అలాంటి వారి హృదయాల్లో పరమేశ్వరుడు కొలువు తీరి ఉంటాడు! | Supreme Lord resides in the hearts of those who have a pure heart | Sakshi
Sakshi News home page

అలాంటి వారి హృదయాల్లో పరమేశ్వరుడు కొలువు తీరి ఉంటాడు!

Jun 4 2025 3:00 PM | Updated on Jun 4 2025 3:00 PM

Supreme Lord resides in the hearts of those who have a pure heart

ఆత్మ శుద్ధి 

నిర్మలమైన హృదయం కలిగి ఉండి, మత్సరభావం లేకుండా, ప్రశాంత చిత్తంతో ఎల్లవేళలా సృష్టిలోని సమస్త జీవుల పట్ల స్నేహభావం కలిగి ఉంటూ, ఇతరులతో సంభాషణల సమయంలో ప్రియంగా మాట్లాడేవారి హృదయాలలో పరమేశ్వరుడు కొలువు తీరి ఉంటాడని విజ్ఞులు చెబుతారు. ‘కావాలని మనస్సులోని ఆలోచనలను పాపకర్మలు చేయడం వైపుకు మరల నీయకుండా, చెడ్డ పనులను తలపెట్టక, ధర్మమార్గాన్ని ఎన్నడూ విడిచి పక్కదోవ పట్టకుండా చూసుకుంటూ, చెడ్డపేరు తెచ్చిపెట్టే పనుల జోలికి వెళ్ళకుండా, ఇరుగుపొరుగున అందరూ తమను మెచ్చుకునే పద్ధతిలో జీవనం సాగించే వ్యక్తులు దేవతలతో సమానమైనవారే అవుతారని, వారిలో ఇంకేమి తక్కువని అలా అనకుండా ఉండగలం?’ అని వెన్నెలకంటి సూరన రచనయైన ‘ఆంధ్ర శ్రీ విష్ణుపురాణము’ ప్రశ్నించి చెప్పింది. పుణ్యానికైనా, పాపానికైనా, సుఖానికైనా, దుఃఖానికైనా మనిషి చేసే అలోచనలే ముఖ్యం కాబట్టి, ప్రయత్న పూర్వకంగా మనసును చెడు ఆలోచనల వైపుకు మళ్ళకుండా చూసుకోవడం మనిషికి అవసరం అన్నది పై మాటల సారాంశంగా భావించవచ్చు. సరిగా ఈ ఆలోచననే నొక్కి చెప్పినట్లుగా, బుద్ధిలో సందేహము, నిర్మలత్వము లేకుండా ఆచరించబడే కర్మల నిష్ప్రయోజకత్వాన్ని ఎఱయకవి రచించిన ‘సకలనీతికథా నిదానము’ ప్రథమాశ్వాసములోని ఈ కింది తేటగీతి పద్యం తేలికైన మాటలలో చెప్పింది.

చిత్తశుద్ధి లేక చేసిన జపమును
తపము హోమవిధియు దానములును
దేవతార్చనములు భావింప నిష్ఫల
మట్లుగాన వలయు నాత్మ శుద్ధి. 
మనసు నిర్మలంగా ఉండడం, చేసే పనియందు లగ్నమై ఉండడం – కార్యాచరణలో ఈ రెండూ చాలా ముఖ్యమైనవని తెలుసుకోవాలి. ఏకాగ్రచిత్తంతో చేయని ఏ పని కూడా సరైన ఫలితాలను ఇవ్వదు. మనసులో నిర్మలత్వం లేని దానము, దేవతార్చన కూడా నిష్ఫలమే అవుతాయి. అందువలన మనసును – అంటే ఆత్మను, బుద్ధిని నిర్మలంగా ఉంచుకోవడం ఎంతైనా అవసరం అని పై పద్యం సారాంశం. సువాసనలు వెదజల్లే పూవులను పూచే మొక్కలకు, రుచికరమైన పండ్లను ఫలించే చెట్లకు, మూలాలు భూమి పొరలలోని మట్టిలో నిక్షిప్తమై ఉన్నట్లుగా, ఇహపరాలలో మనిషికి ఆధ్యాత్మిక సౌఖ్యాలను అందించే పుణ్యానికి మూలాలు నిర్మలమైన చిత్తంతో ఈ భువిపై జీవనంలో ఆచరించే సత్కర్మలలోనే ఉంటాయన్నది కాదనలేని నిజం.
– భట్టు వెంకటరావు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement