
పురాణ గాథ ప్రకారం ఒకనాడు పరమశివుడు కైలాసానికి వచ్చినపుడు అతనిని లోనికి వెళ్లనివ్వకుండా ఒక బాలుడు అడ్డగించిన పురాణగాధ మనం విని ఉన్నాం. పార్వతి తన శరీరపు మలినంతో సృష్టించి, ద్వారపాలకునిగా నిలిపిన ఆ బాలుడిపై కోపించిన శివుడు అతడి తలను ఖండించాడు. తన కుమారుని నిర్జీవంగా చూసిన పార్వతి కలత చెంది శివుడిని వేడుకుంది. ఆమెను శాంతింపజేయడానికి, శివుడు ఉత్తర దిశలో నిద్రిస్తున్న ప్రాణి తలను తేవలసిందిగా ఆదేశించి పంపగా, వారు ఒక ఏనుగును ఆ స్థితిలో కనుగొన్నారు. దాని తలను ఆ బాలుడిపై ఉంచి, అతడిని గణేశునిగా తిరిగి బ్రతికించారు.
ఈ కథను మొదటిసారి వినేవారికి, ఇది అసంబద్ధంగా అనిపించి, అనేక ప్రశ్నలను లేవనెత్తుతుంది. శివుడు సర్వమూ తెలిసినవాడు, సర్వవ్యాపి, సర్వశక్తిమంతుడు. భూత భవిష్యత్ వర్తమానాలను చూడగలిగిన శివుడు అంత కోపంగా, కఠినంగా ఎలా ప్రవర్తించగలడు?. రెండవది, ఆ బాలుడు తన కుమారుడే అని అతనికి తెలియదా?. మూడవది, అలా తెలియదు అనుకున్నా, పార్వతి స్నానం చేస్తున్న కారణంగా, కొద్దిసేపు మాత్రమే, ఆ బాలుడు అతడిని ఆపాడు. అంతలోనే శివుడు అంత అసహనానికి ఎందుకు గురయ్యాడు?. ఈ కథను అక్షరాలా తీసుకుంటే, శివుడు కోపిష్టిగా, కఠినాత్ముడిగా, హింసాత్మకంగా, తార్కిక ఆలోచన లేనివాడిగా కనిపిస్తాడు. తన కుమారుని పట్ల అంత క్రూరంగా ఉండే దేవుడు ఇతరులను ఎలా రక్షించగలడని మీరు ఆలోచిస్తారు.
అయితే, ఈ కథలోని అంతరార్థం ఒక అద్భుతమైన విషయాన్ని మనకు సూచిస్తుంది. శివుడు అతీంద్రియమైన చైతన్యానికి సూచిక. శివతత్వం అనేది ఎల్లప్పుడూ శాంతియుతంగా, అంతటా వ్యాపించి ఉన్న ఆత్మ, చైతన్యం. ఈ సమస్త సృష్టిలో అవ్యక్తంగా ఉన్న శక్తి శివుడైతే, వ్యక్తంగా ఉండి, బయటకు కనిపించే శక్తి స్వరూపమే, ప్రకృతియే పార్వతి. ఆమె శరీరపు మురికి, లేదా మలినం అనేది ప్రకృతిలోని వక్రతను, ప్రకృతిలో సహజంగా పేరుకునే అజ్ఞానాన్ని సూచిస్తుంది. స్వచ్ఛమైన నీటితో కలిసిన బురదలాగా ఈ మలినం లేదా అజ్ఞానం అనేది ఆత్మను కప్పివేస్తుంది. పార్వతి ఈ మలినాలలోకి జీవాన్ని ప్రవేశపెట్టింది అంటే బాహ్య ప్రకృతి నుండి జీవాత్మ (జీవాత్మ) అయిన గణేశుడిని సృష్టించింది.
ప్రకృతి (ప్రకృతి), వికృతి (శక్తి వక్రీకరణ) ఒకే పూర్ణత్వంలో భాగాలు. నశించిపోవటం అనేది ప్రకృతిలో భాగం. వ్యర్థాలనుండి తయారైన ఎరువు చెట్టు పెరుగుదలకు తోడ్పడినట్లే, వికృతి అనేది సృష్టిని కాపాడుతూ ఉంటుంది. మరణం సైతం జీవితానికి మద్దతు ఇస్తుంది. మీ శరీరంలోని అనేక కణాలు ప్రతిరోజూ చనిపోతున్నాయి కాబట్టే అక్కడ కొత్త కణాలు పుట్టే అవకాశం ఉంటుంది. దీనిని లేశ అవిద్య అంటారు. కొద్దిపాటి వక్రత, లేదా సాపేక్ష శక్తి అవసరం. మీరు విశ్వచైతన్యపు, ఏకత్వపు లోతుల్లోకి (ధ్యానంలోకి) వెళ్ళినప్పుడు, మీరు ఒక్కరే ఉంటారు. కాని, దాని నుండి ప్రపంచానికి తిరిగి రావాల్సి వచ్చినప్పుడు, కనీసం ‘నేను గొప్ప ధ్యానం చేసాను’ అని చెప్పడానికైనా అక్కడ మరొకరు ఉండాలి కదా. పూర్ణమైన (అలౌకిక) ప్రపంచం నుండి, మీరు సాపేక్ష ప్రపంచానికి రావాలి. ఈ లౌకిక ప్రపంచం ఉండేందుకు, ఆ పూర్ణత్వాన్ని గుర్తించి, కీర్తించేందుకు మీరు లౌకిక ప్రపంచంలోకి రావాలి.
కనిపించే (వ్యక్త) ప్రపంచం, కనిపించని (అవ్యక్త) ప్రపంచమూ రెండూ కలిసి ఉంటాయి. అవ్యక్త ప్రపంచం బయటకు కనిపించే దానిని కీర్తిస్తుంది, కనిపించే ప్రపంచం అవ్యక్తాన్ని కీర్తిస్తుంది అవే శివుడు, శక్తి. పార్వతి స్నానం చేయటం అనేది, ప్రకృతి తాను తన స్వచ్ఛతలో, అంటే చైతన్యంలో కలిసే ప్రయత్నాన్ని సూచిస్తుంది. శివుడు పురుషుడిని సూచిస్తాడు అంటే స్వచ్ఛమైన, అద్వితీయమైన చైతన్యం. అక్కడ ఎటువంటి కల్మషమూ ఉండలేదు. ‘శివుడు బాలుడిని శిరచ్ఛేదం చేయడం’ అంటే అన్ని మలినాలను తొలగించడం తప్ప మరొకటి కాదు. తల అనేది బుద్ధిని సూచిస్తుంది, జ్ఞానాన్ని కనుగొనాలంటే బుద్ధి మారాలి. మీరు ఎప్పటికీ ఆలోచిస్తూనే ఉంటే, ఎప్పటికీ అనుభవాన్ని పొందలేరు. ఆధ్యాత్మిక ప్రయాణం అంటే తల (బుద్ధి) నుండి హృదయానికి, ఆలోచన నుండి అనుభూతికి, అనుభవానికి వెళ్లడం.
ఏనుగు అతిపెద్ద తల కలిగి ఉండి, అపారమైన జ్ఞానాన్ని సూచిస్తుంది. జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలను ఒకేదానిలో దాని తొండంలో కలిగి ఉంది. దాని తొండంతో, అది విషయాలను గ్రహించగలదు. ఆ తొండంతోనే పనులు కూడా చేయగలదు. అంతే కాదు, ఏనుగు తన చెవులను అదేపనిగా కదిలిస్తూ ఉంటుంది. వింటున్న దానికి, చూస్తున్న దానికి మధ్య సామరస్యాన్ని మనకు బోధిస్తుంది, ఇది సమగ్ర జ్ఞానంగా ఉంటుంది. గణేశునికి ఏనుగు తలను ఉంచడం అంటే పూర్తి జ్ఞానాన్ని స్థాపించడం అని అర్థం. అది అడ్డంకులను తొలగించి తెలివిని (బుద్ధి), సాఫల్యాన్ని (సిద్ధి) ప్రసాదించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అదే గణపతి సూత్రం.
అందువల్లే మనం ఇంటి ముఖద్వారం వద్ద గణేశుడిని ఉంచుతాము, ఇది ప్రకృతి, చైతన్యం సమాగమం అయ్యే స్థానాన్ని సూచిస్తుంది. మీరు గణేశుడిని మీ ఇంట్లోకి లేదా హృదయంలోకి తీసుకువచ్చినప్పుడు, విగ్రహం వద్దే ఆగిపోకండి. ఆ రూపం కరిగిపోయి, గణేశుడు మీలో ఉన్నాడని మీరు గ్రహించే వరకు ఆ గణేశతత్త్వాన్ని ధ్యానించండి.
-గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్.