
రక్త పిపాసి తలసేమియా
విలువైన వైద్యం చేయించుకోలేక అవస్థలు పడుతున్న బాధితులు
ఉమ్మడి జిల్లాలో 179మంది
నేడు ప్రపంచ తలసేమియా డే ( World Thalassemia Day 2025)
రెడ్‌క్రాస్ దినోత్సవం (World Red Cross and Red Crescent Day)
కొందరు చిన్నారులు తల్లిపాలు తాగే వయస్సులో రక్తాన్ని ఎక్కించుకుంటూ తల్లడిల్లుతున్నారు. బడికి వెళ్లాల్సిన సమయంలో రక్తనిధి కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. చాక్లెట్లు చప్పరించాల్సిన నోటితో చేదు మందు బిల్లలు తింటున్నారు. తోటి చిన్నారులు ఆనందంగా ఆడుకుంటుంటే చూస్తూ ఉండటం తప్ప ఏమి చేయలేని నిస్సహాయస్థితి వారిది. అలసట, ఆయాసాల మధ్య ప్రాణాంతక వ్యాధి తలసేమియా బాధితుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. ఉమ్మడి జిల్లాలో 179 మంది చిన్నారుల సంతోషాన్ని ఇది దూరం చేస్తోంది. అయితే వారి ఆయుష్షు పెంచే బాధ్యతను జిల్లా జనరల్ ఆస్పత్రి, రెడ్‌క్రాస్ తీసుకుంది.
రక్తం ఎక్కించాల్సిందే..
తలసేమియా జన్యు సంబంధిత వ్యాధి. వ్యాధి సోకిన వారికి వారం, పదిహేను రోజులకు ఒకసారి రక్తాన్ని ఎక్కించాల్సిందే. లేకపోతే వారి ప్రాణాలకు ముప్పు ఏర్పడే పరిస్థితి ఉంది. ఈ వ్యాధిగ్రస్థుల్లో హిమోగ్లోబిన్ ఉత్పత్తి శరీరానికి అవసరమైనంత ఉండదు. ఒకవేళ ఉత్పత్తి అయినా ఎక్కువ కాలం ఉండదు. 2018లో తలసేమియాను ఆరోగ్యశ్రీ పథకంలో విలీనం చేయడం వల్ల బాధితులకు ప్రతి నెల మందులను జనరల్ ఆస్పత్రి నుంచి ఇస్తుంటే.. రక్తం మాత్రం రెడ్‌క్రాస్ నుంచి అందిస్తున్నారు.
ఇదీ చదవండి: World Ovarian Cancer Day : సైలెంట్‌గా..స్త్రీలకు గండంగా!
వ్యాధి లక్షణాలు..
తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించే అవకాశం ఉంది. చిన్నారులు ఎదుగుతున్న కొద్దీ వ్యాధి బయటపడుతుంది. వ్యాధి బారినపడిన పిల్లలకు రక్తహీనత మొదలై జీర్ణశక్తి మందగిస్తుంది. ముఖం పాలిపోవటం, ఎదుగుదల లేకపోవడం, హుషారు తగ్గడం, నీరసించి పోవడం వంటి లక్షణాలు కని్పస్తాయి. కీళ్ల నొప్పులు, కడుపు నొప్పి ప్రారంభమై, మూత్రం పసుపు వర్ణంతో వస్తోంది.
ఇదీ చదవండి: వాడిన నూనెను ఇంత బాగా క్లీన్ చేయొచ్చా.. సూపర్ ఐడియా!
పరీక్షలు చేయించు కోవాలి
ఈ వ్యాధి బారిన పడినవారు పసువు రంగులో మూత్ర విసర్జన చేస్తుండటం వల్ల దీనిని తల్లిదండ్రులు పచ్చకామెర్లుగా భావిస్తుంటారు. అవగహన లేమి కారణంగా పచ్చ కామెర్లకు చికిత్స అందిస్తారు. పైలక్షణాలు పిల్లల్లో ఉంటే జనరల్ ఆస్పత్రిల్లో పూర్తిస్థాయి పరీక్షలు చేయించి చికిత్స చేయించుకోవాలి.