అమ్మా నాన్నా సమానమే.. ఎలా సమానమని చెప్పే ‘రాజ్యాంగం’ తెలుసుకుంటే ‘గొడవే’ ఉండదు!

Constitution of India: Sakshi Special Story About Family Constitution

కుటుంబంలో హక్కులు ఉంటాయి... బాధ్యతలు ఉంటాయి. తప్పు ఉంటుంది... క్షమాపణా ఉంటుంది. పైకి చెప్పే నియమాలు ఉంటాయి. ఎవరూ చెప్పని నిబంధనలు ఉంటాయి. దేశానికి రాజ్యాంగం ఉన్నట్టే ప్రతి ఇంటికీ రాజ్యాంగం ఉండాలి. పరస్పర గౌరవం, అవగాహన నుంచి సభ్యుల అవసరం, క్షేమాన్ని బట్టి ఈ రాజ్యాంగాన్ని అమెండ్‌ చేసుకుంటూ వెళ్లాలి. ఇంటి రాజ్యాంగం ఎలా ఉండాలి?

దేశంలో పౌరులంతా సమానమే అని మన రాజ్యాంగం చెబుతుంది. ఇంట్లో సభ్యులు కూడా సమానమే అని కుటుంబం అర్థం చేసుకోవాలి. పిల్లలకు అర్థం చేయించాలి. అయితే అది ఎలాంటి సమానం? నాన్న ఆఫీసుకు వెళ్లడమూ అమ్మ ఇంట్లోనే ఉండి ఇల్లు చూసుకోవాల్సి రావడమూ సమానమే. నాన్న డబ్బు తేవడమూ అమ్మ ఇంటి అవసరాల రీత్యా ఖర్చు పెట్టడమూ సమానమే. నాన్నకు అమ్మ గౌరవం ఇవ్వడమూ అమ్మ మాటకు నాన్న విలువ ఇవ్వడమూ సమానం. నాన్నకు ఎక్కువ కోపం వచ్చినప్పుడు అమ్మకు తక్కువ కోపం రావడం సమానం అవుతుంది.

అమ్మకు చాలా విసుగ్గా ఉన్నప్పుడు నాన్నకు అమితమైన ఓర్పు రావడం సమానం అవుతుంది. పిల్లల భవిష్యత్తు కోసం నాన్న నిర్ణయం తీసుకున్నప్పుడు అమ్మకు అది నచ్చకపోతే, పిల్లలకు అది నచ్చకపోతే నాన్నతో వాదించడం సమానం అవుతుంది. అమ్మ ఏదైనా ఆలోచన చేస్తే అహానికి పోకుండా నాన్న అంగీకరించడమూ సమానం అవుతుంది. అమ్మ మూతి ముడిచినప్పుడు నాన్న నవ్వుతూ ఆ కోపాన్ని ఎగరగొట్టడం సమానం. నాన్న గొంతు పెద్దదైనప్పుడు అమ్మ మంద్రస్వరంతో దానిని నిలువరించడం సమానం అవుతుంది. అమ్మా నాన్నా సమానమే. అయితే ఏ కొలతల ప్రకారం సమానమో పిల్లలకు అర్థం చేయించడం, భార్యాభర్తలు అర్థం చేసుకోవడం ఇంటి రాజ్యాంగంలో రాసుకోవాల్సిన తొలి నియమం.

స్వేచ్ఛ ఎంత ఉండాలి?
కుటుంబంలో అందరికీ స్వేచ్ఛ ఉండాలి. అయితే ఎంత ఉండాలి? అబ్బాయి మోటరు సైకిల్‌ అడిగితే కొనివ్వొచ్చుగాని రోడ్లు అలవాటయ్యేంత వరకూ ఒంటరిగా నడిపే స్వేచ్ఛ ఇవ్వకూడదు. నాన్న వెనుక కూచోవాలి. కొడుకుకైనా కూతురికైనా ఫలానా చదువు చదువుతాను అనే ఎంపికలో స్వేచ్ఛ ఇవ్వాలిగాని ఆ చదువును సక్రమంగా పూర్తి చేసే వరకూ కాలం వృధా చేసే స్వేచ్ఛ ఇవ్వకూడదు.

అమ్మాయికి స్నేహితుల్ని ఎంచుకునే స్వేచ్ఛ ఉండాలి కాని  ఆ స్నేహితులందరితో అమ్మకూ నాన్నకూ పరిచయం ఉన్నప్పుడే ఆ స్వేచ్ఛను పరిగణించాలి. ఫోన్లు వాడే, ఫేస్‌బుక్‌లో ఉండే, వాట్సప్‌ చాట్‌ చేసే స్వేచ్ఛ ఇవ్వాలిగాని ఆ స్వేచ్ఛకు ఒక బాధ్యత ఉంటుందని బాధ్యతకు పరిమితి ఉంటుందని తెలియచేయాలి. పిల్లలు పర్సనల్‌ రూములు అడుగుతారు. కాని తలుపు మూసుకునే స్వేచ్ఛకూ గడియ వేసుకునే స్వేచ్ఛకూ మధ్య ఉన్న అంతరాన్ని సున్నితంగా హెచ్చరించాలి. బాధ్యత కలిగినదే స్వేచ్ఛ అని కుటుంబ రాజ్యాంగంలో రాసుకోవాలి.

సర్దుబాటు ఎలా ఉండాలి?
అమ్మ ఇంటి పనిలో అలసి పోతే కొడుకు ఆ పనిని సర్దుబాటు చేసేలా ఉండాలి. వంట వీలుగాకపోతే నాన్న స్విగ్గీకి ఆర్డరు చేసే సర్దుబాటు చేయగలగాలి.  నాన్నకు పొదుపు తెలియకపోతే అమ్మ చిట్టీ కట్టాలి. అమ్మ దుబారా చేస్తుంటే నాన్న అప్పులున్నాయని చెప్పి పాలసీ కడుతుండాలి. పిల్లలు బ్రాండెడ్‌ బట్టలు అడిగితే ఫ్యాక్టరీ ఔట్‌లెట్‌లో బోలెడంత వెరైటీ ఉంటుందని పట్టుకుపోవాలి. నిస్సాన్‌ అడిగితే నానోకు కూడా నాలుగు చక్రాలే ఉంటాయని చెప్పగలగాలి. పాకెట్‌ మనీ పెంచమంటే అబ్దుల్‌ కలాం పేపర్‌బాయ్‌గా చేశాడని చెప్పి స్వీయ సంపాదన నేర్పించాలి. గోల్డ్‌ లేకపోయినా ఒన్‌ గ్రామ్‌ గోల్డయినా అమ్మకు బాగుంటుందని చెప్పాలి. చిన్న చిన్న సంతోషాలు కావాలంటే చిన్నపాటి సర్దుబాటు చేయాలని కుటుంబ రాజ్యాంగంలో రాసుకోవాలి.

నిరసన ఎప్పుడు చూపాలి?   
పని మనిషిది ఫలానా కులమని నానమ్మ పనిలో వద్దంటుంది. అప్పుడు నిరసన చూపాలి. మనవడి స్నేహితుణ్ణి చూసిన తాతయ్య అతడు ఫలానా మతం కదా స్నేహం వద్దు అన్నప్పుడు నిరసన చూపాలి.  అమ్మాయి ఫలానా ప్రాంతం వారంటే ద్వేషం అన్నప్పుడు నిరసనతో సరిచేయాలి. ఇల్లు ఫలానా వారికి అద్దెకు ఇవ్వం అని మన ఇంట్లోని వాటాకు నియమం పెడితే నిరసన చూపించాలి. మన కుటుంబం మనకు ఎంత ముఖ్యమో ఇంకో కుటుంబం కూడా వారికి అంతే ముఖ్యం. అన్ని కుటుంబాలు దేశానికి ముఖ్యమని అవగాహన కల్పించుకోవాలి.

సమాజానికి ఏమి ఇవ్వాలి?
కుటుంబం సమాజంలో ఒక భాగం. కుటుంబం ముందు కుదురుకుంటే సమాజం కూడా కుదురుకుంటుంది. మన కుటుంబం కుదురుకున్నాక, మన కుటుంబం సమాజంతో కలిసి జీవిస్తున్నాక సమాజానికి ఏమి ఇవ్వాలో ఆలోచించడం కూడా కుటుంబ బాధ్యతే. అనాథలకు, అభాగ్యులకు వీలైతే సాయం చేయాలి. రైతులో, కార్మికులో కష్టాలలో ఉన్నప్పుడు వారికి సంఘీభావం చూపగలగాలి. ద్వేషం, విభజన కోసం కొందరు ప్రయత్నిస్తున్నప్పుడు సామరస్యం కోసం ఏదో ఒక పని చేయాలి. పాలన వ్యవస్థ తప్పులు చేస్తున్నప్పుడు అవి ఎత్తి చూపించగలగాలి. పాలనలో తప్పు సమాజానికి ప్రమాదం. సమాజంలో తప్పు కుటుంబానికి ప్రమాదం. కుటుంబం అంటే మన కుటుంబం మాత్రమే కాదని సమాజం ఆ తర్వాత దేశం కూడా మన కుటుంబమే అనుకుంటే మన కుటుంబ సభ్యుల పట్ల ఎంత ప్రేమ, బాధ్యతగా ఉంటామో దేశ పౌరులందరి పట్లా అంతే ప్రేమగా బాధ్యతగా ఉంటాము.

అలాంటి ప్రేమ, బాధ్యతలలోకి ప్రతి కుటుంబం మేలుకోవాలి. వెలుగు చూడాలి. అందుకు తప్పక పట్టు విడుపుల నియమావళి రాసుకోవాలి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top