తొలి కాన్పు సిజేరియన్‌ చేశారు.. రెండోసారి కూడా తప్పదా?

Gynecology suggestions Is Normal Delivery Possible After Cesarean - Sakshi

నా వయసు 28 ఏళ్లు. రెండేళ్ల కిందట తొలి కాన్పు జరిగింది. బిడ్డ అడ్డం తిరిగిందని చెప్పి, సిజేరియన్‌ చేశారు. ప్రస్తుతం నాకు ఆరో నెల. ఒకసారి సిజేరియన్‌ జరిగితే, రెండోసారి కూడా సిజేరియన్‌ తప్పదని నా ఫ్రెండ్స్‌ చెబుతున్నారు. ఒకసారి సిజేరియన్‌ జరిగితే నార్మల్‌ డెలివరీకి అవకాశం ఉండదా? రెండోసారి కూడా సిజేరియన్‌ జరిగితే ఏవైనా కాంప్లికేషన్స్‌ ఉంటాయా? ఎలాంటి జగ్రత్తలు తీసుకోవాలి? దయచేసి వివరించగలరు.
– సాయిగీత, శ్రీకాకుళం

మొదటి కాన్పు సిజేరియన్‌ అయితే తప్పనిసరిగా రెండో కాన్పు సిజేరియన్‌ ద్వారానే కావాలనేమీ లేదు. కాకపోతే అనేక అంశాలను పరిశీలించిన తర్వాతనే రెండోది నార్మల్‌ డెలివరీకి ప్రయత్నించవచ్చా, లేదా, రిస్క్‌ అనేది ఎంత మేరకు ఉంది అనే అంచనాకు వచ్చి సలహా ఇవ్వడం జరుగుతుంది. సాధారణ కాన్పు కావాలంటే బిడ్డ బరువు ఎక్కువగా లేకుండా ఉండాలి. బిడ్డ తల కిందకు ఉండి, పెల్విస్‌ దారిలోకి ఫిక్స్‌ అయి ఉండాలి. బిడ్డ బయటకు వచ్చే దారి బిడ్డకు సరిపడా వెడల్పుగా ఉండాలి. అంతేకాకుండా, ముందు సిజేరియన్‌ కాన్పుకి, మళ్లీ గర్భం దాల్చడానికి మధ్య కనీసం మూడు సంవత్సరాలకు పైగా గ్యాప్‌ ఉండాలి. 

ఇవన్నీ సరిగానే ఉన్నా, సిజేరియన్‌ సమయంలో గర్భాశయంపైన కోత పెట్టి బిడ్డను బయటకు తీసి, మళ్లీ కుట్టడం జరుగుతుంది. ఆ కుట్లు తొమ్మిది నెలలు బిడ్డ పెరిగే కొద్ది సాగి, అవి పల్చబడటం జరుగుతుంది. ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి, కుట్లు మానే తీరును బట్టి మరో కాన్పును సాధారణ కాన్పు కోసం ప్రయత్నించినప్పుడు, కొందరిలో గర్భాశయం కుట్లు విడిపోయి, గర్భాశయం పగిలి బిడ్డ కడుపులోకి రావడం, బిడ్డ ఊపిరి ఆగిపోవడం, తల్లికి విపరీతమైన బ్లీడింగ్‌ అవడం, షాక్‌లోకి వెళ్లడం వంటి ప్రమాదకరమైన పరిస్థితులలోకి వెళ్లే అవకాశాలు చాలా ఉంటాయి. 

కొందరిలో పెద్దగా ఇబ్బంది లేకుండా, సాధారణ కాన్పు కావచ్చు. ఎవరిలో ఎలా జరుగుతుంది, కాంప్లికేషన్స్‌ ఎప్పుడు వస్తాయి అనేది అంచనా వేయడం కాస్త కష్టం. ముందు కాన్పు ఆపరేషన్‌ ద్వారా జరిగి, మళ్లీ కాన్పును సాధారణంగా ప్రయత్నించడాన్ని ‘వీబీఏసీ’ (వజైనల్‌ బర్త్‌ ఆఫ్టర్‌ సిజేరియన్‌) అంటారు. వీబీఏసీకి ప్రయత్నించాలని అనుకున్నప్పుడు 24 గంటలు గైనకాలజిస్ట్, పిల్లల డాక్టర్, మత్తు డాక్టర్‌ అందుబాటులో ఉండి, అన్ని పరికరాలు, వసతులు ఉన్న హాస్పిటల్‌లోనే అడ్మిట్‌ అవడం మంచిది. లేకపోతే ఆఖరి నిమిషంలో ప్రాణాపాయ పరిస్థితిలోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉండటాయి.

మీకు మొదటి బిడ్డ అడ్డంగా ఉండటం వల్ల ఆపరేషన్‌ చేసి తీశారు. మళ్లీ ఇప్పుడు రెండు సంవత్సరాలకే గర్భం అందింది. తొమ్మిదో నెలలో బిడ్డ బరువు, పొజిషన్‌ని బట్టి, మీ డాక్టర్‌ చెప్పే సలహాను అనుసరించడం మంచిది. రెండోది కూడా సిజేరియన్‌ అయినప్పుడు పెద్దగా సమస్యలేవీ ఉండవు. కాకపోతే మళ్లీ మత్తు ఇవ్వాలి, పొట్ట కొయ్యాలి, కుట్లు వెయ్యాలి, కుట్లు సరిగా మానాలి కాబట్టి కొద్దిగా నొప్పి, అసౌకర్యం తప్పవు.

నా వయసు 30 ఏళ్లు. మూడేళ్ల కిందట రీకానలైజేషన్‌ చేయించుకున్నాను. ఆపరేషన్‌ తర్వాత మళ్లీ పరీక్షలు చేయించుకుంటే, ట్యూబులు బాగానే ఉన్నాయని చెప్పారు. అయితే ఇంతవరకు మళ్లీ గర్భం రాలేదు. రీకానలైజేషన్‌ ఫెయిలై ఉంటుందా? ఒకవేళ ఫెయిలైతే ట్యూబులు బాగానే ఉండే అవకాశాలు ఉంటాయా?
– సౌజన్య, ఉరవకొండ

రీకానలైజేషన్‌ ఆపరేషన్‌లో కుటుంబ నియంత్రణ కోసం చేసే ట్యూబెక్టమీ ఆపరేషన్‌ ద్వారా ముడి వేసి కట్‌ చేసిన ఫెలోపియన్‌ ట్యూబ్‌లను మళ్లీ అతికించడం జరుగుతుంది. ఈ ఆపరేషన్‌ చేసినంత మాత్రాన అది సక్సెస్‌ అయి, మళ్లీ గర్భం వస్తుందన్న గ్యారంటీ ఏమీ లేదు. ఆపరేషన్‌ సమయంలో ట్యూబ్‌లు తెరుచుకున్నట్లు అనిపించినా, కొంతకాలానికి అవి కొద్దిగా లేదా పూర్తిగా మూసుకుపోవచ్చు. మూసుకుపోయిన ట్యూబ్‌లలో గర్భం వచ్చినా, అది ట్యూబ్‌లోనే ఉండిపోయి, ఎక్టోపిక్‌ ప్రెగ్నెన్సీ అవొచ్చు. 

కొందరిలో ట్యూబ్‌లు బయటి నుంచి బాగానే ఉన్నా, లోపలి భాగంలో ఉండే సీలియా పాడై, దాని పనితీరు సరిగా లేకపోవచ్చు. అందువల్ల కూడా గర్భం అందకపోవచ్చు. ట్యూబ్స్‌ బాగానే ఉన్నా, కొన్నిసార్లు అండం విడుదల సరిగా లేకపోవడం, హార్మోన్ల అసమతుల్యత, భర్తలో వీర్యకణాల లోపాలు వంటి ఇతరేతర సమస్యల వల్ల కూడా గర్భం రాకపోవచ్చు. కాబట్టి ఒకసారి గైనకాలజిస్ట్‌ని సంప్రదించి, అవసరమైన పరీక్షలు చేయించుకుని, కారణాన్ని బట్టి చికిత్స తీసుకోవచ్చు. లేకపోతే టెస్ట్‌ట్యూబ్‌ బేబీ పద్ధతి ద్వారా గర్భం కోసం ప్రయత్నించవచ్చు.

- డా. వేనాటి శోభ 
గైనకాలజిస్ట్‌
హైదరాబాద్‌ 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top