పర్యావరణహితం.. ప్లాస్టిక్‌ రహితం

Plastic Free LIfe Make Environment Free - Sakshi

గ్రీన్‌లైఫ్‌

వెనకటికి ఒక నక్క భూమి దగ్గర అప్పు చేసిందట. తీసుకున్న అప్పును తీర్చలేకపోయింది. ఇక అప్పటి నుంచి భూమి నుంచి తప్పించుకోవడానికి ఎక్కడెక్కడికో వెళుతుంది. ఎక్కడికి వెళ్లి ఏంలాభం? ఎక్కడ దాక్కున్నా... భూమే కనిపిస్తుంది! పర్యావరణం పట్ల బాధ్యతారాహిత్యం కూడా అలాంటిదే. ఎంత తప్పించుకోవాలని చూసినా, ఎన్ని సాకులు వెదుక్కున్నా... భూమి కనిపిస్తుంది. బాధ్యతారాహిత్యాన్ని ప్రశ్నిస్తుంది. కొందరు మాత్రం భూమాతతో శభాష్‌ అనిపించుకుంటారు. ఆ కోవకు చెందిన మహిళ అహుజ...

ఒకసారి వాడి పారేసే(సింగిల్‌ యూజ్‌) ప్లాస్టిక్‌పై నిషేధం అమల్లోకి వచ్చింది. పర్యావరణప్రేమికులలో హర్షం వ్యక్తం అయింది. ఎంతోమంది, ఎన్నో విధాలుగా వ్యక్తిగత స్థాయిలో పర్యావరణహిత ఉద్యమాలకు, జీవనశైలులకు ఊపిరిపోయడం వల్లే ఇలాంటి నిషేధం ఒకటి సాధ్యం అయింది. ఇలాంటి వారిలో ముంబైకి చెందిన చైట్సీ అహుజ ఒకరు.
మార్కెటర్, ఎర్త్‌ అడ్వోకెట్‌ అయిన అహుజ గత అయిదు సంవత్సరాలుగా ప్లాస్టిక్‌–రహిత జీవనశైలిని అనుసరిస్తుంది.

తాను అనుసరించడమే కాదు మిగిలిన వారిని కూడా తన మార్గంలో తీసుకువెళుతుంది. ‘బ్రౌన్‌ లివింగ్‌’ స్థాపకురాలైన అహుజ దేశంలో తొలిసారిగా ప్లాస్టిక్‌–ఫ్రీ మార్కెట్‌కు శ్రీకారం చుట్టింది. బ్రౌన్‌ లివింగ్‌లో అన్ని ఆర్డర్‌ల ప్యాక్‌లు ప్లాస్టిక్‌ మెటీరియల్‌కు దూరంగా ఉంటాయి. ‘బ్రౌన్‌ లివింగ్‌ అనేది బ్రాండ్స్, కంపెనీలకు సంబంధించిన సేంద్రీయ, పర్యావరణహిత ఉత్పత్తులను విక్రయించే వేదిక మాత్రమే కాదు, మన జీవనశైలిలో బలమైన మార్పు తీసుకువచ్చే నిర్మాణాత్మక విధానం కూడా’ అనే పరిచయ వాక్యాలు ఆకట్టుకుంటాయి. ‘బ్రౌన్‌ లివింగ్‌’ కంపెనీ ద్వారా వచ్చిన ఆదాయాన్ని చెట్లు నాటడానికి సంబంధించిన కార్యక్రమాలకు వెచ్చిస్తారు.

ప్లాస్టిక్‌ వస్తువుల నిషేధంపై అహుజ ఇలా స్పందించారు...
‘ప్లాస్టిక్‌–రహిత ప్రపంచం అనేది రాత్రికి రాత్రి జరిగే అద్భుతం కాదు. ఒక ప్రయాణం మొదలైంది. కొంతమందిగా మొదలైన ప్రయాణం, ఎంతోమందిని కలుపుకుంటూ వెళుతుంది.ఈ ప్రయాణమే ఉద్యమం అవుతుంది. మన జీవనశైలిని పూర్తిగా మార్చివేస్తుంది’ అంటున్న అహుజ ‘ప్లాస్టిక్‌–రహిత జీవన విధానాన్ని అనుసరించడం ఖరీదైన వ్యవహరం’లాంటి అపోహలను ఖండిస్తుంది.

ప్లాస్టిక్‌ బదులుగా ప్రత్యామ్నాయాలకు రూపకల్పన చేసిన కంపెనీలకు ప్రభుత్వం అవసరమై ఆర్థిక సహాయం అందించాలని, సబ్సిడీలు ఇవ్వాలని ఆమె కోరుకుంటుంది. ‘ప్లాస్టిక్‌–రహిత దారి వైపు అడుగులు వేయడానికి ఇప్పుడు ఎన్నో ప్రత్యామ్నాయాలు సిద్ధంగా ఉన్నాయి’ అంటున్న అహుజ ప్లాస్టిక్‌ వాడని కిరాణషాపులకు అండగా ఉండాలని చెబుతుంది. తన ప్రయాణంలో ‘మార్పు అసాధ్యమేమో’ అని కొన్ని సందర్భాలలో అనిపించేది. అంతలోనే ‘మార్పు అనివార్యం కూడా’ అనిపించి తనను పట్టుదలగా ముందుకు నడిపించేది.

పరిమితమైన వనరులతోనే మన పూర్వీకులు రకరకాల మార్గాలలో పర్యావరణహితమైన కార్యక్రమాలకు రూపలకల్పన చేశారు. ఒకసారి వెనక్కి వెళ్లి అలాంటి కార్యక్రమాలు మళ్లీ ఉనికిలో ఉండేలా చూడాలంటుంది అహుజ. ‘బ్రౌన్‌ లెన్స్‌ మెథడ్‌ (ప్రతి ఉత్పత్తిని, పనిని పర్యావరణ దృష్టి కోణం నుంచి చూడడం) అనుసరిద్దాం’ అని పిలుపునిస్తున్న అహుజాకు మర్రిచెట్టు అంటే ఇష్టం.ఆదర్శం.‘బలంగా వేళ్లూనుకుపోయిన మర్రిచెట్టును చూస్తే మహాయోధుడిని చూసినట్లుగా ఉంటుంది. ఎంతో స్ఫూర్తి ఇస్తుంది’ అంటుంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top