అమ్మ ప్రేమకో నూలుపోగు | You can buy all the gifts for Mothers | Sakshi
Sakshi News home page

అమ్మ ప్రేమకో నూలుపోగు

May 9 2026 5:58 AM | Updated on May 9 2026 5:58 AM

You can buy all the gifts for Mothers

మే 10 మదర్స్‌ డే ప్రత్యేక కథనం

చిన్నప్పుడు అమ్మ మన చేయి పట్టుకుని బజారుకు తీసుకెళ్లి ఎన్నో కొని పెట్టి ఉంటుంది. మనం అమ్మకు ఏదైనా కొని పెట్టి ఎంతకాలం అయ్యింది? అమ్మ ఏమీ అడగదు... పిల్లలకు ఇబ్బంది అని. కాని చిన్నప్పుడు మన ప్రతి ఇబ్బందిని వెయ్యి కళ్లతో చూసి దూరం చేసి ఉంటుంది. మే 10 మదర్స్‌ డే. ఇక్కడున్న బహుమతులన్నీ మీరు అమ్మకు ఇవ్వొచ్చు. అన్నీ కలిపినా పదీ పదిహేను వేలు మించవు. అమ్మ ప్రేమ ముందు ఆ విలువ దిగదుడుపు కదూ.

1. ఎలక్ట్రికల్‌ హాట్‌ వాటర్‌ బ్యాగ్‌
మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పితో అమ్మ రాత్రిళ్లు నిద్రపోదు. కాపడం పెట్టుకోవడానికి గ్యాస్‌ మీద నీళ్లు కాచి పొయ్యి దగ్గర నిలబడే ఓపిక ఉండదు. మనందరం ఆమె ఇంటి సభ్యులమే. కాని ఎవరు ఏ పనిలో ఉన్నారో అని అమ్మ డిస్ట్రబ్‌ చేయదు. మౌనంగా నొప్పులు భరిస్తుంది. ఆమెకు ఈ హాట్‌ వాటర్‌ బ్యాగ్‌ కానుకగా ఇస్తే ఎంత బాగుంటుంది. ఈ బ్యాగ్‌ను అయిదు నిమిషాలు ఛార్జ్‌ చేస్తే ఆరు గంటలు వేడిగా ఉంటుంది. రాత్రి పక్కలో పెట్టుకుంటే వెన్ను నొప్పి మాయం, హాయిగా నిద్ర. ‘వీడు నా నొప్పిని గుర్తుపెట్టుకున్నాడు’ అమ్మ తృప్తి పడితే ఎంత సంతోషం! 
వెల: రూ.300 నుంచి.

2. నాన్‌–స్లిప్‌ స్లిప్పర్స్‌ + బాత్‌రూమ్‌ హ్యాండిల్‌ బార్‌
‘అమ్మా జాగ్రత్త‘ అని ఫోన్ లో చెప్తాం కానీ బాత్‌రూమ్‌లో జారి పడితే లేపడానికి ఉండం. ఈ స్లిప్పర్స్‌ వేసుకుంటే తడి నేల మీద కూడా జారదు. గోడకి ఒక హ్యాండిల్‌ బార్‌ బిగిస్తే పట్టుకుని లేవొచ్చు, అమ్మ కోసం అన్నీ చెక్‌ చేసుకుంటూ ఉండాలి. అమ్మ నిద్ర పోయే ముందు ఆమె పాదాలు నొక్కుతూ కూర్చునే టైమ్‌ ఉండటం లేదు. కనీసం ఈ స్లిప్పర్స్‌తో అయినా కొంత పరిహారం చేసుకోవచ్చు. 
వెల: రూ.800 నుంచి

3. బిగ్‌ బటన్‌ ఫోన్‌ విత్‌ ఎస్‌.ఓ.ఎస్‌
స్మార్ట్‌ఫోన్‌ ఇస్తే అమ్మకి కన్ ఫ్యూజన్‌. లాక్‌ తియ్యడం, వాట్సాప్‌ చేయడం... ఒక్కోసారి రాంగ్‌ నంబర్‌కి కాల్‌ వెళ్తుంది. అదే ఈ ఫోన్ లో అయితే నంబర్లు పెద్దగా కనిపిస్తాయి. పైగా మూడు ఫోటో బటన్లు ఉంటాయి. మన ఫోటో నొక్కితే డైరెక్ట్‌గా మనకే కాల్‌ వస్తుంది. ఎమర్జెన్సీ ఎస్‌ఓఎస్‌  బటన్‌ నొక్కితే అయిదు నంబర్లకి కాల్, మెసేజ్‌ వెళ్తుంది. అమ్మకు మనం గుర్తు పెట్టుకుని ఫోన్‌ చేయకపోయినా అమ్మ మనల్ని గుర్తు పెట్టుకొని ఫోన్‌ చేయడానికి ఇదే మంచి కానుక. 
వెల: 1200 నుంచి.

4. రీడింగ్‌ గ్లాసెస్‌
అమ్మకు కంటి పరీక్షలు చేయిస్తూ ఉండాలి. ఆమెకు కొత్త అద్దాలు మార్చి ఎంత కాలం అయ్యింది? మంచి రీడింగ్‌ గ్లాసులు కొని పెడితే ఆమె చదువుకునే గీత, రామాయణం స్పష్టంగా కనపడతాయి. న్యూస్‌పేపర్‌ హాయిగా చదువుకోవచ్చు. టీవీ సీరియల్‌ కంటే ఈ పుస్తకం మనశ్శాంతి ఇస్తుంది, టైమ్‌పాస్‌ అవుతుంది. చిన్నప్పుడు ఒళ్లో కూర్చోబెట్టుకుని నీతి కథలు, రాముడి కథ చెప్పి నిద్రపుచ్చింది. ఇవాళ మనం ఇచ్చిన కళ్లజోడు ఆవిడకి కథల పుస్తకాలు చదివేందుకు ఉపయోగపడి నిద్ర పుచ్చుతాయి. 
రూ. 500 నుంచి.

5. వాకింగ్‌ స్టిక్‌ విత్‌ ఎల్‌.ఇ.డి. లైట్‌ ప్లస్‌ సీట్‌
ఒక వయసుకు వచ్చాక గుడికి వెళ్లాలన్నా, మార్కెట్‌కి వెళ్లాలన్నా ‘తోడు ఎవరున్నారు‘ అనే భయం అమ్మకు. ఈ స్టిక్‌ పట్టుకుంటే ఆసరాగా ఉంటుంది. అలిసిపోతే మడత విప్పి సీట్‌ మీద కూర్చోవచ్చు. రాత్రి కరెంట్‌ పోయినా ఎల్‌ఇడి లైట్‌ వెలిగిస్తే దారి కనపడుతుంది, కాలు జారదు. ‘అమ్మా, నువ్వు నడవలేవులే‘ అని ఇంట్లో కూర్చోబెట్టే బదులు ‘ఈ స్టిక్‌ పట్టుకో, నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళు‘ అని ధైర్యం ఇస్తే అదే అసలైన గిఫ్ట్‌. 
రూ. 1000 నుంచి.

6. మెడిసిన్‌ ఆర్గనైజర్‌ బాక్స్‌ విత్‌ అలారం
షుగర్, బీపీ, కీళ్ల నొప్పులు... రోజుకి నాలుగు రకాల మాత్రలు. ‘వేసుకున్నానో లేదో‘ అని అమ్మ కన్ ఫ్యూజ్‌ అవుతుంది. ఒకోసారి రెండుసార్లు వేసుకుంటుంది. ఈ బాక్స్‌లో ఏడు రోజుల మందులు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి లెక్కన విడివిడిగా సర్దొచ్చు. టైమ్‌కి అలారం మోగితే తిప్పలు లేకుండా వేసుకుంటుంది. మనకు జ్వరం వస్తే అర్ధరాత్రి లేచి మరీ మాత్ర వేసిన అమ్మకు ‘అమ్మా, నీ ఆరోగ్యం నాకు గుర్తుంది‘ అని చెప్పే కానుక ఇది.
 రూ.700 నుంచి.

7. ఆటోమేటిక్‌ బ్లడ్‌ ప్రెషర్‌ మానిటర్‌
‘తలనొప్పిగా ఉంది... కళ్లు తిరుగుతున్నాయి’... అని అమ్మ అంటే వెంటనే హాస్పిటల్‌కి పరుగెత్తక్కర్లేదు. చేతికి కట్టి బటన్‌ నొక్కితే 30 సెకన్లలో బి.పి, పల్స్‌ రీడింగ్‌ ఇస్తుంది. డాక్టర్‌కి ఫోన్ లో చెప్పొచ్చు, వైద్య సలహా తీసుకోవచ్చు. చిన్నప్పుడు మనం జారి పడితే అమ్మ గుండె వేగం పెరిగేది, ఇవాళ ఆవిడ గుండె లయ తప్పకుండా చూసే బాధ్యత మనది. ‘అమ్మా, నీ గుండె చప్పుడు నాకు వినపడుతుంది, ఇదిగో మిషన్‌ పెట్టి చూస్తున్నా’ అని భరోసా ఇవ్వొచ్చు.
 వెల: రూ.1500

8. మెత్తటి కాటన్‌ నైటీలు – 2 జతలు
అమ్మ ఇంట్లో వేసుకునే బట్టల మీద ఎప్పుడైనా దృష్టి పెట్టామా? చిరిగిపోయిన, వెలిసిపోయిన, బిగుతుగా ఉండే నైటీతోనే రాత్రిళ్లు నిద్రపోతుంది. ‘నాకు కొత్త బట్టలేందుకురా, ఉన్నవి చాల్లే‘ అంటుంది. కానీ మెత్తటి, లూజ్‌గా, చెమట పీల్చే కాటన్‌ నైటీ వేసుకుంటే ఆవిడకి హాయిగా నిద్రపడుతుంది. ముఖ్యంగా వేసవిలో. లేత రంగు, పెద్ద సైజు, ముందు జిప్‌ లేదా బటన్స్ ఉన్న రెండు జతల నైటీలు కొనివ్వండి. చిన్నప్పుడు స్కూల్‌ యూనిఫాం మాసిపోకుండా, మడత నలగకుండా అమ్మే ఇస్త్రీ చేసి వేయించేది. ఇవాళ ఆవిడ సౌకర్యంగా ఉండటానికే అమ్మ ప్రేమకో నూలుపోగు.  
వెల: రూ.1200 నుంచి 2 జతలకి.

కె.

 

Advertisement
 
Advertisement
Advertisement