మొదటి ట్రాన్స్‌జెండర్‌ ఫొటో జర్నలిస్ట్‌ కథ చెప్పే క్లిక్‌

Story Of India First Transgender Photojournalist In India - Sakshi

ఇండియాలో ఫస్ట్‌ ట్రాన్స్‌జెండర్‌ ఫొటో జర్నలిస్ట్‌గా జోయా థామస్‌ లోబో ఇటీవల వార్తల్లో నిలిచారు. ముంబైలో ఉంటున్న 27 ఏళ్ల జోయా యాచకురాలి నుంచి ఫొటోజర్నలిస్ట్‌గా ఎలా మారిందో తెలుసుకుంటే సాధనమున ఎవరికైనా ఏ పనైనా సాధ్యమే అనిపించకమానదు.  ‘రకరకాల జీవన శైలులను బంధించడానికి నా కెమెరాతో వీధుల్లో నడవడం అంటే నాకు చెప్పలేనంత ఇష్టం’ అంటుంది జోయాను కదిలిస్తే. 

‘చిత్రం’గా మలుపు
ఇంట్లో చుట్టుపక్కలవారి నిరాదరణకు గురైన జోయా 18 ఏళ్ల వయసులో తన కుటుంబంనుంచి బయటకు వచ్చి, ముంబైలోని తన లాంటివారిని వెతుక్కుంటూ వెళ్లింది. కొంతమంది హిజ్రాల బృందంతో కలిసి, వారితో చేరి స్థానిక రైళ్లలో యాచించేది. ప్రతీ ఒక్కరినీ అవకాశాలు పలకరిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకున్నవారే విజేతలుగా నిలుస్తారు. అలాంటి విజేతల జాబితాలో జోయా నిలుస్తుంది. ‘‘2018లో ఒక రోజు నా జీవితం అకస్మాత్తుగా మలుపుతీసుకుంది. ఒక షార్ట్‌ఫిల్మ్‌ డైరెక్టర్‌ ట్రాన్స్‌జెండర్‌ నటుల కావాలని వెతికారు. నటులు ఎవరూ లేకపోవడంతో నాకు అందులో ఓ పాత్ర పోషించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత మరో చిత్రం ట్రాన్స్‌జెండర్ల సమస్యల మీద తీశారు. అందులోనూ నటించాను’’ అని తనకు వచ్చిన అవకాశం గురించి ఆనందంగా వివరిస్తుంది జోయా. ఆ సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమం లో కుటుంబాలు, సమాజం ట్రాన్స్‌జెండర్స్‌ని దూరంగా ఉంచడం అన్యాయమని పలువురు వక్తలు ప్రసగించారు. అప్పుడు జోయా తను ఎదుర్కొన్న సమస్యలను సభాముఖంగా వివరించింది. ఆమె ఉచ్ఛారణ ఆకట్టుకునే విధంగా ఉండటంతో స్థానిక పత్రికా సంపాదకుడు ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌గా ఉద్యోగావకాశం ఇచ్చాడు. అలా మొదటిసారి పత్రికా ఆఫీసులో అడుగుపెట్టింది జోయా. అక్కడ ఉపయోగించే కెమెరాలు ఆమెను విపరీతంగా ఆకట్టుకున్నాయి. 

సాధనమున ఫొటోగ్రీఫీ
కొన్ని నెలల్లో సాధన చేసి, సన్నివేశాన్ని కళ్లకు కట్టే క్లిక్‌ను ఔపోసన పట్టింది. కిందటేడాది ఏప్రిల్‌ లాక్‌డౌన్‌ సమయంలో ముంబైలోని బాంద్రా స్టేషన్‌ సమీపంలో చిక్కుకున్న వలస కార్మికుల నిరసనల ఫొటోలను అన్ని పత్రికలు కవర్‌ చేశాయి. అందులో జోయా తీసిన ఫొటోలు ఎంతోమంది ప్రశంసలు అందుకున్నాయి. జోయా ఓ కెమరా తీసుకొని, కరోనా మహమ్మారి మధ్య తన పని కోసం కష్టపడుతూ తిరిగింది. ‘ముందు జర్నలిజం గురించి చాలా తక్కువ తెలుసు. కెమెరాతో వర్క్‌ చేస్తున్నప్పుడు సంఘటనలను ఎలా ఒడిసిపట్టుకోవాలో, వార్తలో ఫొటో ప్రాధాన్యత ఎంతో వర్క్‌ చేస్తున్నప్పుడు నెమ్మదిగా అర్ధమైంది’ అంటూ తను నేర్చుకున్న పని గురించి వివరిస్తుంది.

యాచన డబ్బుతో కెమెరా
సాధనకు మరింత మెరుగులు పెట్టాలంటే అందుకు తగిన వనరులు కూడా ఉండాలి. ‘‘సొంతం గా నా దగ్గర ఒక కెమరా ఉండాలనుకున్నాను. కానీ, అంత డబ్బు నా దగ్గర లేదు. ఫ్రీలాన్సింగ్‌ జాబ్‌కి పెద్ద ఆదాయమూ లేదు. అందుకే, రైళ్లలో యాచిస్తూనే ఉండేదాన్ని. అలా వచ్చిన డబ్బు నుంచి కొంత మొత్తాన్ని దాచిపెట్టేదాన్ని. కానీ, అది కూడా చాలా తక్కువ. 2019 దీపావళి సమయంలో మాత్రం డబ్బు కోసం చాలా కష్టపడ్డాను. అలా వచ్చిన దానితో చివరికి నికాన్‌ డి–510ను కొన్నాను’’ అంటూ జోయా తన పోషణతో పాటు కెమెరా కొనుగోలుకోసం పడిన కష్టాన్ని తెలియజేస్తుంది. 

ఒక్క క్లిక్‌తో కథ
స్కూల్‌ దశలోనే వదిలేసిన చదువు. పనిని ఎలా అర్ధం చేసుకుంటారు అని ఎవరైనా అడిగితే– ‘నేను పనిలోకి వెళ్లేటప్పుడు జర్నలిస్ట్‌ అడిగే ప్రశ్నలు, దానికి సరైన సమాధానం చెప్పగలిగే ఫొటో తీయడంపై దృష్టి పెడతాను. ఒక కథ చెప్పగలిగే ఫొటో ప్రయత్నిస్తాను. వలసకార్మికుల చిత్రాలకు మంచి ప్రశంసలు వచ్చాయి. సీనియర్‌ ఫొటో జర్నలిస్టులు నా పనిని మెచ్చుకున్నారు. లైసెన్స్, ఇతర సాంకేతిక విషయాలపై నాకు అవగాహన కల్పించారు. దీంతో నాకు తగినన్ని పనులు వచ్చాయి. డబ్బు గురించి పక్కన పెడితే ఫొటో జర్నలిస్టుగా నా వర్క్‌ని నేను అమితంగా ఆనందిస్తున్నాను. కథల గురించి వెతకనప్పుడు పక్షులు, జంతువుల ఫొటోలు తీస్తాను. ఇటీవల అమరావతి పర్యటనకు వెళ్లినప్పుడు కింగ్‌ఫిషర్‌ను క్లిక్‌ చేయగలిగాను. 

కిందటేడాది వరకు ఆర్థికంగా మార్పేమీ లేదు. రైళ్లలో యాచించవలసి వచ్చేది. లాక్‌డౌన్‌ కావడంతో కెమెరాను కూడా అమ్మాల్సి వస్తుందేమో అని భయపడ్డాను. కానీ, అలా జరగలేదు. నాకు మాట్లాడే అవకాశం వచ్చిన ప్రతిచోటా ట్రాన్స్‌జెండర్స్‌ చేయలేని పని ఏదీ లేదంటూ చెబుతూనే ఉన్నాను. వారి కుటుంబాల నుండి వారిని తిరస్కరించడం మానేస్తే, మంచి విద్య లభిస్తే, మిగ™ éవారిలాగే మంచి జీవితాలను గడుపుతారు. అన్ని ఉదోగ్యాలలో ట్రాన్స్‌జెండర్లు పనిచేస్తారు. యాచించరు’’ అని వివరిస్తుంది జోయా. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top