పూర్ణం బూరెలు, బాసుంది, చెన్నా పొడా... ఇలా సులభంగా ఇంట్లోనే చేసుకోండి!

Sankranthi 2022: Poornam Boorelu Basundi Chenna Poda Recipe In Telugu - Sakshi

తెలుగింటి పొరుగింటి రుచులు.. మనకు తెలుగింటి పూర్ణం బూరె ఉండనే ఉంది. నోరూరించే తమిళ పొంగల్‌ తెచ్చుకుందాం. మరాఠీ పూరన్‌పోలీని రుచి చూద్దాం. చెన్నా పొడాను ఒడియాలో పలకరిద్దాం.సార్సో కా సాగ్‌తో చలి నుంచి రక్షించుకుందాం. ఇక... గుజరాత్‌ బాసుంది కప్పు అందుకుందాం. పొరుగింటి పాయసం కోసం ఎదురు చూడద్దు. మన వంటింట్లో ఇవన్నీ వండుకుందాం.

పూర్ణం బూరెలు 
కావలసినవి: మినప్పప్పు – ఒక కప్పు, బియ్యం – రెండు కప్పులు, పచ్చి శనగపప్పు– ఒక కప్పు, బెల్లంపొడి – ఒక కప్పు, పంచదార– ఒక కప్పు, ఏలకుల పొడి – ఒక టీ స్పూను, నెయ్యి – రెండు టీ స్పూన్లు, ఉప్పు – చిటికెడు, నూనె – సరిపడినంత

తయారీ: బియ్యాన్ని, మినప్పప్పును కడిగి నానబెట్టాలి ∙మూడు గంటల తరువాత చిటికెడు ఉప్పు వేసి గ్రైండ్‌ చేయాలి ∙రుబ్బేటప్పుడు నీళ్లు ఎక్కువ కాకుండా జాగ్రత్త పడాలి ∙దోసెల పిండిలాగా మెత్తగా రావాలి కానీ పలుచగా ఉండకూడదు ∙గారెల పిండికంటే కొంచెం వదులుగా ఉండేటట్లు చూడాలి ∙శనగపప్పును కడిగి పది నిమిషాల సేపు నానబెట్టిన తర్వాత ప్రెషర్‌ కుక్కర్‌లో రెండు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించాలి ∙ఉడికిన పప్పులో నీటిని మొత్తం పోయే వరకు వడపోయాలి ∙శనగపప్పు చల్లారిన తర్వాత అందులో బెల్లం పొడి, పంచదార వేసి గ్రైండ్‌ చేసి ఆ మిశ్రమాన్ని చిన్న మంట మీద ఉడికించాలి.

బెల్లం, పంచదార కరిగి, అవి తిరిగి దగ్గరయ్యే వరకు అడుగుకు పట్టకుండా గరిటతో తిప్పుతూ ఉడికించాలి ∙కొద్ది సేపటికి శనగపప్పు, బెల్లం, పంచదార అన్నీ కలిసిపోయి ముద్దయిన తరువాత ఏలకుల పొడి, నెయ్యి వేసి బాగా కలిపి దించేయాలి ∙చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న లడ్డూలు చేయాలి ∙బాణలిలో నూనె వేడి చేసి ఒక్కొక్క లడ్డూను మినప్పిండి మిశ్రమంలో ముంచి నూనెలో వేయాలి ∙పూర్ణాల తయారీలో నైపుణ్యం ఇక్కడే ఉంటుంది ∙లడ్డు నలగకుండా మినప్పిండిలో ముంచి తీసి నూనెలో వేయాలి ∙ఇలా వేసేటప్పుడు మినప్పిండి మిశ్రమం అన్ని వైపులా సమంగా పట్టాలి ∙ఇలా చేస్తే పూర్ణం చక్కటి రౌండ్‌లో చూడడానికి అందంగా ఉంటుంది ∙నూనెలో అన్ని వైపులా సమంగా వేగేటట్లు తిప్పుతూ దోరగా వేగిన తరువాత తీసేయాలి ∙వీటిని మరీ వేడిగా తినకూడదు. కొంచెం అమరిన తర్వాత రుచి ఇనుమడిస్తుంది. 

చెన్నా పొడా
కావలసినవి: 
పనీర్‌– పావు కేజీ, చక్కెర లేదా బెల్లం పొడి – 125 గ్రాములు, ఏలకుల పొడి – అర టీ స్పూన్, బియ్యప్పిండి – అర టేబుల్‌ స్పూన్, జీడిపప్పు – పది (చిన్న పలుకులు చేయాలి), బాదం – పది (సన్నగా తరగాలి), కిస్‌మిస్‌ – పది, వెన్న – ఒక టేబుల్‌ స్పూన్, బేకింగ్‌ సోడా – చిటికెడు (ఇష్టం లేకపోతే మానేయవచ్చు), రవ్వ – ఒక టేబుల్‌ స్పూన్, పాలు– అర కప్పు (అవసరమైతేనే వాడాలి)

తయారీ: 
ఒవెన్‌ను 180 డిగ్రీల సెల్సియస్‌లో వేడి చేసి సిద్ధంగా ఉంచుకోవాలి ∙పనీర్‌ను మెత్తగా చిదమాలి లేదా గ్రేటర్‌లో తురిమి ఒక పాత్రలో వేసుకోవాలి (ఇంట్లో చేసుకున్న పనీర్‌ అయితే చేత్తో చిదిమితే సరిపోతుంది, రెడీమేడ్‌ కేక్‌ అయితే తురమాల్సి ఉంటుంది) ∙ఈ పనీర్‌లో చక్కెర లేదా బెల్లం పొడి వేసి మిశ్రమం మెత్తగా అయ్యే వరకు చేత్తో కలపాలి ∙మిశ్రమం మరీ గట్టిగా ఉన్నట్లనిపిస్తే కొద్దిగా పాలు కలుపుకోవచ్చు.

పనీర్‌ మిశ్రమంలో ఏలకుల పొడి, బియ్యప్పిండి, బేకింగ్‌ సోడా(ఇష్టమైతేనే), రవ్వ, జీడిపప్పు పలుకులు, బాదం పలుకులు, కిస్‌మిస్‌ వేసి కలపాలి. మిశ్రమం చిక్కగా, గరిటె జారుడుగా ఉండాలి ∙చిక్కదనాన్ని బట్టి బియ్యప్పిండి, పాల మోతాదును మార్చుకోవాలి ∙బేకింగ్‌ పాన్‌కి వెన్న రాసి ఈ మిశ్రమాన్ని పోసి, పాన్‌ మొత్తానికి సమంగా పరుచుకునేటట్లు స్పూన్‌తో సర్దాలి ∙ఈ పాన్‌ను ఒవెన్‌లో టోస్ట్‌ మోడ్‌లో పెట్టి 350 డిగ్రీల ఫారన్‌హీట్‌లో అరగంట సేపు బేక్‌ చేయాలి ∙ఒవెన్‌ లేకపోతే ప్రెషర్‌ కుక్కర్‌లో కూడా చేసుకోవచ్చు.

బాసుంది
కావలసినవి: చిక్కటి వెన్న తీయని పాలు – 2 లీటర్లు, జాజికాయ తురుము – ఒక టేబుల్‌ స్పూన్, బాదం పప్పు – పది (సన్నగా తరగాలి), పిస్తా – పది పలుకులు (సన్నగా తరగాలి)
కుంకుమ పువ్వు – చిటికెడు, ఏలకుల పొడి– టీ స్పూన్, చక్కెర – పావు కేజీ

తయారీ: పాలను మందపాటి బాణలిలో పోసి జాజికాయ తురుము, కుంకుమ పువ్వు వేసి అప్పుడప్పుడూ గరిటెతో కలుపుతూ మరిగించాలి ∙పాలు పావు వంతుకి తగ్గిన తర్వాత చక్కెర వేసి కలుపుతూ ఉండాలి ∙చిక్కబడడం మొదలైన తర్వాత తరచూ కలపాలి (కలపకపోతే అడుగు మాడుతుంది) ∙చక్కెర కరిగిన తర్వాత మళ్లీ మిశ్రమం చిక్కబడే వరకు మరిగించి స్టవ్‌ మీద నుంచి దించి పక్కన పెట్టాలి.

చల్లారిన తర్వాత మరొక పాత్రలో పోయాలి ∙మరొక పెనంలో సన్న మంట మీద బాదం పప్పు తరుగు, పిస్తా తరుగు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి ∙చివరగా ఏలకుల పొడి వేసి కలిపి ఆ మిశ్రమాన్ని పాల మిశ్రమంలో వేసి కలిపి ఫ్రిజ్‌లో పెట్టాలి ∙రెండు గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచి తీసిన తర్వాత సర్వ్‌ చేయాలి.

సార్సో కా సాగ్‌
కావలసినవి: 
ఆవ ఆకులు – నాలుగు కట్టలు
పాలకూర – ఒక కట్ట
ఆలివ్‌ ఆయిల్‌ – 5 టేబుల్‌ స్పూన్‌లు
అల్లం – అంగుళం ముక్క (సన్నగా తరగాలి)
వెల్లుల్లి – 6 రేకలు
ఉల్లిపాయలు – రెండు (మీడియం సైజ్‌) పచ్చి మిర్చి – 4 (తరగాలి)
ఉప్పు – రుచికి తగినంత

తయారీ: 
∙ఆకుకూరలను కాడలు లేకుండా వలిచి కడిగి నీరు కారిపోయేటట్లు చిల్లుల పాత్రలో వేసి పక్కన పెట్టుకోవాలి.
∙బాణలిలో నూనె వేడి చేసి అల్లం తరుగు, వెల్లుల్లి రేకలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి మూడు – నాలుగు నిమిషాల సేపు సన్నమంట మీద మగ్గనివ్వాలి.
∙ఆకుకూరలను తరిగి బాణలిలో వేసి కలపాలి.
∙ఉప్పు కలిపి బాణలి మీద మూత పెట్టి మరికొంత సేపు మగ్గనివ్వాలి.
∙ఆకు ఆవిరికి ఉడికి మెత్తబడిన తరవాత దించేయాలి.

∙చల్లారిన తర్వాత ఆకులను మిక్సీలో గ్రైండ్‌ చేయాలి. 
∙మిశ్రమం జారుడుగా అనిపిస్తే మళ్లీ బాణలిలో వేసి మరికొంత సేపు ఉడికించాలి.
∙మిశ్రమం దగ్గరగా వచ్చే వరకు సన్న మంట మీద ఉడికిస్తే సార్సో కా సాగ్‌ రెడీ.
∙ఈ సార్సోకా సాగ్‌లో నెయ్యి లేదా వెన్న వేసుకుని మొక్కజొన్న రొట్టెల్లోకి తింటే చాలా రుచిగా ఉంటుంది.
∙పంజాబ్‌లో ఈ రోజుల్లో అధిక శీతల వాతావరణం ఉంటుంది. ఈ వంటకం దేహాన్ని చలి నుంచి కాపాడుతుంది. 
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top