
నగరంలో ఆరోగ్యంపై అవగాహనతో పాటు కొత్త కొత్త ట్రెండ్స్ పెరుగుతున్నాయి. ఇదే క్రమంలో ప్రస్తుతం హోమ్ జిమ్స్‌కు డిమాండ్ ఊపందుకుంటోంది. ఒకప్పుడు కేవలం సెలబ్రిటీలు, సంపన్నులకు మాత్రమే పరిమితమైన ఇవి ప్రస్తుతం మధ్యతరగతి ఇళ్లలో సైతం సాధారణంగా మారాయి. బ్యాచిలర్ హోమ్స్‌లో, కో–లివింగ్ ఫ్లాట్స్‌లో సైతం నలుగురైదుగురు యువత కలిసి వీటిని ఏర్పాటు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. హోమ్ జిమ్ కాన్సెప్ట్ ఇటీవల కాలంలో నగరంలో స్థిరపడుతోంది.
నగరంలో హోమ్ జిమ్ ట్రెండ్ ఊపందుకోడానికి కోవిడ్ పుణ్యమాని వర్క్ కల్చర్‌లో వచ్చిన మార్పులు, వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఒక కారణమే. ఇంట్లో అధిక సమయం గడపడం అలవాటవుతున్న పలువురు వృత్తి నిపుణులు ఇంట్లోనే వ్యాయామశాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే హోమ్ జిమ్ ఏర్పాటు చేసుకునే ముందు దాని వల్ల కలిగే ప్రయోజనాల నుంచి ప్రతికూలతల వరకూ ఒకసారి బేరీజు వేసుకోవడం మంచిదని ఫిట్‌నెస్ రంగ నిపుణులు సూచిస్తున్నారు.
స్థలం ఉంటేనే ఫలం..
ఒక మోస్తరు హోమ్ జిమ్ ఏర్పాటుకు కనీసం 60–100 చదరపు అడుగుల స్థలం అవసరం అవుతుందని అంచనా. బేసిక్ హోమ్ జిమ్ అయితే 60–80 చదరపు అడుగులు (ఉదాహరణకు బెడ్‌రూమ్ కార్నర్ లేదా బాల్కనీలో) అలా కాకుండా ఫుల్ సెటప్ చేసుకోవాలంటే.. 100–150 చ.అ. (ఒక ప్రత్యేక గది అయితే మరింత మంచిది) అవసరం అవుతుంది.
బడ్జెట్ ఇలా..
హోమ్ జిమ్ బడ్జెట్ వ్యక్తిగత అవసరాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఎంట్రీ లెవల్ హోమ్ జిమ్‌కైతే పెట్టుబడిగా రూ.30,000 నుంచి రూ.50,000 మధ్య సరిపోతుంది. అదే మిడ్ రేంజ్‌లో వెళ్లాలనుకుంటే రూ.50,000 నుంచి రూ.1.5 లక్షలు, పూర్తి సెటప్ కోరుకుంటే రూ.2 లక్షలు నుంచి రూ.5 లక్షల వరకూ (బ్రాండెడ్ ఎక్విప్‌మెంట్‌ను బట్టి మారవచ్చు) వెచ్చించాల్సి ఉంటుంది.
ప్రాథమిక పరికరాలు..
ఇంట్లో జిమ్‌లో ఉండాల్సిన పరికరాల్లో డంబెల్స్ సెట్స్ (రూ.3,000 నుంచి రూ.10,000) రాడ్స్, వెయిట్స్ (రూ.5,000 నుంచి రూ.15,000), బెంచ్ ప్రెస్ (రూ.8,000 నుంచి రూ.20,000) యోగా మ్యాట్, రెసిస్టెన్స్ బ్యాండ్స్ (రూ.1,000 నుంచి రూ.3,000 ), ట్రెడ్‌మిల్ లేదా ఎలిప్టికల్ మిషన్ (రూ.20,000 నుంచి రూ.లక్ష) ఆల్ ఇన్ వన్ మల్టీ జిమ్ మిషన్ (రూ.40,000 నుంచి రూ.1.5 లక్షల వరకు), లాట్ మిషన్ (రూ.15,000 నుంచి రూ.25,000)లు కొనుగోలు చేయాలి.
ప్రతికూలతలు..
సరైన శిక్షకులు అందుబాటులో లేకపోవడం ఒక సమస్య. ఒకవేళ ఇంటికి వచ్చి శిక్షణ ఇచ్చే ట్రైనర్స్‌ను ఎంచుకుంటే వారికి చెల్లించాల్సిన మొత్తం ఆర్థిక భారంగా మారుతుంది.
ఒంటరిగా చేయడం వల్ల సరిపడా మోటివేషన్ దొరకదు. వర్కవుట్స్‌ను వాయిదా వేసే అవకాశం ఎక్కువ.
ఎంత వరకూ చేయాలో, ఏ వర్కవుట్ ఎలా చేయాలో తెలుసుకుని చేయకపోతే కొన్ని ఇబ్బందులు తప్పవు.
అద్దెకు ఉంటున్న ఇళ్లు అయితే ఇంటి యజమానులతో ఇబ్బందులు రావచ్చు. అంతేకాకుండా ఇళ్లు మారే సమయంలో ఈ ఎక్విప్‌మెంట్ భారంగా పరిణమించవచ్చు.
ఇవీ ప్రయోజనాలు..
నగర ట్రాఫిక్‌లో రాకపోకలకు పట్టే సమయం, ఎండ, వాన తదితర వాతావరణ అడ్డంకులు ఉండవు.
జిమ్‌లో పదుల సంఖ్యలో ఉండే ఇతర సభ్యుల మధ్య చేయడం, కొన్ని సార్లు ఎక్విప్‌మెంట్ అందుబాటులో ఉండకపోవడం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
ఒక్క హోమ్ జిమ్‌తో కుటుంబ సభ్యులందరికీ వ్యాయామం చేసే అవకాశం లభిస్తుంది. ఒకరికొకరు ప్రోత్సహించుకుంటూ చక్కని ఆరోగ్యకర వాతావరణానికి దోహదపడుతుంది.
దీర్ఘకాలిక పెట్టుబడిగా దీన్ని చెప్పుకోవచ్చు. నెలవారీగానో, వార్షిక ఫీజు రూపంలోనో చెల్లించాల్సిన జిమ్
మెంబర్‌షిప్ ఖర్చును దూరం చేసుకోవచ్చు. కుటుంబ సభ్యులు, ఒకరిద్దరు సన్నిహితులను కూడా కలుపుకుంటే స్వల్ప కాలంలోనే పెట్టుబడి రికవరీ అయినట్టు భావించవచ్చు.