అక్షర సంక్రాంతి వెలుగులు..

Special Story On Sankranti Festival - Sakshi

తెలుగువారికి ముఖ్యమైన పండుగ సంక్రాంతి. గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి శోభ కనుల పండువగా సాక్షాత్కరిస్తుంది. ప్రతి ఇంటిముంగిట రంగురంగుల రంగవల్లులూ, గొబ్బియలూ కనులవిందు చేస్తాయి. తెలుగుకవులు సంక్రాంతిశోభకు హేతువులైన ముగ్గులను ముచ్చటగా వర్ణించారు. గ్రామీణ రమణీయ శోభను, హరిదాసుల కీర్తనలను, కోడిపందేల ఆర్భాటాలను, గంగిరెద్దుల ఆటలను, బావామరదళ్ల సరసాలను మనోజ్ఞంగా వర్ణించారు. ప్రాచీన, ఆధునిక కవుల సంక్రాంతి వర్ణనలను పరిశీలిద్దాం. 

వేదకాలం నుండి ఆధునిక కాలం వరకు ముగ్గుల ప్రాశస్త్యం కనిపిస్తుంది. సంక్రాంతిని ముగ్గుల పండుగగా భావిస్తారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగ రోజుల్లో వేసే ముగ్గుల్లో ప్రత్యేకత కనిపిస్తుంది. స్త్రీలు కళాత్మకంగా రాతిపిండి ముగ్గులు తీర్చుదిద్దుతారు. ఇంటి ప్రాంగణాన్ని పేడనీళ్లతో శుభ్రం చేసి, సున్నపు పిండితో ముగ్గులు వేస్తారు. పేడ, సున్నంలోని కాల్షియం వల్ల క్రిమి కీటకాలు నశిస్తాయి.  పండుగరోజుల్లో  అమర్చే గొబ్బిళ్లలో ముద్దబంతిపూలు, సంపెంగలు పరిమళభరితంగా సుగంధాలు వెదజల్లుతాయి. హరిదాసుల కీర్తనలు భక్తి పారవశ్యాన్ని కలిగిస్తాయి. తెలుగు లోగిళ్లలో పట్టుపరికిణీలతో పరిగెత్తే కన్నెల కిలకిలారావాలు యువకులను కవ్విస్తాయి. రైతుల లోగిళ్లలో నిండుకొన్న బంగారు ధాన్యపు రాసుల ... కొత్తబెల్లం, మిరపకాయలు రైతుల పంటల పండుగగా సంతోష పారవశ్యాన్ని కలిగిస్తుంది. 

ఆదికవి నన్నయ మహాభారతం ఆదిపర్వంలో పాండవులు... ఇంటికి వస్తున్న సందర్భంలో ఆ వీధులను కస్తూరి, మంచిగంధం కలిపిన నీళ్లతో కళ్లాపి చల్లి శుభ్రపరచి, కర్పూరపు రంగవల్లులు తీర్చిదిద్దారని వర్ణించాడు. శ్రీనాథుడు పలనాటి వీరచరిత్ర లో సంక్రాంతి పండుగ సందర్భంగా నలగామ రాజు కొలువు సుందర ప్రాంగణంలో కర్పూరం కలిపిన కల్లేప చల్లి, కస్తూరితో అలికి ముత్యాలముగ్గులతో తీర్చిదిద్దారని ఉదాత్తంగా వర్ణించాడు. పోతన భాగవతం, బసవ పురాణం శంకసప్తమి, హంసవింశతి వంటి కావ్యాల్లో ముగ్గుల ప్రస్తావన ఉంది. అన్నమాచార్యులు గొబ్బియల వర్ణనలలో నవరత్నాల ముగ్గులు వేసి ముగ్గుల మీద మల్లెపూల గొబ్బియలూ మొగిలిపూల గొబ్బియలూ, సంపెంగపూల గొబ్బియలతో అమర్చినట్లు వర్ణించాడు. భూదేవంతా పెద్ద ముగ్గుల్లో నక్షత్రాల గొబ్బియలతో తీర్చిదిద్దారని ఉదాత్తరమ్యంగా వర్ణించాడు. శ్రీకృష్ణదేవరాయులు ఆముక్తమాల్యదలో వర్ణనా చమత్కారం ‘‘కోరకిత నారికేళ’’......రత్నకుట్టియంబులు దోషన్‌ రాయలకాలం నాటి విలాసవంతమైన సామాజిక జీవనానికి తగినట్లుగా కొబ్బరిచెట్లు ఆకులు రత్నాలగచ్చులో ప్రతిఫలించి పచ్చలతో అలికినట్లు, వాటిపై రాలిన కొబ్బరిమువ్వలు తెల్లగా ముగ్గులు పెట్టినట్లున్నాయని గొప్పగా ఉత్ప్రేక్షించి అప్పటి సంపత్సమృద్ధిని  వర్ణించాడు.

రాయప్రోలు వారు సంక్రాంతి వర్ణనలో ముగ్గుల వర్ణన ముచ్చటగా చేశారు. సంక్రాంతికి గ్రామీణ ప్రజలు బూజు దులిపి పూరి ఇండ్లను వెల్లవేసిన వీధిగోడలు అలికి ముగ్గులనిడిన అరుగులు అందగించెను పల్లెలోనే పండుగ సందర్భంగా అలికి ముగ్గులు పెట్టిన అరుగుల్లో బూజు దులిపి వెల్ల్లవేసిన వీధిగోడల్లో గ్రామీణ సంక్రాంతి శోభ వెల్లివిరుస్తుందని ముచ్చటగా ముత్యాల సరాల ఛందస్సులో చెప్పారు. అభినవ తిక్కన తుమ్మలివారు పరిగపంట కావ్యంలో సంక్రాంతి ముచ్చట్లు, సంక్రాంతి తలపులు ఖండికల్లో తెలుగు నాట గ్రామీణ శోభను రమణీయంగా చిత్రించాడు. రైతుల పండగైన సంక్రాంతి తో రైతు జీవితాన్ని సమన్వయించి సముచితంగా వర్ణించాడు. స్వతంత్ర భారతదేశంలో భూదేవిని నమ్మి కొలుచు కాపుల పొలాలు వరహాల కాపుకాచె– గతం కంటే మిన్నగా ఎకరానికి రెండు పుట్ల ధాన్యం పండుతుందని మెచ్చుకున్నాడు. సంక్రాంతి ఖండికలో సంక్రాంతి లక్ష్మీ శోభను వర్ణిస్తూ గ్రామీణ ప్రాంతపు పైరు పంటలను అలంకరించుకుని, కొసరి నూరిన పచ్చిపసుపు పూత మొగానికి పూసుకుని, మిర్యపు పండు బొట్టు పెట్టుకుని, నునుమంచు తెల్ల చీర సింగారించుకుని కదలివచ్చెను భాగ్యాల కడలివోలె.. మకర సంక్రాంతి లక్ష్మి హేమంత వీధి’’– ప్రకృతిలో శోభను సమన్వయించి సంక్రాంతి లక్ష్మిని అద్భుతంగా వర్ణించాడు. గ్రామీణ సంక్రాంతి సంబరాల్లో జరిగే కోడిపందేలను జాతీయ స్థాయి శౌర్యానికి ప్రతీకలుగా వర్ణించాడు. తెలుగు ముంగిళ్లలో సంక్రాంతి ముగ్గులను మహిళామణుల కళాత్మక దృష్టికి నిదర్శనాలన్నాడు. గొబ్బిముద్దలు తెలుగు తల్లి ధర్మదీక్షా నిరతికి సంకేతాలన్నాడు. వింతలొలికించు కలిసి సంక్రాంతినిట్లు తెలుగుదనమింటినిండ మూర్తీభవించిందని ఆధునిక కవులందరి కంటే మిన్నగా తుమ్మలివారు సంక్రాంతి వైభవాన్ని వర్ణించారు. 

మహాకవి జాషువా సంక్రాంతి పండుగను సమస్త లోకానికి ఆహ్లాదం కలిగించే ‘‘పర్వ రాజ్ఞీమణి’’గా వర్ణించాడు. రేయింబవళ్లు పొలాలు దున్ని స్వేద బంధువులు చిందించి ధాన్యరాశులు పండించిన రైతులకు విశ్రాంతి కలిగించే సంక్రాంతికి నమోవాకాలు సమర్పించాడు. సామాజిక ప్రయోజనాన్ని సంక్రాంతి పండుగతో సమన్వయించారు– సంక్రాంతి కేవలం తెలుగువారి పండుగే కాదు జాతీయ పండుగ. అందుకే కవి సమ్రాట్‌ దిగంతాల ప్రజలకు రాగల సంవత్సరంలో సౌఖ్య సంపదలను, స్వచ్ఛమైన మేధాశక్తులను ప్రసాదించమని శుభసంక్రాంతిని కోరుకుంటున్నాడు. సంక్రాంతి పండుగ సృష్టిలో జీవరాశులన్నింటికీ సంతోషం కలిగించే సెలవురోజు. కనుమ పండుగరోజున పశువులకు విశ్రాంతినిచ్చి అలంకరించి మంచి దాణాతో సంతృప్తి కలిగిస్తారు. జాషువా సంక్రాంతి లక్ష్మిని ప్రతియింట అడుగు విందు ఆరగించి పొమ్మని వేడుకున్నాడు. కరుణ శ్రీ స్వర్ణ సంక్రాంతి ఖండికలో ‘‘కనుల పండువగా పూచెను గుమ్మడిపూలు ఆదిత్య బంగారు ... పాత్రములట్టు’’ సూర్యుడికి ... బంగారుపాత్రల్లో గుమ్మడిపూలు పూచాయన్నాడు. బంగారుపంటలతో పుడమితల్లి పులకించిందనీ, సంక్రాంతికి వచ్చిన ...కొత్తల్లుళ్లూ కూతుళ్లను చూసి తెలుగు తల్లులు పులకించారని వర్ణించాడు. బంతిపూల సోయగాలతో విరాజిల్లుతున్నాయన్నాడు. సంక్రాంతి ముగ్గుల నడుమ గొబ్బెమ్మలు కవితలో అక్కడిక్కడే యతిప్రాసల్లా ఉన్నాయని చమత్కరించాడు. సంక్రాంతికి పూసిన బంతిపూలూ. పండిన మిరపపండ్లు భూమాతకు పసుపు కుంకాల్లా ఉన్నాయని వర్ణించాడు. కరుణశ్రీ భోగిమంటలను బొమ్మల కొలువులను బావా మరదళ్ల సరసాలను కథారమ్యంగా వర్ణించాడు. వీరి వర్ణనలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకాలు.
– డా. పి.వి. సుబ్బారావు, విశ్రాంత ఆచార్యులు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top