ్గులను మడుల గోడల మీద వేసుకోవాలి. అందమైన పటిష్ఠమైన ఇటుకల మడులు సిద్దం అవుతాయి.
భూమి మీద చేసే వ్యవసాయానికి మిద్దె మీద చేసే వ్యవసాయానికి ప్రధానమైన తేడా ఇటుకల మడులు అమర్చుకునే విషయంలో మాత్రమే. తక్కిన వ్యవసాయం అంతా ఒక లాగే ఉంటుంది.
ఇటువంటి ఇటుకల మడులను మిద్దె మీద మొత్తం ఎన్ని పడతాయో ఒకేసారి లెక్కవేసుకుని కట్టించాలి. దారులు వదులుకుని చక్కగా సిస్టమెటిగ్గా కట్టుకోవాలి. మడుల వరుసలు అన్నీ బీమ్‌ల మీద కట్టుకోవాలి.

ఇటుకల మడుల నిర్మాణానికి దాదాపు ఓ వారం పని దినాలు అవుతాయి.
ఇనుపరాడ్‌ –సిమెంట్‌ –ఇటుకలు ఇసుక – కంకర వంటి మెటీరియల్‌ను తాపీ మేస్త్రీతో కలిసి కొనుగోలు చెయ్యాలి. లేదా వారికే గుత్తకు ఇవ్వవచ్చు. స్టాండర్డ్‌ పని చెయ్యమని చెప్పాలి.
నాలుగు ఫీట్ల పొడవు వెడల్పు ఫీటు లోతు కలిగిన ఒక మడి నిర్మాణానికి సుమారు మూడు వేల రూపాయలు వ్యయం కావచ్చు. మట్టి ఎరువులకు అదనంగా ఖర్చు అవుతుంది.
ప్రతీ రెండు మడుల తరువాత మూడవ మడిని మాత్రం మరో ఫీటు లోతు ఎక్కువగా పెట్టి కట్టించాలి. వాటిని పండ్ల మొక్కల పెంపకానికి వాడాలి. మిద్దెతోటల్లో అన్ని రకాల పండ్ల మొక్కలను కూడా పెంచవచ్చు. అన్ని రకాల కూరగాయల మొక్కల సాగుకు నాలుగు ఫీట్ల పొడవు వెడల్పు ఒక ఫీటు లోతు మడులు సరిపోతాయి.
గ్రోబ్యాగులు

మూడవ ప్రత్యామ్నాయం గ్రోబ్యాగులు– ఇవి ప్లాస్టిక్‌ సంచులు
తక్కువ ఖర్చు– బరువు తక్కువ– ఎక్కువ కాలం మన్నికగా ఉండవు. నాలుగైదు సంవత్సరాల తరువాత పనికిరావు! ఎండలకు పాడౌతాయి. పైగా ప్లాస్టిక్‌ సంచులు వాడకూడదు అని విజ్ఞులు చెప్తున్నారు.
మట్టి కుండీలు 
తరువాత సిమెంట్‌ లేదా మట్టి కుండీలు ఉన్నాయి. అవి కేవలం పూల మొక్కల పెంపకానికి మాత్రమే పనికి వస్తాయి. లేదా ఒక సిమెంట్‌ కుండీలో ఒక వంగ మొక్కను పెంచవచ్చు. 
కూరగాయలను పండ్లను కుటుంబ అవసరాలకు సరిపడా ఉత్పత్తి చెయ్యాలంటే ఇటుకల మడులు తప్పకుండా ఉండాలి. సొంత ఇల్లు ఉన్న ప్రతీ వారు ఇటువంటి మడులకే ప్రాధాన్యం ఇవ్వాలి. అపార్ట్‌మెంట్లలో ఉన్నవారు కూడా ఇటువంటి ఇటుకల మడులకే ప్రాధాన్యం ఇవ్వాలి.
ఫైబర్‌ మడులు 
ఇటుకల మడులు కట్టడానికి ఓ వారం రోజుల పని దినాలు అవుతాయి. కొంత రిస్క్‌ ఉంటుంది. మరో చోటకు మార్చడానికి కుదరదు. బరువు ఎక్కువ అనే భావన ఉంటుంది.
అటువంటి వారిని దృష్టిలో ఉంచుకొని ఫైబర్‌ మడులను కూడా డిజైన్‌ చెయ్యడం జరిగింది. నాలుగు ఫీట్ల పొడవు వెడల్పు కలిగి ఒక ఫీటు లోతు ఉన్న మడులతో పాటు వివిధ రకాల డిజైన్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఫైబర్‌ టబ్బులతో ఒక్క రోజులోనే మిద్దె తోట నిర్మాణం పూర్తి చెయ్యవచ్చు.
స్థూలంగా మిద్దె తోట నిర్మాణం విషయంలో మడుల నమూనాల గురించి సమాచారం ఇది.
నిలువు పందిళ్లు
మిద్దెతోట నిర్మాణం విషయంలో మడులను అమర్చుకోవడంతో ప్రధానమైన దశను దాటుతాం. తరువాత రెండోదశలో టెర్రస్‌ మీద చుట్టూ నాలుగు వైపులా నిలువు పందిరి నిర్మించుకోవాలి.
టెర్రస్‌ మీద చుట్టూ నాలుగు వైపులా రక్షణ గోడ ఉంటుంది. మూడు ఫీట్ల ఎత్తుతో ఉంటుంది. ఆ గోడనుబేస్‌ చేసుకుని ఎనిమిది ఫీట్ల ఎత్తుతో పందిరి వేసుకోవాలి. పందిరి అంటే మనకు అడ్డంగా వేసే పందిరి తెలుసు. మిద్దె మీద అడ్డంగా పందిరి వేస్తే దిగువన నీడపడి మొక్కలు ఎదగవు– స్థలం వృథా అవుతుంది. అందుకని నిలువు పందిరి కట్టాలి. ప్రతీ పది ఫీట్లకు రక్షణ గోడను సపోర్ట్‌ చేసుకుని ఒక ఐర న్‌ పోల్‌ బిగించి అడ్డం పొడవు తీగలు కట్టుకుని చక్కని పందిరి కట్టు కోవాలి.
కూరగాయల జాతుల్లో సగం తీగజాతి కూరగాయల మొక్కలే ఉన్నాయి– నిలువు పందిరి చుట్టూ ఒక ఇటుకల మడి వరుస కట్టిస్తే తీగ జాతులన్నిటినీ అటువైపు పెంచి పందిరికి పాకించవచ్చు.
ఈ విధంగా మిద్దెతోట నిర్మాణంలో మడులను కట్టుకోవడం – నిలువు పందిరి వేసుకోవడంతో రెండు దశలు పూర్తి అవుతాయి.

సిమెంటు కుండీలు 
మూడవ దశ – సిమెంట్‌ లేదా మట్టికుండీలను అమర్చుకోవాలి.
ఇటుకలతో ప్రధాన మడులు కట్టించుకున్న తరువాత , మిగిలిన చిన్న చిన్న ప్లేసులు బయటపడతాయి. వాటిలో సిమెంట్‌ లేదా మట్టికుండీలను తెచ్చుకుని పెట్టుకోవాలి. ఇవి ప్రధానంగా పూల మొక్కలు పెంచడానికి వాడాలి. మిద్దె తోటల్లో పెరటి తోటల్లో పొలాలలో పూల మొక్కలు తప్పకుండా ఉండాలి. రోజు పూలు పుయ్యాలి. పూలు తేనెటీగలను ఆకర్షించి మొక్కల్లో పరపరాగ సంపర్కం సజావుగా జరగడానికి దోహదం చేస్తాయి. పుష్పాల ఫలదీకరణ చెందిన తరువాత సంపూర్ణ ఉత్పత్తి జరుగుతుంది.

ఎర్రమట్టి మేలు 
ఈ మూడు దశల తరువాత మట్టి గురించి ఎరువుల గురించి ఆలోచించాలి.
మట్టిలో ఎర్రమట్టి నల్లమట్టి అని రెండు రకాల మట్టి లభిస్తుంది. నగరాలలో భవన నిర్మాణ పనులు సాగుతున్న ఏరియాలలో రోడ్లపక్కన అక్కడక్కడా కొందరు మట్టిని కుప్పులుగా పోసి అమ్ముతుంటారు.
అది సాధారణంగా ఎర్రమట్టి అయుంటుంది. మొక్కలకు అని చెప్పాలి. ఇసుక శాతం తక్కువ ఉండాలి. సారవంతమైన మట్టి కావాలి. మొరం లేదా చవుడు మట్టి పనికి రాదు.
ప్రస్తుత అవసరం కంటే ఎక్కువ మట్టిని తెచ్చుకోవాలి. మాటిమాటికి మట్టిని తేలేం. ఎక్కువ తెచ్చుకోవాలి. టెర్రస్‌ మీద ఓ మూలన నిల్వ చేసుకుని ఓ షీట్‌ కప్పాలి. ఎప్పుడు అవసరం పడితే అప్పుడు మట్టిని వాడుకోవచ్చు.
ఎరువుల విషయానికి వస్తే పశువుల ఎరువు మంచిది. గొర్రెల మేకల కోళ్ల ఎరువులు కూడా వాడుకోవచ్చు. అవి కూడా విష రసాయనాలు కలువని ఎరువులు అయి ఉండాలి.
మాగిన లేదా చివికిన ఎరువులు మట్టిలో కలపాలి. తాజా పచ్చి ఎరువులు కలపకూడదు.
మట్టి రెండు భాగాలుగా ఎరువు ఒక భాగంగా తీసుకుని మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. మడులను కాస్తా వెలితి ఉండేలా నింపుకోవాలి.
మట్టి ఎరువుల మిశ్రమాన్ని మడుల్లో నింపడంతో మిద్దెతోట నిర్మాణం దాదాపు పూర్తి అవుతుంది.

మిగిలింది విత్తనాల విషయం.
దేశీ విత్తనాలు మేలు
విత్తనాలలో దేశీ విత్తనాలు హైబ్రిడ్‌ విత్తనాలు ఉన్నాయి. దేశవాళీ విత్తనాలు మన వాతావరణానికి అనుగుణంగా ఉంటాయి. అయితే ఎక్కడపడితే అక్కడ అవి దొరికే అవకాశం లేదు. ఓపికగా సేకరించాలి. అందరికీ అందుబాటులో హైబ్రిడ్‌ విత్తనాలు మాత్రమే ఉన్నాయి. పరవాలేదు. వాటిని కూడా వాడుకోవచ్చు. వాటి నుండి తిరిగి విత్తనాలను కట్టుకుని తిరిగి వాటిని వాడవచ్చు. క్రమంగా అవీ దేశవాళీ విత్తనాల వలె మారతాయి.
సంవత్సరంలో మూడు కాలాలు ఉన్నాయి. ఆ మూడు కాలాల ప్రారంభ రోజుల్లో విత్తనాలను నాటుకోవాలి. నారు మొక్కలను నాటు కోవాలి.
కొన్ని మొక్కలను కొన్ని కాలాలలో పెంచలేం.పెంచినా కాపు కాయవు. ఆ గ్రహింపు ఉండాలి.
శీతాకాలపు పంటలైన మిర్చి, టొమాటో, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, కొత్తిమీర, వెల్లుల్లి వంటి వాటిని ఎండాకాలంలో పండించలేం. శ్రద్ధ తీసుకుంటే వర్షాకాలంలో మాత్రం కొంత పండించవచ్చు.

ఈ జాగ్రత్త వహించాలి.
గుమ్మడి – బూడిద గుమ్మడి – దుంపలు వంటి వాటిని వర్షాకాలం ప్రారంభంలో నాటు కోవాలి.
మిగతా అన్ని మూడు కాలాల్లో కూడా ఉత్పత్తి చెయ్యవచ్చు.
నీటి యాజమాన్య విషయంలో మిద్దె తోటల్లో పెరటి తోటల్లోఎక్కువ నీరు పెట్టడం వల్ల చాలా సమస్యలు వస్తుంటాయి. ఎక్కువ నీరు వల్ల మొక్కలు ఎర్రబడి చనిపోతాయి. వేరుకుళ్లు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది.
మట్టి పొడిగా ఉంటేనే నీరు
మొక్కలకు నీరు అవసరం ఉండదు. కేవలం తేమ మాత్రమే అవసరం ఉంటుంది. తేమ ద్వారా మాత్రమే మట్టిలో ఉన్న సూక్ష్మ, స్థూల పోషకాలను గ్రహిస్తాయి.
ప్రతిరోజూ మిద్దెతోటలో ఉదయం ఓ రౌండ్‌ తిరగాలి. మొక్కల మొదళ్ల దగ్గర మట్టిని ముట్టుకుంటే తేమ ఉన్నదీ లేనిదీ తెలుస్తుంది. తేమ ఉంటే నీరు పెట్టడం అవసరం లేదు.
తేమ లేకుంటే– మట్టి పొడిగా ఉంటే నీరు పెట్టడం అవసరం ఉంటుంది. మనం పెట్టిన నీరు మడుల్లోంచి బయటకు రాకుండా– తగు మాత్రమే పెట్టాలి. 
నాలుగైదు గంటల పాటు ఎండ
మొక్కల మీద కనీసం ప్రతీ రోజూ నాలుగైదు గంటల పాటు ఎండ తప్పకుండా పడాలి. మొక్కల మొలిచిన తరువాత పది రోజులకు ఒకసారి అంతర కృషి చెయ్యాలి. మొక్కల మధ్య మట్టిని లూజ్‌ చెయ్యాలి. చేసేటప్పుడు మొక్కల వేర్లు దెబ్బతినకుండా సున్నితంగా మట్టిని లూజ్‌ చెయ్యాలి. ఇలా చెయ్యడం వల్ల మొక్కల వేరు వ్యవస్థకు ప్రాణవాయువు అంది బలపడుతుంది. మొక్కల ఎదుగుదల బాగుంటుంది. ప్రతీ అంతర కృషి తరువాత స్వల్పంగా వర్మీకంపోస్టు చల్లి తగినంత నీరు పెట్టాలి.
చీడపీడల సమస్యలు తక్కువే
చీడపీడల సమస్యలు కూడా మిద్దెతోటల్లో ఉంటాయి. సమృద్ధిగా పశువుల ఎరువులు పోసి మొక్కలను పెంచుతాం కనుక మొక్కలు బలంగా ఎదిగి సహజంగా రోగనిరోధకశక్తి కలిగి ఉంటాయి. చీడపీడల సమస్యలు తక్కువ ఉంటాయి.
వాటిలో పేను సమస్య ముఖ్యమైనది. పేను అనేది నల్లగా పచ్చగా ఉంటుంది. కంటికి కనిపిస్తుంది. ఆకుల అడుగు భాగంలో చేరి రసాలను పీల్చి ఆకులు ముడుచుకు పొయ్యేలా చేసి మొక్కను ఎదగకుండా చేసి గిడస బారుస్తాయి.
పేనును గమనించాలి.
మొక్కల మీద చీమలు పారడాన్ని గమనిస్తే, పేను ఉందని అర్థం చేసుకోవాలి. ఆకుల అడుగు భాగం చెక్‌ చెయ్యాలి.పేనును చేతి వేళ్లతో నలిపి కూడా నివారణ చెయ్యవచ్చు.పేను సోకిన ఆకులను తెంపి తోట నుండి దూరంలో పారెయ్యాలి. మిగిలిన లేత ఆకుల కింద ఉన్న పేను నివారణకు లీటరు నీటిలో అయిదు మిల్లీ లీటర్ల వేప నూనె బాగా కలిపి నురగ వచ్చే దాకా షేక్‌ చేసి ఆకుల అడుగు భాగంలో స్ప్రే చెయ్యాలి. మొక్క సాంతం తడిసేలా స్ప్రే చెయ్యాలి. నాలుగు రోజుల వ్యవధిలో మరోసారి స్ప్రే చెయ్యాలి. బీర, సోర, కాకర, బెండ, వంగ, పొట్ల, గుమ్మడి వంటి మొక్కల మీద ఎక్కువగా సోకుతుంది.
తెల్లనల్లి 
పేను తరువాత తెల్లనల్లి మరో సమస్య. బెండ, వంగ, మందార, టొమాటో, మొక్కల మీద ఎక్కువ సోకుతుంది. దీన్ని కూడా చేతి వేళ్లతో నలిపి నివారణ చెయ్యాలి. దీనికి ఏ వేపనూనె కూడా అవసరంలేదు.
పచ్చ పురుగులు
చుక్కకూర, పాలకూర వంటి ఆకుకూరల మీద వన్‌ ఇంచ్‌ పొడవు, పెన్సిల్‌ సైజ్‌ పచ్చని పురుగులు వస్తాయి. రాత్రి బయటకు వచ్చి ఆకులను తిని తెల్లవారుతుంటే కిందకు జారుకుంటాయి. ఉదయాన్నే చెక్‌ చేస్తే పురుగులు దొరుకుతాయి. ఏరి అవతల పడెయ్యాలి. అలా వరుసగా రెండు మూడు రోజుల పాటు చెయ్యాలి.
బీర, సొర మొక్కలు పూత దశలోకి రాగానే పిందెలు పండుబారి ఎండిపోయే సమస్య ఎదురవుతుంది. దానికి కొన్ని కారణాలుఉన్నాయి. వాతావరణం సరిగా లేకపోవడం– మొక్కలు ఆరోగ్యంగా లేకపోవడం– పాలినేషన్‌ సరిగ్గా జరగకపోవడం వగైరా కారణాలు.
పువ్వులు పూసే సాయంత్రం వేళల్లో వెళ్లి మగ పువ్వును తెంపి సమీపంలో ఉన్న ఆడపువ్వు కేసరాల మీద మగపువ్వు కేసరాలను సున్నితంగా రుద్దాలి. ఫలదీకరణ శాతంపెరుగుతుంది.
బూడిద తెగులు
ఆకుల మీద బూడిద తెగలు సోకుతుంది. తెగలు సోకిన ఆకులను తెంపి పారెయ్యాలి. పుల్లని మజ్జిగను మిగిలిన ఆకుల మీద స్ప్రే చెయ్యాలి. కొంత కంట్రోల్‌ అవుతుంది.
చీడపీడల నివారణలో చేతిని మించిన సాధనం లేదని గ్రహించాలి.
ఈ విధంగా కొంచెం ఖర్చు కొంచెం శ్రద్ధా శ్రమతో చక్కగా మిద్దెతోటల సాగు చెయ్యవచ్చు. ఇంటిల్లి పాదికీ సరిపడా కూరగాయలను పండ్లను ఉత్పత్తి చేసుకోవచ్చు. మిద్దెతోటల నిర్మాణం విషయంలో సౌందర్య దృష్టి కూడా ఉండాలి. అందంగా తీర్చిదిద్దుకోవాలి. మిద్దె మీద ఓ అందమైన తోటగా మార్చుకోవాలి. ఆయురారోగ్య రహస్యాలు, మిద్దె తోటల్లో దాగి ఉన్నాయి!
– తుమ్మేటి రఘోత్తమరెడ్డి, మిద్దెతోట నిపుణులు

ప్రకృతికి సంక్షిప్త రూపం మిద్దె తోట!

ప్రకృతికి మనిషికి ఎటువంటి సంబంధం కలిగి ఉంటుందో, మిద్దెతోట కూడా అటువంటి సంబంధాన్ని తిరిగి కలిగిస్తుంది.
ప్రకృతికి దూరమై పలువ్యాధులకు దగ్గరైన ఆధునిక సమాజానికి మిద్దె తోట సరైన ఆయురారోగ్య పరిరక్షణా సాధనం.
ఇలా చెప్పుకుంటూ పోతే మిద్దెతోటల సాగు వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని తెలుస్తుంది.

నిర్వహణ సులభం
మిద్దెతోట నిర్వహణ చాలా కష్టం అని కొందరు భావిస్తున్నారు. కానీ, అది నిజం కాదు.
మిద్దెతోట లేదా పెరటి తోట చాలా సులభంగా చెయ్యగల పని.
సుమారు రోజూ ఒక అర గంటసేపు పనిచేసినా సరి పోతుంది.
ఇంటికి సరిపడా కూరగాయలను పండ్లను ఉత్పత్తి చేసుకోవచ్చు.
ఇంటిపంటల రుచి అమోఘమైన రుచి. ఏ రోజు ఉత్పత్తిని ఆ రోజే వాడుకోవడం వల్ల వాటిలోని సంపూర్ణ పోషకాలు మనకు అందుతాయి.
ఎంతో విలువైన జీవశక్తి పూరితమైన ఉత్పత్తి అది.
జీవశక్తి పూరితమైన ఆహారమే మనల్ని బలోపేతం చేస్తుంది. మనం ఎంత బలంగా ఉంటే, మనకు అంతగా రోగనిరోధకశక్తి ఉంటుంది. వ్యాధులకు దూరంగా ఉంటాం.

హైదరాబాద్‌ మహానగరం - మిద్దెతోటల చరిత్ర
క్రీస్తు శకం1667 నాటికే గొల్లకొండ కోట భవనాల మీద తాని తోటలను చూసాను అని ’టావెర్నియర్‌’ అనే యాత్రా చరిత్రకారుడు రాసాడు. ‘హీనా మహల్‌ ఆర్చీల మీద అంత పెద్దపెద్ద వృక్షాలను ఎలా పెంచారో ఆశ్చర్యం కలిగించింది’ అని రాసాడు. నగరాల నిర్మాణం ప్రారంభం అయిన నాటి నుంచే, స్ధలాల కొరత ఏర్పడి మిద్దెల మీద తోటల నిర్మాణం ప్రారంభం అయింది.
సిమెంటు రింగులూ బాగుంటాయి.

ఇటుకల మడుల తరువాత మరో ప్రత్యామ్నాయం సిమెంట్‌ రింగులు లేదా గూనలు అని కూడా అంటారు. పూర్వం చేద బావులు పూడి పోకుండా ఉండటానికి వాడేవారు. వాటిని కూడా మన మిద్దెతోటల మడులకు ప్రత్యామ్నాయంగా వాడవచ్చు. వాటి వల్ల కాస్తా మిద్దె తోట నిర్మాణ పనిదినాలు– రిస్కు కూడా కొంత తగ్గుతాయి. ఈ రింగులకు కూడా అడుగున గుండ్రని బిళ్లలు వేసి వాటి కింద ఫీటు ఎత్తు ఇటుక కాళ్లను నాలుగు పెట్టి రింగులను కూర్చుండబెట్టి సిమెంటుతో అతుకుతారు– ఇదంతా వారినే చెయ్యమని అడగాలి. వేరే వారు అవి తేలేరు.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top