 
															PC: Saravanan Chandrasekaran
Sankranthi 2022- Indian Young Farmers Forum: సంక్రాంతి అంటే...అచ్చంగా రైతు పండగ. ముద్దబంతిపూలు ముచ్చటగా అతడిని ముద్దాడే పండగ. ఈ రైతు పండగ సందర్భంగా వ్యవసాయాన్ని శ్వాస చేసుకుంటున్న ‘ఇండియన్ యంగ్ ఫార్మర్స్ ఫోరమ్’ గురించి తెలుసుకుందాం...
పట్నం (కోయంబత్తూర్, తమిళనాడు)లో ఉంటున్నమాటేగానీ ప్రదీప్‌కుమార్‌కు తమ కరూర్ గ్రామంలో బీడుపడిన అయిదు ఎకరాల పంటపొలమే గుర్తు వచ్చేది. ఇక అక్కడ ఉండలేక ఊరికి వచ్చేశాడు. ‘ఫుల్‌టైమ్ రైతు’గా మారాడు. విజయవంతమైన రైతుగా తనను తాను నిరూపించుకున్నాడు. స్థానిక సంప్రదాయ జాతులను కాపాడుకోవడానికి ‘కమ్యూనిటీ సీడ్ బ్యాంక్’ కూడా ఏర్పాటు చేశాడు.
కేరళలోని పాలక్కడ్‌కు చెందిన కె.జి.సర్వణన్ అరటి, జామ సాగులో నవీనపద్ధతులను అనుసరించి ప్రభుత్వ దృష్టిని ఆకర్షించాడు. కేరళ ప్రభుత్వం అతడి వ్యవసాయ క్షేత్రాన్ని ఆదర్శవ్యవసాయ క్షేత్రంగా గుర్తించింది. బెంగళూరులో ఉద్యోగం చేసే కైలాస్‌నాథ్‌కు తన స్వగ్రామం నర్సిపురంలో పొలాలు ఉన్నాయి. బెంగళూరును వదిలేసి నర్సిపురంలో స్థిరపడిన కైలాస్ నిర్జీవంగా పడి ఉన్న పంట పొలాలకు మళ్లీ జీవ కళ తెప్పించాడు.
చంద్రశేఖరన్ సర్వణన్‌కు పొలాచ్చిలో చింత, జామ, సపోట...మొదలైన చెట్లతో పదిహేను ఎకరాల ‘ఫుడ్ ఫారెస్ట్’ ఉంది. అక్కడ గడపడం ఆయకు ఎంతో ఇష్టమైన పని. ‘ప్రకృతే ఈ తోటను కాపాడుకుంటుంది’ అంటాడు మురిపెంగా. దేశదేశాల్లోని వ్యవసాయవిధానాల గురించి తెలుసుకోవడంపై ఆసక్తి చూపే చంద్రశేఖరన్‌కు యువత వ్యవసాయంలోకి రావాలన్నది కల. తన కలను నెరవేర్చుకోవడానికి ‘ఇండియన్ యంగ్ ఫార్మర్స్ ఫోరమ్’ను మొదలుపెట్టాడు.

PC: Saravanan Chandrasekaran FB
‘ఫోరమ్’ ఏర్పాటు చేయగానే పోలోమంటూ యూత్ వచ్చి చేరిపోరు కదా! ముందు వారికి నమ్మకం కలిగించాలి. ‘యస్. మేము సాధించగలం’ అనే ఆత్మవిశ్వాసాన్ని కలిగించాలి. అందుకు కొందరు రోల్‌మోడల్స్ కావాలి. ఫోరమ్ ఏర్పాటు చేసిన వెంటనే చంద్రశేఖరన్ అలాంటి వారి కోసం వెదికాడు. ఆ ప్రయత్నం లో పైన ప్రస్తావించిన ప్రదీప్ కుమార్, కైలాస్‌నాథ్,కె.జి. సర్వణన్.... మొదలైనవారు ఎందరో కనిపించారు. వీరు ‘ఫోరమ్’లో చేరిన యువ రైతులకు ధైర్యం చెప్పారు.
తమ వ్యవసాయ క్షేత్రాన్నే బడిగా మలిచి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన యువరైతులకు పాఠాలు చెప్పారు. ‘అచ్చం నేను కూడా మీలాగే భయపడ్డాను. దిగితేనే కదా లోతు తెలిసేది. ఇలా చేసి చూడండి’ అని సలహాలు ఇచ్చారు. నవీన సాంకేతిక జ్ఞానాన్ని పరిచయం చేశారు. ఎన్నో సందేహాలకు సమాధానం చెప్పారు. ఈ ఫోరమ్ ప్రభావంతో పట్నంలో ఏదో ఒక ఉద్యోగం చేస్తున్న యువకులు తమ పూర్వీకుల పంటపొలాలను వెదుక్కుంటూ వస్తున్నారు. సాగుకళలో సక్సెస్ అవుతున్నారు. సమాచారాన్ని పంచుకోవడం కోసం ఫేస్‌బుక్, వాట్సాప్‌లాంటి వేదికలను కూడా ఫోరమ్ ఉపయోగించుకుంటుంది. దేశవ్యాప్తంగా విస్తరించాలనేది ఫోరమ్ లక్ష్యాల్లో ఒకటి.
చదవండి: Bhogi Festival 2022: భోగం వైభోగం.. భోగి పళ్లు ఎందుకు?

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
