ఆటల పాఠాలు

Special Story Of Ruhi Sultana From Kashmir In Family - Sakshi

చాక్లెట్‌ తిన్న తరవాత ఆ రేపర్‌తో సీతాకోక చిలుకను చేసి పుస్తకంలో పెట్టుకున్న బాల్యం గుర్తుందా! మామిడిపండు తిన్న తర్వాత టెంకను శుభ్రంగా కడిగి స్కెచ్‌ పెన్‌తో బొమ్మ గీసిన జ్ఞాపకం ఏటా గుర్తుకు వస్తూనే ఉంటుంది. ఇంకా పెద్దయిన తర్వాత పిస్తా పెంకులతో అందమైన వాల్‌ హ్యాంగింగ్‌ చేసి గోడకు తగిలించుకుంటే అది కలకాలం కంటి ముందు నిలిచే జ్ఞాపకం. ఇక ప్యాకింగ్‌లతో థర్మాకోల్‌ దొరికితే పండగే. ఇవన్నీ బాల్యం మిగిల్చే తీపి గుర్తులుగానే తెలుసు. అయితే ఇవన్నీ పిల్లలకు ఆటలతో చదువు చెప్పే సాధనాలంటున్నారు కశ్మీర్‌కు చెందిన రూహీ సుల్తానా. ఇవి మాత్రమే కాకుండా కశ్మీర్‌లో పండే వాల్‌నట్స్‌ పెంకులను సేకరించి లోపల స్పాంజ్‌ అమర్చి పెంకులను తిరిగి కాయ ఆకారంలో అతికిస్తారామె.

సబ్బుకు చుట్టిన పేపర్‌ కవర్, చిప్స్‌ ప్యాక్‌ చేసిన అల్యూమినియం ఫాయిల్‌ ర్యాపర్‌ కవర్, జ్యూస్‌ తాగేసిన తర్వాత మిగిలిన టెట్రా ప్యాక్, ప్లాస్టిక్‌ బాటిల్‌... దేనినీ వదలరు. కిరాణా దుకాణాలకు వెళ్లి వీటిని సేకరిçస్తారు. స్కూలు పిల్లలతో కలిసి తన ఇంట్లోనే వీటిని శుభ్రం చేస్తారు రూహీ. తర్వాత ఒక్కొక్క దానిని ఒక్కో ఆకారంలో బొమ్మగా మలుస్తారు. రంగులు తాను వేస్తూ, పిల్లల చేత వేయిస్తారు. థర్మాకోల్‌ ను చిన్న పలుకులుగా కత్తిరించి స్కెచ్‌ పెన్‌తో ఒక్కో పలుకు మీద ఒక్కొక్క అక్షరాన్ని రాస్తారు. ప్లాస్టిక్‌ బాటిల్స్‌కు పేపర్‌ అతికించి అక్షరాలను రాసి తాడుకు కట్టి క్లాస్‌ రూమ్‌లో తగిలిస్తారు.

ఆమె స్వతహాగా క్యాలిగ్రఫీ ఆర్టిస్టు కావడంతో అక్షరాలను ఆకర్షణీయంగా రాయగలుగుతారు. స్కూలు ఇలా ఉంటే ఏ పిల్లలైనా ఒక్కరోజు కూడా స్కూలు మానరు. ఆడుకోవడానికి వెళ్లినట్లు రోజూ ఠంచన్‌గా హాజరవుతారు. పాఠం చెప్పడంలో ఆమె చూపించే శ్రద్ధ ఆమెను ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డుకు ఎంపిక చేసింది. ఈ ఏడాది టీచర్స్‌డే సందర్భంగా అవార్డు అందుకున్నారామె. స్వయంగా రాష్ట్రపతి నుంచి అందుకోవాల్సిన పురస్కారాన్ని కోవిడ్‌ కారణంగా వెబినార్‌ ద్వారా జరిగిన కార్యక్రమంలో అవార్డు అందుకున్నారు. 

టీచర్లకు టీచర్‌
రూహీ సుల్తానా... శ్రీనగర్‌ శివారులోని కశీపోరా ప్రభుత్వ పాఠశాల లో టీచర్‌. ప్లేవే మెథడ్‌లో పిల్లలకు పాఠాలు చెప్పడమే అసలైన చదువు అంటారు రూహీ. ‘‘ఈ విధానం నగరాల్లో నివసించే సంపన్నులకు మాత్రమే అందుబాటులో ఉంటోంది. గ్రామీణ విద్యార్థులకు చేరడం లేదు. అది కూడా పేద విద్యార్థులకు అసలు ఇలాంటి బోధన ఉంటుందని కూడా తెలియకనే స్కూలు చదువు పూర్తి చేసుకుంటున్నారు. అందుకే నేను పని చేస్తున్న స్కూల్లోనయినా నా అంతట నేనుగా ఈ ప్లేవే విధానంలో పాఠాలు చెప్పాలనుకున్నాను.

పిల్లలు ప్రతి పదాన్ని స్పష్టంగా, సున్నితంగా పలకడం స్కూల్లోనే నేర్చుకుంటారు. పదాన్ని కచ్చితంగా పలికించడం లాంగ్వేజ్‌ టీచర్‌ బాధ్యత. ఇందుకోసం స్థానిక జానపద గేయాలతోపాటు సినిమా పాటలను కూడా నేర్పిస్తాను’’ అని చెప్పారు రూహీ. ఆమె అంకితభావాన్ని గమనించిన ప్రభుత్వం ఇతర స్కూళ్లలో పని చేసే ప్రభుత్వ టీచర్లకు ప్లేవే విధానంలో పాఠాలు చెప్పడంలో శిక్షణనిచ్చే బాధ్యతను ఆమెకప్పగించారు. అలా ఆమె కశ్మీర్‌ పాఠ్యాంశాల రూపకల్పనలో భాగస్వామి అయ్యారు. ఉత్తమ ఉపాధ్యాయినిగా గౌరవాలందుకోవడం వెనుక ఇంతటి అంకితభావం ఉంది. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top