మంచి మాట: విడదియ్యరాని శ్రమ | Sakshi
Sakshi News home page

మంచి మాట: విడదియ్యరాని శ్రమ

Published Mon, May 1 2023 12:21 AM

May day: Every day is labor day - Sakshi

శ్రమ నుంచి శ్రామికుల్ని, శ్రామికుల నుంచి శ్రమను ఎలా అయితే విడదియ్యలేమో అలా ప్రపంచం నుంచి శ్రమను, శ్రామికులను విడదియ్యలేం. శ్రమలేందే శ్రామికులు లేరు; శ్రామికులు లేందే శ్రమలేదు; శ్రమ, శ్రామికులు లేందే ప్రపంచం లేదు. మనిషికి ప్రపంచం ఆధారం; ప్రపంచానికి శ్రామికుడు ఆధారం. ప్రతి మనిషికి శ్రామికుడి అవసరం ఉంది; ప్రతిమనిషీ శ్రామికుడు అవ్వాల్సిన అవసరం ఉంది.

మన ఈ ప్రపంచం మనకు ఇవాళ ఇలా ఉందీ అంటే అది శ్రామికులు శ్రమిస్తూనే ఉన్నందువల్ల వచ్చిన ఫలితమే. శ్రమతో శ్రామికులు సృజించిన ఆకృతి ప్రపంచం. శ్రమతో, శ్రమలో శ్రామికుడు జీవనం చేస్తున్నందువల్లే ప్రపంచానికి స్థితి, ద్యుతి ఉన్నాయి. అవి మనకు ఆలవాలమూ అయినాయి. మన మనుగడ సాగేందుకు అవి మనతో, మనకై ఉన్నాయి.

‘శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదు’ అని కవి శ్రీశ్రీ అన్నారు. శ్రమైకజీవనం సౌందర్యమై ప్రపంచం మొత్తానికి సౌందర్యాన్ని తీసుకు వచ్చింది! శ్రమ అన్నదాన్ని లుప్తం చేసి ఊహించుకుంటే ప్రపంచం వికృతంగా ఉంటుంది. శ్రమైక జీవనం అన్నది సౌందర్యం మాత్రమేనా? కాదు. శ్రమైకజీవనం ఈ ప్రపంచానికి లభించిన సౌభాగ్యం కూడా. అనాది గా ప్రపంచం పొందిన ప్రగతికి కారణం శ్రామికుడు. శ్రామికుడు ప్రపంచానికి సౌందర్యప్రదాత. శ్రామికుడు ప్రపంచానికి సౌభాగ్యప్రదాత.

అటువంటి శ్రామికుడికి, అతడి శ్రమకు న్యాయం జరుగుతోందా? అనాదిగానే అది లేదు అన్నది క్షేత్ర వాస్తవంగా మనకు ప్రస్ఫుటంగా తెలుస్తూనే ఉంది.‘మన ప్రపంచంలో చాలా విషయాలు అన్యాయం; / పత్తిని నాటని వాళ్లు శ్రేష్ఠమైన పత్తి బట్టలు కట్టుకుంటారు. / అంతే కాదు పొలంలో పని చెయ్యని వాళ్లు తెల్లటి బియ్యం తింటారు’ అని అంటూ చైనాలోని ఒక అజ్ఞాత యూనాన్‌ జానపద కవి వందలయేళ్ల క్రితమే ఆవేదనను వ్యక్తపరిచాడు. చిందిన చెమట కు అందిన ఫలం చాలని స్థితి ఎప్పటి నుంచో ఉంది. ఈ పరిస్థితి ఇకనైనా మారాలి. శ్రమకు, శ్రామికుడికి తగిన ఫలం దక్కాలి.

‘మేఘాలు తియ్యటి నీరును ఇచ్చినట్టుగా, తేనెటీగలు తేనెను ఇచ్చినట్టుగా నువ్వు పశువుల్లో పాలను సృష్టించావు. అదే విధంగా పగలంతా శ్రమించిన శ్రామికుడికి ధాన్యాదిరూపంలో సంపదను ఇవ్వు’ అంటూ వేదంలో ఒక దైవ ప్రార్థన ఉంది. శ్రామికుడికి న్యాయం జరగాలన్న ఆకాంక్ష కూడా ఎప్పటినుంచో వస్తూనే ఉంది. ఇకనైనా శ్రమకు, శ్రామికులకు న్యాయం సాకారం కావాలి.

ఏడాదిలో ఏ ఒక్కరోజునో శ్రామికుల రోజు అనీ, ఆ రోజున ఏదో హడావిడి చేసేసి, ఉపన్యాసాలు ఇచ్చేసి ఆ తరువాత శ్రామికుల్ని నిర్లక్ష్యం చెయ్యడం ఇక చాలు. ప్రతిరోజూ శ్రామికులకు, శ్రమకు న్యాయం చేస్తూ మనం మన మనుగడను సౌందర్యవంతమూ, సౌభాగ్యవంతమూ చేసుకుందాం. శ్రామికులకు, శ్రమకు గౌరవాన్ని, మన్నను ఇస్తూ మనల్ని మనం గౌరవించుకుందాం; మనకు మనం మన్ననను కలిగించుకుందాం.

ఏ ఒక్కరోజో శ్రామికుల రోజు అవదు. ప్రతిరోజూ శ్రామికుల రోజే. సూర్యోదయంతో మొదలయ్యే ప్రతి దినమూ శ్రామికుల దినమే! శ్రమ అన్నది చిందే దినమే! శ్రమ చిందనిదే, శ్రామికులు పని చెయ్యనిదే ఏ దినమూ గడవదు కదా? ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని అంటూ ఒక్కో పేరుతో ఒక్కో దినం ఉంది. ఏ పేరుతో ఉన్న దినమైనా శ్రమ, శ్రామికుల అభినివేశంతోనే అది దినంగా నడుస్తుంది, గడుస్తుంది. ప్రతిదినమూ శ్రామికుల దినమే!

– రోచిష్మాన్‌

Advertisement
 
Advertisement
 
Advertisement